AP Politics: నామినేటెడ్ హడావుడి.. వారికే అధిక ప్రాధాన్యం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే నామినేటెడ్ పదవుల నియామకం జరిపేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Update: 2024-06-26 03:22 GMT

దిశ ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే నామినేటెడ్ పదవుల నియామకం జరిపేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు నామినేటెడ్ పదవుల పందేరం త్వరలోనే జరగనుంది. అలాగే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కొందరు ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ వంటి పదవులు కోల్పోయారు.

అలా పదవులు కోల్పోయిన వారితో పాటు ప్రముఖ నాయకుల బయో డేటాలు తీసుకొని పార్టీకి ఆయా నాయకులు అందించిన సేవలను వివరిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయం జాబితాను రూపొందిస్తోంది. ప్రాంతాల వారీగా సామాజిక సమీకారణాలను దృష్టిలో ఉంచుకొని జాబితాలు తయారుచేస్తున్నారు.

జనసేనకు కీలక పదవులు..

ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీకి ప్రత్యేక కోటా కింద నామినేటెడ్ కీలక పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ మధ్య ఓ ఒప్పండం కుదిరినట్టు తెలిసింది. ఎన్నికల వెళ పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా అన్ని విషయాల్లో తగ్గి వ్యవహరించారు.

అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు తగ్గించుకున్నారు. ఆ కారణంతో నామినేటెడ్ పదవుల్లో మరిన్ని పదవులు జనసేనకు కేటాయించాలని పవన్ కల్యాణ్ కోరడం, అందుకు చంద్రబాబు అంగీకరించడం ఎన్నికలకు ముందే ఇద్దరి మధ్య అవగాహన కుదిరినట్టు తెలిసింది. ఆ మేరకు జనసేన పార్టీ కూడా తమ పార్టీలో నామినేటెడ్ పదవులకు అర్హుల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.

జులై 12న ఎమ్మెల్సీ ఉపఎన్నికలు..

కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత జులై 1 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండు స్థానాలలో ఒకటి పవన్ కళ్యాణ్ గెలుపునకు సహకరించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఇవ్వనున్నట్టు తెలిసింది. పవన్ కల్యాణ్‌ను గెలిపించుకు రండి.. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు బాబు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. రెండో ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కనుందన్న అంశంపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది.

ఆ స్థానం ఉండి మాజీ ఎమ్మెల్యే రామ రాజుకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. రఘు రామ కృష్ణం రాజు కోసం రామ రాజు టీడీపీ టికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ స్థానం కోసం పలువురు సీనియర్లు ఆశలు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద నామినేటెడ్ పదవుల పందేరంపై టీడీపీ, జనసేన పార్టీల్లో హడావుడి ప్రారంభమైంది.


Similar News