కిసాన్ సమ్మాన్ నిధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభంలో ఎంత మంది రైతులకు ఇచ్చారు..ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నరో లెక్కలు చెప్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ 2వేల కోట్లు ఇచ్చామని గొప్పలు చెప్తున్నారని,కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 60వేల కోట్లు రైతు బంధు కింద ఇచ్చారని తెలిపారు.
మోడీ ఇచ్చింది ఏ మూలకు సరిపోదన్నారు. రాష్ట్రంలో రైతు బంధు కింద లబ్దిదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంటే,కేంద్ర పథకంలో రైతుల సంఖ్య తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో 14 జాతీయ రహదారులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం లక్షా25 వేల కోట్లు కాగితాల మీద మంజూరు చేసి ఇప్పటివరకు ఖర్చు చేసింది మాత్రం 20వేల కోట్లేనని అన్నారు. అంటే ఏడాదికి 2వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ పోతే 50 ఏళ్లకు పూర్తి చేస్తారా అని ప్రశ్నించారు.