గ్రేటర్ చుట్టూ రాజకీయం.. పీఠమే ఎజెండా!
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని పార్టీలది ఇప్పుడు ఒకే ప్రాధాన్యత అంశం.., ఒక్కటే లక్ష్యం. గ్రేటర్ ఎన్నికలు.. గ్రేటర్ పీఠం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకున్నా.. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దిగాయి. గ్రేటర్ సమస్యలే ఎజెండాగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రచారాన్ని సాగిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోగా.. ప్రస్తుతం మార్కెట్‌కు వచ్చే ధాన్యానికి సరైన గిట్టుబాటు లేని పరిస్థితి. ఈ అంశాలేవి ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని పార్టీలది ఇప్పుడు ఒకే ప్రాధాన్యత అంశం.., ఒక్కటే లక్ష్యం. గ్రేటర్ ఎన్నికలు.. గ్రేటర్ పీఠం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో స్పష్టత లేకున్నా.. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలోకి దిగాయి. గ్రేటర్ సమస్యలే ఎజెండాగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రచారాన్ని సాగిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోగా.. ప్రస్తుతం మార్కెట్‌కు వచ్చే ధాన్యానికి సరైన గిట్టుబాటు లేని పరిస్థితి. ఈ అంశాలేవి ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలో లేకుండాపోయాయి. జాతీయ స్థాయి నేతల నుంచి గల్లీ లీడర్ల వరకూ హైదరాబాద్‌లో ఒకటే చర్చ.. గ్రేటర్ఎన్నికలు..
స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.., గ్రేటర్ బరిలో నిలిచేందుకు తటపటాయించింది. అప్పట్లో టీఆర్ఎస్కు ఎలాంటి పట్టులేకపోవడం, చేజేతులా గ్రేటర్ పీఠాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఆలస్యంగా ఎన్నికలకు వెళ్లి ఊహించని రీతిలో టీఆర్ఎస్ విజయ పతాకం ఎగురవేసింది. గ్రేటర్ పీఠం దక్కిన ఈ ఐదేళ్లకాలంలో నగరానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నీ తానయ్యాడు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల కంటే హైదరాబాద్‌లో ఈ ఐదేళ్లలో ప్రతీ శిలాఫలకంలో తన పేరుండేలా ముద్రవేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలు సీఎం కేసీఆర్ కంటే తనయుడు మంత్రి కేటీఆర్ కు సవాల్‌గా మారింది. నిన్నటి దుబ్బాక ఎన్నికల్లో హరీశ్ రావు తన భుజాలపై వేసుకోగా, ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్‌కు జీవన్మరణ సమస్యగా మారనుంది.
పక్కకుపోయిన రాష్ట్ర సమస్యలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంట నష్టపోయారు. హైదరాబాద్‌లో పరిహారం ఇచ్చినట్టే రైతులకు సహాయం అందుతుందని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం మార్కెట్‌కు రావడంతో రైతులు మార్కెటింగ్, గిట్టుబాటు ధర సమస్యలతో సతమతమవుతున్నారు. అయినా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అటువైపు దృష్టి పెట్టడం లేదు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు గ్రేటర్ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం సైతం నగర సమస్యలనే గెలుపు అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి.
సంక్షేమ పథకాలు వర్సెస్ ప్రభుత్వ వైఫల్యాలు
ఆరేండ్లలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో విఫలమైన అంశాలనే విపక్షాలు ఎజెండాగా మల్చుకొని గ్రేటర్ పోరుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల వరదల సందర్భంలో ప్రభుత్వ ఫెల్యూర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విజయవంతంగా ముందుకెళ్లాయి. ఇదే సందర్భంలో సమాధానంగా అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పడుతోంది. నగరంలోని బస్తీ దవాఖానాలు, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలతో వార్డుల్లో ప్రజలతో మమేకమయ్యేలా కదులుతోంది. ప్రభుత్వం ప్రధాన హామీల్లో డబుల్ బెడ్రూం, బస్తీ దవాఖానాలు, టాయిలెట్లు వంటి ప్రధానమైనవి.
వీటి అమల్లో టీఆర్ఎస్ ఆరేండ్లలోనూ చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేదు. 200 పైగా బస్తీ దవాఖానాలు ప్రారంభించిన ప్రభుత్వం, డబుల్ బెడ్ రూం ఇళ్లను సైతం అందించి ఎలక్షన్లకు వెళ్తామని హామీనిచ్చింది. నోటిఫికేషన్ వెలువడే సందర్భంలో ఏ విధంగా ముందుకెళ్తుందో తేలాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీలు సైతం ఇవే పథకాలను ప్రధాన వైఫల్యాలుగా ప్రజల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ ప్రతిష్టాత్మక హామీలను సైతం అమలు చేయడం లేదని ఎన్నికల్లో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
అన్ని రాజకీయ పక్షాలన్నీ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా, వరద సాయం పంపిణీలో బాధితులకు జరిగిన అన్యాయంపై దృష్టి పెడుతున్నాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తుంటే.. వాటిల్లో వైఫల్యలాలను, ప్రభుత్వ అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కౌంటర్ వేయాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.