ప్రధాని రేసు నుంచి రాహుల్ ఔట్.. ఎనిమిదేళ్ల వరకు నో చాన్స్?

మోడీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.

Update: 2023-03-24 10:54 GMT

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే సూరత్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ కు 30 రోజుల గడువు ఉంది. ఒక వేళ హైకోర్టు ఈ కేసును కొట్టివేయకపోతే.. రాహుల్ గాంధీ వచ్చే ఎనిమిదేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాడు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు కపిల్ సిబల్ వంటి నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధే తమ పీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ చెబుతూ వస్తోంది. అయితే రాహుల్ పై 8 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే ఛాన్స్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. దీంతో మోడీ, బీజేపీపై కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీని లోక్ సభలో ఎదుర్కోలేకే పీఎం మోడీ పథకం ప్రకారం ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని మండిపడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక రాహల్ గాంధీ అనర్హుడు కావడం వెనుక ఉన్న విషయానికొస్తే.. 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కర్ణాటకలోని కొలార్ లో నిర్వహించిన రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ.. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోడీ ఇంటిపేరుతో ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన లలిత్ మోడీ, నీరవ్ మోడీ పేర్లను ప్రస్తావించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. రాహుల్ పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదు కాగా.. ఈ కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేస్తూ తీర్పు వెలువరించింది.

Read More: ఎంతవరకైనా సిద్ధం.. అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ


Tags:    

Similar News