ఆక్సిజన్ ఉత్పత్తి పుష్కలం..రవాణాయే అసలు సమస్య
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా అన్నింటికంటే ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ప్లాంట్ల నుంచి సరఫరా చేయడమే ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. అందుకే యుద్ధ విమానాలను సైతం ఆక్సిజన్ రవాణా కోసం వినియోగించాల్సి వస్తోంది. రైల్వే శాఖ ఏకంగా ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాల కోసమే గ్రీన్ కారిడార్ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా అన్నింటికంటే ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ప్లాంట్ల నుంచి సరఫరా చేయడమే ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. అందుకే యుద్ధ విమానాలను సైతం ఆక్సిజన్ రవాణా కోసం వినియోగించాల్సి వస్తోంది. రైల్వే శాఖ ఏకంగా ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాల కోసమే గ్రీన్ కారిడార్ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ట్యాంకర్లు ఇచ్చారంటూ నిలదీసి వాటిని ఇస్తే ఆక్సిజన్ నింపి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించాల్సి వచ్చింది.
మన దేశంలో ప్రస్తుతం కరోనా అవసరాలకు తగినన్ని ట్యాంకర్లు లేకపోవడం, రాష్ట్రాల్లో స్టోరేజీ ట్యాంకులు లేకపోవడం అన్నింటికంటే పెద్ద లోపమని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలన్నీ దాదాపుగా స్టీల్ ప్లాంట్ల పరిధిలోనే ఉన్నందున అక్కడి నుంచే దేశం మొత్తానికి సరఫరా కావాల్సి వస్తోంది. ప్రస్తుతం కరోనా సమయంలో దేశం మొత్తంమీద గరిష్టంగా ఐదారు వేల టన్నుల ఆక్సిజన్‌ను ప్రతీరోజూ వాడుతున్నా ఉత్పత్తి సామర్థ్యం మాత్రం సుమారు లక్ష టన్నుల వరకు ఉంది. కానీ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రావడం ఇబ్బందిగా మారి నిత్యం వేలాది మంది ప్రాణాలొదురుతున్నారు.
ఐదు శాతం ఆక్సిజన్ కూడా వాడడంలేదు
దేశంలో పారిశ్రామిక, వైద్య అవసరాలకు సగటున ప్రతీ రోజు లక్ష టన్నుల మేర ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయని, ఇందులో ప్రస్తుత కరోనా సమయంలో కూడా ఐదు శాతం కంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉండడం లేదని ’లిండే ఇండియా’ కంపెనీకి దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు సీఈఓగా పనిచేసిన హనుమాన్ మల్ బెంగానీ వ్యాఖ్యానించారు. మొత్తం ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌లో సుమారు 80 శాతం మేర పరిశ్రమలకు పైప్ లైన్ ద్వారానే సరఫరా అవుతోందని, మరో 15% లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో టాంకుల ద్వారా స్టోరేజీ టాంకులకు రవాణా అవుతున్నదని, మిగిలిన ఐదు శాతం మాత్రమే సిలిండర్ల రూపంలో వాడుతున్నట్లు వివరించారు.
మన దేశంలో ఉత్పత్తి ఆక్సిజన్‌లో ఎక్కువగా తూర్పు భాగంలోని ప్లాంట్ల నుంచే వస్తోందని, గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో కొంత ఉత్పత్తి అవుతోందన్నారు. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 80 శాతం మేర ఇనుము, ఉక్కు తయారీ కోసం స్టీల్ ప్లాంట్లు వినియోగిస్తున్నాయని, వైద్య అవసరాలకు వాడేది చాలా తక్కువ అని తెలిపారు. కొన్ని స్టీల్ పరిశ్రమలు దాదాపు 10% మేర స్టోరేజీ టాంకుల్లో లిక్విడ్ ఆక్సిజన్ రూపంలో నిల్వ చేసుకుంటాయని, పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్‌కు ఇబ్బంది ఏర్పడినప్పుడు వాడేలా దీన్ని రిజర్వులో ఉంచుకుంటాయన్నారు. లిండే, ఐనాక్స్, అలెన్‌బరీ లాంటి గ్యాస్ కంపెనీలు లిక్విడ్ ఆక్సిజన్‌ను తయారుచేసి టాంకర్ల ద్వారా రవాణా విక్రయిస్తుంటాయి.
