ధరణి పోర్టల్ తో పేదల భూములు కొల్లగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ధరణి పోర్టల్ తీసుకువచ్చి పేదల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2023-05-11 11:02 GMT

దిశ, శంషాబాద్: ధరణి పోర్టల్ తీసుకువచ్చి పేదల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర 56వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ, సుల్తానాబాద్ ఎక్స్ రోడ్, వెంకటపురం చౌరస్తా వరకు కొనసాగిన పాదయాత్రలో భట్టి విక్రమార్క నేరుగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్కుడ గ్రామాంలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో భట్టి విక్రమార్కను సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన భూములు, మన నీళ్లు మనకే అని కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్ర అన్యాయానికి గురైనారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా వెనక్కి గుంజుకొని పేదలకు భూములు లేకుండా చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల చుట్టూ 25 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను బలవంతంగా పేదల నుంచి తీసుకోగా ఒక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోనే 5 లక్షల కోట్ల రూపాయల విలువైన పదివేల ఎకరాల భూములను తీసుకొని, తెలంగాణ లక్ష్యాన్ని ఆకాంక్షలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు.

శంషాబాద్ మండలంలో దశాబ్దాల తరబడి వేల ఎకరాలు సాగు చేసుకుంటున్న బహదూర్ గూడ, ఘాన్సిమియ గూడ, కోత్వాల్ గూడలోని రైతులకు ధరణి తీసుకువచ్చి దగా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వగా బీఆర్ఎస్ ప్రభుత్వం వీరి భూములను ధరణిలో పార్ట్ బి నమోదు చేసి కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని అన్నారు. ఎకరానికి నాలుగు కోట్లు ఖరీదు చేస్తున్న ఈ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో పార్ట్ బి లో నమోదు చేయడం వల్ల రైతుల అవసరాలను సొమ్ముగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు కొంతమంది దళారులుగా మారి ఎకరాకు 15 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ రైతులను నిట్ట నిలువున ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లను తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేయగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైన్ చేసి కాలేశ్వరం పేరుతో నీళ్లు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకున్నదని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి 9 సంవత్సరాలు అవుతున్న చుక్క నీరు ఇవ్వలేదని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే రంగారెడ్డి జిల్లాకు తాగు, సాగునీరు అందుతున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గడ్డం శేఖర్ యాదవ్, సంజయ్ యాదవ్, కోటేష్ గౌడ్, కృష్ణారెడ్డి, సానెం శ్రీనివాస్ గౌడ్, ధనుంజయ్, మహేందర్, శేఖర్ గుప్తా తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News