రాహుల్ ‘సావర్కర్’ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు ఏమన్నారంటే..?
తన పేరు సావర్కర్ కాదని.. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేది లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి.
దిశ, వెబ్ డెస్క్: తన పేరు సావర్కర్ కాదని.. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేది లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. బీజేపీతో పాటు శివసేన రాహుల్ వ్యాఖ్యలను ఖండించాయి. తాజాగా రాహుల్ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని అన్నారు. దమ్ముంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ క్షమాపణలు చెప్పినట్లు సాక్ష్యాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.
తాను ఎవరికీ క్షమాపణలు చెప్పే వ్యక్తిని కాదని రాహుల్ చెబుతున్నారన్న ఆయన.. గతంలో రెండు సార్లు రాహుల్ సుప్రీంకోర్టుకు సారీ చెప్పారని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సావర్కర్ వంటి దేశభక్తులను వాడుకోవడం సరికాదని హితవు పలికారు. రాహుల్ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.