రాజకీయ తోకచుక్కలు: ఆరంభం ఘనం.. విలీనంతో కథ సమాప్తం!
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ప్రాణం పోసుకున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ప్రాణం పోసుకున్నాయి. రాజకీయాల కోసం కొన్ని పురుడుపోసుకుంటే.. పోరాటాల కోసం మరికొన్ని ప్రాణం పోసుకున్నాయి. కాలం గడిచే కొద్దీ వాటిల్లో అనేక పార్టీలు కనుమరుగయ్యాయి. అవి ఎప్పుడు ఆవిర్భవించాయో, ఎప్పుడు మాయమయ్యాయో చాలా మందికి తెలియదు. కొన్ని పార్టీల పేర్లు వింటే ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. అందులో కొన్ని చరిత్ర సృష్టిస్తే.. మరికొన్ని తక్కువ సమయంలోనే కనబడకుండా పోయాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. మరి వాటిని స్థాపించింది ఎవరు? ఏ ఉద్దేశంతో అవి ఏర్పడ్డాయి. వాటి లక్ష్యం నెరవేరిందా? లేదా? చివరకు ఏ పార్టీ ఎటుపోయింది?
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో..
1960వ దశకంలో జరిగిన తెలంగాణ ఉద్యమ తొలి దశ పోరాటం సందర్భంగా 1969 ఫిబ్రవరి 28న 'తెలంగాణ ప్రజా సమితి' పార్టీని ప్రతాప్ కిశోర్ ప్రారంభించారు. పలు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఈ పార్టీని అనంతరం ప్రముఖ నాయకుడు మర్రి చెన్నారెడ్డి తన చేతుల్లోకి తీసుకున్నారు. 1969లో పలు పరిణామాల నేపథ్యంలో ఉద్యమాలు నిలిపివేసి విద్యాసంస్థలకు వెళ్లాలని, గ్రామీణులు వ్యవసాయ పనుల్లోకి వెళ్లాలని 1969 సెప్టెంబరు 23వ తేదీన తెలంగాణ ప్రజా సమితి పార్టీ పిలుపునిచ్చింది. తర్వాత రెండేండ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తిగా నిలిచిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 10 ఎంపీ సీట్లు సాధించి సత్తా చాటింది.
1971 సెప్టెంబరు 24న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసిన తర్వాత చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతర కాలంలో చెన్నారెడ్డి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా.. 1983లో వందేమాతరం రాంచందర్ రావు అధ్యక్షుడిగా, ప్రతాప్ కిశోర్ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ప్రజా సమితి పార్టీ మళ్లీ ఆవిర్భవించింది. 2015 వరకు కొనసాగిన ఈ పార్టీ అధ్యక్షుడిగా నీరా కిశోర్ ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీ క్రమంగా కనుమరుగైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ..
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 'ప్రజలే పాలకులు.. నేను వారధిని..' అనే నినాదంతో ప్రారంభించిన ఆ పార్టీ 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లోనే గెలిచింది. పార్టీని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక పోయిన చిరంజీవి 2011 ఫిబ్రవరి 6వ తేదీన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2006 అక్టోబరు 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సత్తా పార్టీని మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించారు. రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన శుద్ధ వాతావరణం తేవాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పార్టీ తరఫున జయప్రకాశ్ నారాయణ్ ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా మావల్ తాలూకాలో గల 'అడెలె' గ్రామ పంచాయతీలో 6 వార్డుల్లో గెలిచిన లోక్ సత్తా పార్టీ తరఫున నికితా ఘోట్కులే సర్పంచ్‌గా కూడా పని చేశారు. ఇక లోక్ సత్తా పార్టీని రద్దు చేయకున్నా పార్టీ కార్యకలాపాలకు జయప్రకాశ్ నారాయణ్ ఇటీవల దూరంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్టు నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో నాటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 'జై సమైక్యాంధ్ర' పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరిరావు, పార్టీ వ్యూహకర్తగా లగడపాటి రాజగోపాల్ వ్యవహరించారు. ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో తర్వాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకటనతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఆ సమయంలో తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి 'రాయలసీమ పరిరక్షణ సమితి' పార్టీని స్థాపించారు. అనంతర కాలంలో ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది.
తెలంగాణలో..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం టీడీపీ నుంచి బయటకు వచ్చిన కే చంద్రశేఖర్ రావు.. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో ఆయనతో పాటు చాలా మంది నేతలు కలిసి నడిచారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అనంతరం బీఆర్ఎస్, పార్టీ అధినేత వైఖరితో విభేదించిన చాలా మంది లీడర్లు అందులోంచి బయటకు వచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. లక్ష్యం నెరవేరలేదంటూ కొత్త పార్టీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన చెరుకు సుధాకర్ 2017 జూన్ 2వ తేదీన 'తెలంగాణ ఇంటి పార్టీ'ని స్థాపించారు. 'తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక శక్తులకు గుర్తింపు, సామాజిక తెలంగాణ' అనే నినాదాలతో ప్రారంభించి.. పార్టీ ఆధ్వర్యంలో పలు పోరాటాలు చేశారు.
2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. నిధుల కొరత కూడా తోడవడంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టు 2022 ఆగస్టు 5న ఆయన ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా 2018 సెప్టెంబరు 5న యువ తెలంగాణ పార్టీని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన.. తన పార్టీ తరఫున భువనగిరి నుంచి పోటీ చేసిన మూడో స్థానానికి పరిమితమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫున 2019, 2021ల్లో పోటీ చేసిన రాణి రుద్రమ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2022 ఫిబ్రవరి 16వ తేదీన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత స్థాయిలో నడుస్తున్నప్పుడు టీడీపీ నేత దేవేందర్ గౌడ్ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2008, జులై 11న నవ తెలంగాణ పార్టీని ప్రారంభించారు.
కొంత కాలానికే దానిని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా గుర్తింపు పొందిన కాసాని జ్ఞానేశ్వర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2007లో 'మన పార్టీ'ని స్థాపించారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా పెద్దగా ప్రభావం చూపని కాసాని 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2022 అక్టోబరు 14వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. దీంతో మన పార్టీని టీడీపీలో కాసాని విలీనం చేసినట్లు అయింది.