అంతా మా ఇష్టం.. హుజురాబాద్‌లో పొలిటికల్ పార్టీలపై విమర్శలు.!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల కమిషన్ నిబంధనలకు తోడు కొవిడ్ కారణంగా ఈసీఐ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అయినా హుజురాబాద్‌లో మాత్రం వాటిని అమలు చేసేందుకు రాజకీయ పార్టీలు నో అని చెప్పేస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో జనంతో సభలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యం గురించి మాకేం పట్టింపు అన్న రీతిలో సాగుతోంది పొలిటికల్ పార్టీల ప్రచారం తీరు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే కోడ్ కూసిందని […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికల కమిషన్ నిబంధనలకు తోడు కొవిడ్ కారణంగా ఈసీఐ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అయినా హుజురాబాద్‌లో మాత్రం వాటిని అమలు చేసేందుకు రాజకీయ పార్టీలు నో అని చెప్పేస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో జనంతో సభలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యం గురించి మాకేం పట్టింపు అన్న రీతిలో సాగుతోంది పొలిటికల్ పార్టీల ప్రచారం తీరు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే కోడ్ కూసిందని ఎన్నికల అధికారులు ప్రకటించినా తమకేమీ పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలు ఏం చెప్తున్నాయ్..
నామినేషన్ మొదలు కౌంటింగ్ వరకు పాటించాల్సిన నిబంధనలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి కౌంటింగ్ వరకు ఎలా వ్యవహరించాలి అన్న వివరాలను స్పష్టంగా పేర్కొంది. నామినేషన్ వేసే సందర్భంలో ఎంతమంది ఉండాలి, బహిరంగ సభల్లో ఎంత మంది పాల్గొనాలి.. అన్న విషయంలపై స్పష్టత ఇచ్చింది. నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీట్లర్ల దూరం వరకు కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్ ప్రచారంలో అయితే మీటింగ్ హాల్ కెపాసిటీలో 30శాతం లేక 200 మంది మాత్రమే ఉండాలని పేర్కొంది.
అయితే ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ సంఖ్య దాటకుండా ప్రచారం కోసం సమావేశాలు నిర్వహించుకోవచ్చు. మీటింగ్ జరిగే హాల్‌లోకి వచ్చేవారి పేర్లతో అధికారులు హాజరు రిజిస్టర్ పెట్టి నమోదు చేయాల్సి ఉంటుంది. ఔట్ డోర్‌లో కొవిడ్–19 నిబంధనలను పాటిస్తూనే స్టార్ క్యాంపేనర్లు హాజరయ్యే మీటింగ్ అయితే కెపాసిటీలో 50శాతం లేదా 1000 మంది, వీటిలో ఏది తక్కువగా ఉంటే ఆ సంఖ్య మేరకు నిర్వహించాల్సి ఉంటుంది. స్టార్ క్యాంపేనర్లు కానీ వారు నిర్వహించే సమావేశాలు ఔట్ డోర్‌లో అయితే 500 మందిని మాత్రమే మీటింగ్‌కు అనుమతి ఉంది.
ఇక జాతీయ పార్టీలు, రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు తమ స్టార్ క్యాంపేనర్లుగా కేవలం 20 మందిని మించకుండా నియమించుకోవచ్చు. అదే గుర్తింపులేని పార్టీలైతే 10 మంది మాత్రమే స్టార్ క్యాంపేనర్లను ప్రచారానికి వాడుకోవాలి. రోడ్డు షోలకు, మోటర్, బైక్, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు. వాడల్లో జరిగే మీటింగ్‌లలో 50 మందికే అనుమతి ఉంటుంది. ఇంటింటి ప్రచారానికి అభ్యర్థి లేదా ఆయన ప్రతినిధితో కలిసి ఐదుగురికే అనుమతి ఉంటుంది.
వీడియో వ్యాన్ ప్రచారంలో కేవలం 50మంది ఆడియన్స్ మాత్రమే కొవిడ్ నిబంధనల పాటిస్తూ చూడాలి. పోలింగ్ ముగిసే సమయం కంటే 72 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారాలు నిలిపివేయాలి. పోలింగ్ రోజు కార్యక్రమాలకు రెండు వాహనాల్లో ముగ్గురికి మించకుండా వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్, కౌంటింగ్ విధుల్లో సిబ్బంది సహా ఏజెంట్లంతా ఖచ్చితమైన కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటికీ ఈ నిబంధనలు పాటిస్తున్న వారే కనిపించడం లేదు. చాలా చోట్ల ఇబ్బడి ముబ్బడిగా జనాన్ని సమీకరిస్తున్నారు.
ఆరంభంలోనే కఠినంగా వ్యవహరించకపోతే ముందు ముందు నిబంధనలు తుంగలో తొక్కే ప్రమాదం లేకపోలేదు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ తమను పట్టించుకునే వారు ఎవరూ ఉండరన్న ధీమాతో ఆయా పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎన్నికలను పర్యవేక్షించే అధికారులకు కూడా ఇది సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఆయా చోట్ల కరోనా బాధితులు కూడా వెలుగులోకి వచ్చిన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. జన సమీకరణలో అయినా ప్రచార పర్వంలో అయినా ఎన్నికల అధికారులు ఇప్పటి నుండే నిబంధనల అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.