హుజురాబాద్‌‌పై డేగ కళ్లతో నిఘా.. సోషల్ మీడియా పోస్టులతో జాగ్రత్త : సీపీ వార్నింగ్

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో ఫిర్యాదులకు, కేసులకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. ‘దిశ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో పోలీసులచే నిఘాను కట్టుదిట్టం చేసి సున్నితమైన అంశాలను, సునిశితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తామని సీపీ వివరించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజ్యంగం కల్పించిన […]

Update: 2021-10-01 21:55 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో ఫిర్యాదులకు, కేసులకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. ‘దిశ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో పోలీసులచే నిఘాను కట్టుదిట్టం చేసి సున్నితమైన అంశాలను, సునిశితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తామని సీపీ వివరించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మా వంతుగా నిరంతరం పనిచేస్తామని సత్యనారాయణ వెల్లడించారు.

పోలీసులు నిరంతరం డేగ కళ్లతో నిశితంగా గమనిస్తూనే ఉంటారన్నారు. ఓ వైపున సాధారణ విధులు, మరో వైపున ఎన్నికల బందోబస్తు నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించామని తెలిపారు. హుజురాబాద్ వ్యాప్తంగా మొత్తం 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, నిరంతరం మొబైల్ టీంలు కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉంటాయన్నారు.

ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులకు పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, పోలీసులపై పని ఒత్తిడి తగ్గించేందుకు షిప్టుల వారిగా విధులు అప్పగించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రాత్రి వేళల్లో అడిషనల్ ఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలు కూడా ఎలక్షన్ డ్యూటీ చేసే సిబ్బందిని మానిటరింగ్ చేస్తారని, ఐదు మండలాల్లో 30 టీములు 24 గంటలు పర్యవేక్షణ జరుపుతాయని తెలిపారు. దీనివల్ల అర్థరాత్రి సమాచారం వచ్చినా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నియంత్రించేందుకు ప్రత్యేక చొరవ చూపించే అవకాశం ఉంటుందన్నారు. బెల్టు షాపులు, నాటు సారా స్థావరాలపై ప్రత్యేకంగా దాడులు చేయాలని ఆదేశించామని, ఇప్పటికే బెల్టు షాపులపై కేసులు కూడా నమోదు చేసినట్టు సీపీ సత్యనారాయణ తెలిపారు.

అనుమతి లేకుండా ఏర్పాటైన బెల్టు షాపులు, నాటు సారా కేంద్రాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం అంతటా కలిపి 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని.. ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు పట్టుబడితే సీజ్ చేస్తామన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే వాస్తవాన్ని గుర్తించి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడంలో వెనకాడేది లేదని, అయితే ఎన్నికల సమయంలో ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయని, ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తప్పుడు ప్రచారాల వల్ల సామాన్యులు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. అటువంటి రూమర్స్‌కు అవకాశం లేకుండా చూడాలన్నదే మా ప్రయత్నమని సీపీ వివరించారు. ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ ఫోర్స్‌తో పాటు పారా మిలటరీ బలగాలు కూడా రంగంలోకి దింపుతున్నామని, ఇప్పటికే 1900 వరకు పోలీసులను ఎన్నికల బందోబస్తు కోసం కేటాయించిగా పారా మిలటరీ బలగాలు రాగానే ఫ్లాగ్ మార్చ్ చేయించి వారి సేవలు కూడా వినియోగించుకుంటామని చెప్పారు.

సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలతో పాటు కొవిడ్ రూల్స్‌ను కూడా అమలు చేసేందుకు పోలీసులు చొరవ చూపిస్తారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీస్తే చట్టాలకు పని చెప్పి తీరుతామని.. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కించపరిచే విధంగా ఉన్న పోస్టులపై ఫిర్యాదులు వస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెట్టడంలో వెనకాడేది లేదన్నారు.

వివాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఇప్పటికే వెయ్యి మందిని బైండోవర్ చేశామని తెలిపారు. గొడవలను ప్రోత్సహించే వారిని, గొడవలకు కారకులైన వారిని గుర్తించి బైండోవర్లు చేయడంతో పాటు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికల నిబంధనల అతిక్రమణ కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.

పోలింగ్ కేంద్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే పోలీసులు జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తారని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని క్షేత్ర స్థాయిలో నిఘాను కట్టుదిట్టం చేయాలన్న యోచనలో ఉన్నామని సీపీ తెలిపారు. కమిషనర్ నుండి హోం గార్డ్ వరకు ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు అనుక్షణం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసుల దృష్టి మరల్చేందుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నందున అలర్ట్‌గా వ్యవహరించనున్నామని చెప్పారు.

 

Tags:    

Similar News