ప్రగతిభవన్ సాక్షిగా ‘పవర్’ వార్.. కేటీఆర్, కవిత మధ్య క్లాష్.!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి కవిత, కేటీఆర్ ప్రతీక అనేంత స్థాయిలో గుర్తింపు లభించింది. గతంలో ఇదే రాఖీ పండుగ సందర్భంగా ‘గివ్ ఏ హెల్మెట్ టు యువర్ బ్రదర్’ అనే సందేశం క్యాంపెయిన్‌లా నడిచింది. తెలంగాణలో వీరు తప్ప అన్నాచెల్లెళ్ళు లేరా అనే విమర్శలూ వచ్చాయి. ప్రతి ఏటా రాఖీపౌర్ణమి సందర్భంగా కేటీఆర్‌కు కవిత తప్పకుండా రాఖీ కడుతున్నారు. ఈ సారి మాత్రం అది సాకారం కాలేదు. ఆమె […]

Update: 2021-08-22 21:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి కవిత, కేటీఆర్ ప్రతీక అనేంత స్థాయిలో గుర్తింపు లభించింది. గతంలో ఇదే రాఖీ పండుగ సందర్భంగా ‘గివ్ ఏ హెల్మెట్ టు యువర్ బ్రదర్’ అనే సందేశం క్యాంపెయిన్‌లా నడిచింది. తెలంగాణలో వీరు తప్ప అన్నాచెల్లెళ్ళు లేరా అనే విమర్శలూ వచ్చాయి. ప్రతి ఏటా రాఖీపౌర్ణమి సందర్భంగా కేటీఆర్‌కు కవిత తప్పకుండా రాఖీ కడుతున్నారు. ఈ సారి మాత్రం అది సాకారం కాలేదు.

ఆమె అమెరికాలో ఉండటంతో ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి 13న కవిత బర్త్ డే సందర్భంగానూ కేటీఆర్ విషెస్ చెప్పలేదని ఆమె అభిమానులూ ఒకింత నొచ్చుకున్నారు. ఇప్పుడు రాఖీ పండుగకు సైతం అదే తరహా నిరాదరణ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు పవర్ పాలిటిక్స్‌లో మాత్రమే కాక ఇటు కుటుంబ, రక్త సంబంధానికీ దూరమవుతున్నారనే చర్చ మొదలైంది.

అన్నతోనే కాక సంతోష్‌తోనూ గ్యాప్ పెరిగిందని, అందువల్లనే ఆమె ప్రగతి భవన్‌కు కూడా వెళ్లడంలేదని కవిత అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. కేసీఆర్‌ గారాలపట్టీ అయినా చాలా కాలంగా ప్రగతిభవన్​కు దూరంగానే ఉంటున్నారు. తండ్రిని కలవడానికి సైతం అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఆమెది.

నిజామాబాద్ ఎంపీగా ఐదేండ్ల పాటు ఢిల్లీ స్థాయిలో కేసీఆర్‌కు ప్రతినిధిగానే వ్యవహరించారు. తోటి ఎంపీలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆమె కనుసన్నల్లో ఉండేవారు. కవితకు అంతటి ప్రాధాన్యత ఉండేది. ఈ క్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డునూ అందుకున్నారు. ఆమె చుట్టూ ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు గుంపులుగా కనిపించేవారు. హైదరాబాద్‌లోని ఇంటి దగ్గరా వేలాది మంది నిత్యం వచ్చీ పోతూ ఉండేవారు.

పార్టీపరమైన పనుల కోసం ఆమె సిఫారసుల లేఖ కావాలని తపించేవారు. కేసీఆర్ ద్వారా ఏదైనా పని జరగాలంటే ఆమె రికమండేషన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కానీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కనీసం జిల్లాలో సైతం గుర్తింపు పొందలేకపోతున్నారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆమెకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలోనూ అంతే. జిల్లాలో రివ్యూ మీటింగ్ పెట్టినా నేతలు, అధికారులు పెద్దగా ఆసక్తిచూపడం లేదని తెలుస్తున్నది.

ఆమె ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో చాలా మంది గెలుపు కోసం శ్రమించారు. చివరకు ఎంపీ ఎన్నికల్లో మాత్రం కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆమెను పనిగట్టుకుని ఓడించారన్న కామెంట్లూ వచ్చాయి. కవిత ప్రత్యేకంగా చొరవ తీసుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు ఆమెతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

మంత్రిగా ‘వేముల’కు ప్రాధాన్యం

జిల్లా మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి గత టర్ములో ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ రోజుల్లో కవితకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఎంపీగా ఓటమి చెందాక పరిస్థితులు తారుమారయ్యాయి. ఎమ్మెల్సీగా గెలిచినా తగిన ప్రాధాన్యం, ఆదరణ సొంత పార్టీ కార్యకర్తల నుంచి కవితకు లభించడం లేదనే టాక్​ ఉన్నది. జిల్లాకు నెలకు ఒకటి రెండు సార్లు వెళ్లినా స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి కూడా పెద్దగా స్పందన ఉండటం లేదు. దీంతో ఆమె అటువైపు వెళ్లడమే తగ్గించుకున్నారని ప్రచారం జరుగుతున్నది. దీనికి తోడు కరోనా ఒక కారణమే కావచ్చుగానీ తెలంగాణ జాగృతి కార్యకలాపాలు సైతం సాదాసీదాగానే సాగుతున్నాయి. ఆ విషయంలో కవిత కూడా పెద్దగా చొరవ తీసుకోవడంలేదు.

