లాక్‌డౌన్ పొడిగింపు… ఆంక్షల సడలింపు ?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 21 రోజుల లాక్‌డౌన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. దేశవ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయినా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి అదుపులోనే ఉన్నా లాక్‌డౌన్‌ను కనీసంగా మరో రెండు వారాల పాటు పొడిగించడం అనివార్యమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో సైతం ప్రధానితో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు […]

Update: 2020-04-13 09:53 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 21 రోజుల లాక్‌డౌన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. దేశవ్యాప్తంగా జనజీవనం స్థంభించిపోయినా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి అదుపులోనే ఉన్నా లాక్‌డౌన్‌ను కనీసంగా మరో రెండు వారాల పాటు పొడిగించడం అనివార్యమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో సైతం ప్రధానితో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించడమే శ్రేయస్కరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సహా మరో నాలుగైదు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు సంకేతం లేకుండానే రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకోలేవన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ప్రదాని మోడీ సైతం మంగళవారం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో లాక్‌డౌన్‌ను పొడిగింపు గురించి స్పష్టత ఇవ్వనున్నారు. లాక్‌డౌన్ కొనసాగే అవకాశం ఉన్నా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, పంటలు కోతకు వచ్చినందున ఆ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా ఉండేలా కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించింది.

లాక్‌‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినడంతో పాటు అసంఘటిత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల రవాణాకు ఇప్పటిదాకా ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ ఆహారేతర వస్తువుల రవాణాకు సైతం ఇప్పుడు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఆహారేతర వస్తువుల రవాణాకు ఆంక్షలను సడలించాల్సిందిగా స్పష్టత ఇచ్చారు. కరోనా తీవ్రతకు అనుగుణంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌ల ప్రతిపాదనకు అనుగుణంగా సుమారు 400 జిల్లాల్లో కరోనా బాధ లేనందువల్ల అక్కడ వ్యవసాయం, దాని అనుబంధ రంగంతో పాటు ఉత్పత్తి, నిర్మాణ రంగానికి చెందిన పనులు యధావిధిగా జరిగేలా సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రంగాల్లోని కార్మికులే లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడినందున వారికి తక్షణం ఉపాధి లభించడం, ఆర్థిక వ్యవస్థకు దోహపడడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మోడీ ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరోవైపు అనేక పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి ప్రధానికి లేఖలు వెళ్ళాయి. పరిశ్రమలను పాక్షికంగా నడుపుకోడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటిదాకా లాక్‌డౌన్‌లో పూర్తిగా మూసివేతకు గురైనందువల్ల ఆర్థికంగా చితికిపోయాయని, కార్మికులకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని ఉదహరించాయి. కనీస సంఖ్యలో కార్మికుల ద్వారా పాక్షికంగానైనా నడిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరాయి. విధులకు హాజరయ్యే కార్మికుల కోసం యాజమాన్యమే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, సామాజిక దూరం పాటించడం, వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి అంశాలతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది. ఎలాగూ రైళ్ళ ద్వారా సరుకు రవాణా యధావిధిగా జరుగుతున్నా లారీలు, ట్రక్కుల ద్వారా కూడా రవాణాకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్ కాలంలో ఇళ్ళకు మాత్రమే పరిమితమైన కేంద్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు సోమవారం నుంచి విధులకు హాజరయ్యారు. అనేక శాఖల కార్యాలయాలు దాదాపు 25% మంది సిబ్బందితో పనిచేయడం ప్రారంభించాయి. ఆయా శాఖల పరిధిలోని అంశాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటిదాకా అమలుకు నోచుకోని అంశాలు, కొన్ని సర్వీసులు యధావిధిగా పనిచేస్తున్నా అవి ఏ మేరకు ప్రజలకు అందాయి, ఇకపైన వెంటనే పునరుద్ధరించాల్సిన అంశాలు తదితరాలపై సమావేశాలు నిర్వహించారు. కరోనా బాధలేని జిల్లాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం జాగ్రత్తలు తీసుకుంటూ పాక్షికంగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనున్నట్లు కేంద్ర అధికారుల ద్వారా తెలుస్తోంది.

Tags: Corona, LockDown, PM Modi, Extension, Partial exemptions, Industries, Labour, Employment

Tags:    

Similar News