జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమా?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని.. వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు క్షమాపణ చెప్పాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని.. వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు క్షమాపణ చెప్పాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ మెయిలింగ్ పద్దతులు రేవంత్ మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు. గొల్ల కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమానపరిచారని, మేము మా భాధను, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నారు. మా జాతులు నీతి నిజాయతీగా బతుకుతాయి.. అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి అని, రేవంత్ రెడ్డి గతంలో కూడా కుల దూరహంకారంతో మాట్లాడారని మండిపడ్డారు.
తమకే పాలన తెలుసు అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన కులం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినప్పుడు కూడా నిరసనలు వ్యక్తం చేశారన్నారు. రేవంత్ రెడ్డి తన నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదని, రేవంత్ లాగా శ్రీనివాస్ యాదవ్‌కు నేర చరిత్ర ఉందా? ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూత నందిస్తే రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడన్నారు.. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమా? రేవంత్ రెడ్డి గొల్ల కురుమలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ పద్దతులు మానుకోవాలని, లేకుంటే గొల్ల కుర్మలతో పాటు బడుగు, బలహీన వర్గాలు సైతం తగిన శాస్త్రీ చెబుతాయన్నారు.
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం రేవంత్ ప్రవృత్తి అని, శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని మండి పడ్డారు. రేవంత్ తక్షణమే గొల్ల కురుమ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ యాదవ్‌తో రేవంత్‌కు పోలిక ఎక్కడిదన్నారు. రేవంత్‌కు సంస్కారం లేదన్నారు. రేవంత్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఆయన్ను ఓడిస్తారని హెచ్చరించారు. ముందు తన పార్టీ నేతల విమర్శలపై రేవంత్ సమాధానం చెప్పాలని, శ్రీనివాస్ యాదవ్‌పై విమర్శలు చేయడం కాదన్నారు. రేవంత్ తన దూరహంకారానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Also Read.
Revanth Reddy: యాదవ సంఘాల డెడ్‌లైన్.. రేవంత్ రెడ్డి సారీ చెప్తాడా?