బుల్డోజర్ పాలన ప్రజాస్వామ్యమా?.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

బుల్డోజర్ పాలన ప్రజాస్వామ్యమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.

Update: 2023-03-11 16:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యూపీ తరహా బుల్డోజర్ పాలనను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామికంగా అమలు చేయడం, విపక్షాలను, ప్రశ్నించే వారిని, విపక్ష ప్రభుత్వాలను కూలదోయడం మోడీ తరహా నియంత పాలనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. శనివారం మగ్ధూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి ముగింపు సభలో కూనంనేని ప్రసంగించారు. గత ఏడేండ్లుగా బీజేపీ పాలనలో దేశంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరిగాయని అన్నారు. ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి అదానీకి ఆరు ఎయిర్ పోర్టులు ఇచ్చి దేశాన్ని అవినీతి మయంగా మోడీ మార్చారని విమర్శించారు.

అదానీకి చెందిన ముండ్రా పోర్టులో 20,000 కోట్లు విలువ చేసే హెరాయిన్ దొరికితే కేసు కాలేదని, అదానీని విచారించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలో చేరగానే వారి కేసులన్నీ మాయమైపోయాయని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ ప్రభుత్వం కూల్చి వేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అంబేద్కర్ జయంతి రోజు పాదయత్రలు ప్రారంభం

బీజేపీకి హటావో, దేశ్‌కు బచావో.. ప్రజా సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుంచి మే 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో పాదయాత్రలు చేస్తామని, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఉద్యమిస్తామని కూనంనేని తెలిపారు. అర్హత కలిగిన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోడు సాగుదారులందరికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని, ధరణిలో చోటు చేసుకున్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో మతోన్మాదాన్ని నిలువరించి, లౌకికవాదం రక్షించాలని రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు.


Tags:    

Similar News