తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ ..
తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.
దిశ, తిరుమల: తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ వద్ద నుంచి క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. అలాగే వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆదివారాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్, నారాయణగిరి ఉద్యానవనంలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1500 మంది 24/7 సేవలందిస్తున్నారు. కాగా ముందుగా భక్తులకు కృష్ణ తేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వైద్య బృందాలు బ్యాటరీ వాహనాలు ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నివేదికల ప్రకారం ఆక్టోపస్ సర్కిల్‌లో లైన్‌లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది.