AP Politics: నడిపించే నాథుడేడీ..ఫలితాల తర్వాత పల్నాడు వైసీపీలో అయోమయం

మొన్నటిదాకా నియోజకవర్గాలకు వాళ్లే బాస్‌లు.

Update: 2024-07-04 02:59 GMT

దిశ, సత్తెనపల్లి: మొన్నటిదాకా నియోజకవర్గాలకు వాళ్లే బాస్‌లు. ఐదేళ్లు హవా నడిపారు. అయితే ఎన్నికల తరువాత సీన్ మారింది. ఈ ఎన్నికల్లో పరాజయంతో నేతలు ఎవరు ఇప్పుడు నియోజకవర్గాలకు రావడం లేదు. దీనితో తమను నడిపించే నాయకుడు ఎవరనే దానిపై కార్యకర్తలలో అయోమయం నెలకొంది.

జిల్లా పార్టీ అధ్యక్షుడు జైలులో..

పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన తమ్ముడు వెంకట్రామి రెడ్డి కూడా పార్టీ రీజినల్ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే పిఆర్కే రిమాండ్‌కు వెళ్లారు. ఆయన తమ్ముడు వెంకట్రామి రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీని ముందుండి నడిపించేది ఎవరని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

అడ్రస్ లేని అంబటి..

సత్తెనపల్లి నుండి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పని చేస్తున్నారు. అధికార ప్రతినిధిగా తన గళం వినిపిస్తున్నారు. అయితే నియోజకవర్గానికి మాత్రం మొఖం చాటేస్తున్నారు. ఇక్కడ అంబటి ప్రధాన అనుచరుడు కళ్ళెం, మున్సిపల్ చైర్మన్ భర్త చల్లంచర్ల సాంబశివరావులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయిన నేతలు నంబూరి శంకర రావు, బొల్లా బ్రహ్మనాయుడు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు.

ఇక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండటమే కారణమని చర్చలు నడుస్తున్నాయి. దీంతో వీరు పాలిటిక్స్ ను పక్కన పెట్టి తమ వ్యాపారాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఏ మేరకు ముందుకొస్తారో అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

రజని దారి.. రహదారి..

ఇక చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహించిన విడదల రజని గుంటూరు వెస్ట్‌కు మారి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో పేట నుండి పోటీ చేసి పరాజయం పాలైన కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ సీట్లో తిరిగి కూర్చుకున్నారు. ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరా అన్నది ఇంకా తేలలేదు. ఇక నర్సరావుపేట నుండి పోటీ చేసి ఓడిపోయిన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, గురజాలకు గతంలో ప్రాతినిధ్యం వహించిన కాసు మహేష్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు.

అటు కాసు మహేష్ కూడా పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని వ్యాఖ్యానించారు. దీంతో కాసు మహేష్, గోపిరెడ్డిల్లో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీరిద్దరూ కూడా పార్టీ సారధ్య బాధ్యతలు అందుకునేందుకు ఎంత మేరుకు ముందుకొస్తారో వేచి చూడాల్సి ఉందని వైసీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. మొత్తం మీద ఓటమీ తర్వాత పార్టీని నడిపించే నాయకుడి కోసం నేతలే కాదు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైనా పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేతల్ని ఢీ అంటే ఢీ అంటూ పార్టీని ముందుకు నడిపించేందుకు సమర్థవంతమైన నాయకుడు కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.


Similar News