చెవిలో పువ్వుతో అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం!

కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Update: 2023-02-17 10:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ ప్రజలను ఫూల్స్ చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సహా ఇతర ఎమ్మెల్యేలు తమ చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండానే తాజాగా మరో ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు.

2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిందని విమర్శించారు. కాగా మరో రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఈ టర్మ్ లో ఇదే చివరి బడ్జెట్. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికలే టార్గెట్ గా బస్వరాజు బొమ్మై రైతులపై వరాలు కురిపించారు. రైతులకిచ్చే వడ్డీలేని రుణ పరిమితిని రూ.2 లక్షల మేర పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. అలాగే భూమి లేని మహిళా కూలీలకు నెలకూ రూ. 500 ఆర్థిక సాయం అందించబోతునట్లు తెలిపారు. 

Tags:    

Similar News