ఒక్కో టాంకర్ తయారీకి రూ. 45 లక్షలు
ఆక్సిజన్ తయారీకి అయ్యే ఖర్చు తక్కువే అయినా దాన్ని రవాణా చేయడం మాత్రం ఖరీదైన వ్యవహారం. టాంకర్ల ద్వారా తరలించడమే ఏకైక మార్గం. రోడ్డు మార్గం గుండా తరలించడానికి వాడే టాంకర్‌ను తయారుచేయాలంటే ఒక్కోదానికి సుమారు రూ. 45 లక్షలవరకు ఖర్చవుతుంది. సిలిండర్ల సైజును బట్టి కనీస స్థాయిలో రూ. 10 వేల చొప్పున ఖర్చవుతుంది. అందువల్లనే టాంకర్లు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. మామూలు సమయాల్లో ఆక్సిజన్ డిమాండ్, సప్లయ్‌కి తగిన విధంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీ. కానీ కరోనా లాంటి సమయంలో అత్యవసరంగా మారడంతో అనుకున్న మోతాదులో, నిర్దిష్ట సమయానికి అందుబాటులోకి రావడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సిలిండర్‌లో రీఫిల్లింగ్ చేసే ఆక్సిజన్ ఖరీదు కేవలం రూ. 300 మాత్రమే అయినా సిలిండర్ ఖర్చు మాత్రం దాదాపు పది వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటున్నది.
దేశంలోని భౌగోళిక పరిస్థితుల రీత్యా ఆక్సిజన్ అవసరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. అక్కడి నుంచే మొత్తం దేశ అవసరాలను తీర్చాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్ని సందర్భాల్లో వెయ్యి కి.మీ. దూరం దాటి టాంకర్లు ఆక్సిజన్‌ను మోసుకెళ్ళాల్సి వస్తోంది. టాంకర్లను గ్యాస్ కంపెనీలే వాడుతున్నందున సాధారణ అవసరాలకు అనుగుణంగానే వాటి సంఖ్య ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా ప్రత్యేక అవసరాలు రావడంతో కొరత ఏర్పడింది.
తక్షణ పరిష్కారమేంటి?
కరోనా సెకండ్ వేవ్ మొదలుకాబోతున్న సమయంలోనే ప్రభుత్వం అప్రమత్తమై మెడికల్ ఆక్సిజన్ అవసరాలను గుర్తించి తగిన ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాల్సి ఉంటే ఈ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉండేదని హనుమాన్ మల్ బెంగానీ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక అవసరాలకు వాడే ఆక్సిజన్‌కు, మెడికల్ ఆక్సిజన్‌కు చిన్న మార్పు తప్ప పెద్దగా తేడా లేనందువల్ల మొదటి నుంచే ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నారు. పంటలకు కనీస గిట్టుబాటు ధరల తరహాలో పారిశ్రామిక అవసరాలకు వాడే ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు వాడడం ద్వారా ఏర్పడే ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం ఆ కంపెనీలకు నష్టపరిహారం రూపంలో చెల్లించనున్నట్లు హామీ ఇస్తే చాలా కంపెనీలు ముందుకొచ్చేవన్నారు.
ఇప్పటికిప్పుడు కొత్త టాంకర్లు తయారయ్యే అవకాశం లేనందువల్ల వీలైనంత ఎక్కువగా గూడ్సు రైళ్ళ ద్వారా రవాణా చేయడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ఆక్సిజన్‌ను వినియోగిస్తున్న అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు విధిగా పీఎస్ఏ (ప్రెషర్ స్వింగ్ అడ్సార్‌ప్షన్) కాప్టివ్ ప్లాంట్లను నెలకొల్పుకోవాల్సి ఉంటుందని, పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నందున వాటి అవసరాలను స్వంతంగా తీర్చుకునేలా ఈ ఏర్పాట్లు దేశంలో అన్నిచోట్లా అవసరమని అభిప్రాయపడ్డారు.