‘మహానేత’ కొణిజేటి ‘రోశయ్య’ రాజకీయ ప్రస్థానం ఇదే..

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వైద్య చికిత్సల కోసం రోశయ్యను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన అకాలం మరణం చెందారు. ఆయన మరణ వార్త విన్న కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కొణిజేటి రోశయ్య ప్రస్థానం.. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు […]

Update: 2021-12-03 22:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వైద్య చికిత్సల కోసం రోశయ్యను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన అకాలం మరణం చెందారు. ఆయన మరణ వార్త విన్న కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

కొణిజేటి రోశయ్య ప్రస్థానం..

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో పాటు రోశయ్య రాజకీయ పాఠాలు నేర్చారు. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్ల శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రి వర్గాలలో పలు కీలకమైన శాఖలను నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు.

2004, 2009లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఉమ్మడి ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రోశయ్య.. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నర్‌గా తన సేవలు అందించారు.

సీఎంలు మారినా ఆయన మాత్రం మారలేదు..

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ సర్వ సాధారణం. కానీ సీఎంలు మారినప్పటికీ ఆర్థిక మంత్రిగా ఆయనే ప్రతీ కేబినెట్‌లోనూ పనిచేశారు. వివాదరహితుడిగా ముద్రపడ్డ రోశయ్యకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. అన్నీ పార్టీల వారు రోశయ్యను గౌరవించేవారు.

రోశయ్య రాజకీయ ప్రస్థానం ఇదే..

1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత.
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
2009 సెప్టెంబరు – 2010 నవంబరు 24: ఉమ్మడి ఏపీ సీఎం.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్.

మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం


Tags:    

Similar News