అసెంబ్లీ ఎన్నికలకు ప్లాన్ రెడీ.. ఆ ఫార్ములా అమలుకు KCR వ్యూహం

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మునుగోడు ఫార్మూలాను అనుసరించబోతున్నది.

Update: 2022-11-16 02:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మునుగోడు ఫార్మూలాను అనుసరించబోతున్నది. ఆ నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి యూనిట్ ఇన్ చార్జీలను పార్టీ అధిష్టానం నియమించి.. విజయం సాధించింది. అదే ఫార్మూలాను అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాలని, అందుకు ఒక్కో నియోజకవర్గాన్ని 100 యూనిట్లుగా విభజించనున్నారు. ప్రతి యూనిట్​కు ఒక ఇన్​చార్జిని నియమించి ఎన్నికలు ముగిసేవరకు బాధ్యత అప్పగించనున్నారు. అదే విధంగా వందమంది ఓటర్లకు ఓ కోఆర్డినేటర్​ను నియమించే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. కో ఆర్డినేటర్ల లిస్టును జిల్లా మంత్రికి అందజేస్తే వారు పార్టీ అధినేత కేసీఆర్​కు అందజేయనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం తెలంగాణ భవన్​లో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకునేందుకు నియోజకవర్గాల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అన్ని గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించిన కేసీఆర్... వాటి ప్రారంభోత్సవాలు చేయాలని, ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. పనితీరు మార్చుకోవాలని... ఇంకా మెరుగుపడాలని కొంతమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించినట్లు సమాచారం.

Tags:    

Similar News