నాడు ఢిల్లీలో కేసీఆర్​ ప్రతినిధి

ఒకప్పుడు కేసీఆర్‌కు రాజకీయ వారసురాలనే స్థాయిలో చర్చలు జరిగాయి. ఎంపీగా ఢిల్లీలో ఆమె కేసీఆర్ ప్రతినిధిగానే రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాల్లో చొరవ తీసుకుని మంత్రుల నుంచి అనుమతులు తెచ్చుకున్నారని టీఆర్ఎస్ నాయకులు ఒకింత గర్వంగానే చెప్పుకున్నారు. కానీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

అటు పవర్ పాలిటిక్స్‌కూ దూరమయ్యారు. ఇటు కల్వకుంట్ల కుటుంబంలోనూ ఒంటరి అయ్యారు. ఒకప్పుడు కవిత ద్వారా పదవులు పొందినవారు సైతం ఇప్పుడు ఆమెను అప్రాధాన్యం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అటు పార్టీలోని పవర్ పాలిటిక్స్‌లో, ఇటు కుటుంబంలో రాజకీయ వారసత్వ పోరులో ఆమె బాధితురాలయ్యారు.

తండ్రిని కలిసేందుకూ అపాయింట్​మెంట్​

రక్షాబంధన్ పండుగ సందర్భంగా స్వయంగా ప్రగతి భవన్‌కు వచ్చి కేటీఆర్‌కు రాఖీ కట్టే సంప్రదాయానికి ఎందుకు బ్రేక్ పడింది? అమెరికాలో ఉన్నందున స్వయంగా రాలేకపోయారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్​కు శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ తిరిగి ఎందుకు రీట్వీట్​ చేయలేదు. మార్చిలో జరిగిన కవిత బర్త్ డేకు సైతం కేటీఆర్​ విషెస్​ చెప్పలేదన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది.

కవితకు ప్రగతి భవన్‌కు దారులు ఎందుకు మూసుకుపోయాయి? ఎవరు మూసేశారు..? తండ్రిని కలవడానికి సైతం సంతోష్ అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? అటు జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేల నుంచి ఎందుకు ఆదరణ, మద్దతు ఎందుకు పొందలేకపోతున్నారు? పార్టీ కార్యకలాపాల్లో సైతం చొరవ తీసుకుని ఉత్సాహంగా ఎందుకు పాలుపంచుకోవటం లేదు? అన్న ప్రశ్నలు కేడర్​లో నెలకొన్నాయి.

కవిత మౌనం ఎవరికి లాభం

కవిత మౌనం, తగ్గుతున్న ప్రాధాన్యం మరోవైపున ఎవరికి లాభిస్తున్నది? తండ్రిని సైతం కలవలేనంత గ్యాప్ ఎందుకు ఏర్పడింది? కుటుంబంలో ఎవరితోనూ ఎలాంటి గ్యాప్ లేదని టీఆర్ఎస్ నేతలు బయటికి చెప్తున్నా కళ్ళముందు జరుగుతున్న పరిణామాలు మరో రకమైన చర్చకు దారితీస్తున్నాయి. రాఖీ కట్టడం ద్వారా వారి మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే సంకేతం వెళ్తుందని, చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లవుతుందనే చర్చ పార్టీలోనూ ఉన్నది.

కానీ ఆమె అమెరికాలో ఉండడంతో రాఖీ కట్టలేకపోయారు. ఉద్దేశపూర్వకంగానే అమెరికాకు వెళ్లారా? అన్న చర్చలూ మొదలయ్యాయి. తమ మధ్య గ్యాప్ లేదనే సంకేతాన్ని కవిత ట్వీట్‌కు కేటీఆర్ రీట్వీట్​ చేయడం ద్వారా తెలిపే అవకాశం ఉన్నా.. అది జరగలేదు. ఈ పరిణామాలు బయట జరుగుతున్న చర్చకు బలం చేకూర్చుతున్నాయి.

అలిగే అమెరికా వెళ్లారా?

కవిత తన పెద్దకొడుకును డిగ్రీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లినట్టు చెబుతున్నారు. కానీ సరిగ్గా ఈ సమయంలోనే వెళ్లడం అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. ఎంపీగా ఓటమి పాలయ్యాక ఇలాగే చాలారోజులు అమెరికా వెళ్లి అక్కడే ఉండిపోయారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైనా సరైన ప్రాధాన్యం లేకపోవడం, ప్రగతిభవన్​ వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉండటంతో అమెరికా టూర్​ ప్లాన్​ చేసుకున్నట్టు తెలుస్తున్నది.

ఈ నెల 14న కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన కవిత సెప్టెంబరు 2న తిరిగి హైదరాబాద్ రానున్నారు. ట్వీట్‌లో గతేడాది ఫొటోను కవిత షేర్ చేశారు. కవితకు తన అన్న పట్ల, తండ్రి పట్ల మంచి అభిప్రాయం, వారికి దగ్గర కావాలనే ఆకాంక్షఎక్కువే. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో దూరంగా ఉండడమే మంచిదని భావించినట్టు ప్రచారం జరుగుతున్నది. పవర్ పాలిటిక్స్ చివరకు ఆమెను రాజకీయాలకు, కుటుంబ సంబంధాలకు, అనుబంధాలకు దూరం చేశాయనే చర్చ సాగుతున్నది.

Tags:    

Similar News