హలో.. కంగారు పడొద్దు.. అసలు విషయమిదీ!
కరోనా భయంతో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నామంటూ వైద్యుల సలహాలు లేకుండా కషాయాలు, ఇతర ఆహార పదార్థాలు తినే వారు కొత్త జబ్బుల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో విషజ్వరాలు పెరిగే సమయం కావడంతో దీనిని వెంటనే మానుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి కరోనా ప్రభావం మొదలు కాగా అప్పటి నుంచి ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. నిత్యం తినే ఆహారానికి అదనంగా కషాయాలు వచ్చి చేరాయి. వేడివేడి నీటితో పాటు […]
కరోనా భయంతో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నామంటూ వైద్యుల సలహాలు లేకుండా కషాయాలు, ఇతర ఆహార పదార్థాలు తినే వారు కొత్త జబ్బుల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో విషజ్వరాలు పెరిగే సమయం కావడంతో దీనిని వెంటనే మానుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి కరోనా ప్రభావం మొదలు కాగా అప్పటి నుంచి ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. నిత్యం తినే ఆహారానికి అదనంగా కషాయాలు వచ్చి చేరాయి. వేడివేడి నీటితో పాటు మిరియాలు, శొంఠి, ధనియాల పొడి వంటి కషాయాలు తాగి కాలిన గొంతులు, కడుపులో మంట వంటి లేనిపోని జబ్బులను తెచ్చుకుని క్లినిక్‌లకు పరుగులు తీస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కరోనాకు తోడు సీజనల్ వ్యాధులూ ప్రబలుతున్నాయి. ప్రజలను మానసిక ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ చిన్నజ్వరం వచ్చినా, ఇతర లక్షణాలేమైనా ఉన్నా ఆస్పత్రులకు కరోనా నేపథ్యంలో వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో చిన్న చిన్న జబ్బులకు ప్రజలు స్థానికంగా ఉండే క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. సాధారణ జ్వరంతో పాటు అధికంగా చెమటలు రావడం, గొంతులో నొప్పిగా ఉందని, కడుపులో మంటగా ఉందని, మూత్రం పోసే సమయంలో నొప్పిగా ఉంటోందని, ఆహారం తీసుకోలేక పోతున్నామని ఇలా ప్రజలు పిత్తాశయం, అన్నవాహిక, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతూ డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటివి కరోనా లక్షణాలు కానప్పటికీ భయంతో తమకు కూడా కరోనా సోకిందేమోనని చాలా మంది హడలిపోయి కొత్త సమస్యలు తెచ్చకుంటున్నారు.
ప్రతి పది మందిలో ఐదుగురు
రెండు నెలలుగా నగరంలోని క్లినిక్‌లకు వస్తున్న కేసుల్లో గొంతులు కాలిన కేసులే అధికంగా ఉంటున్నాయి. ప్రతి పది మందిలో ఐదుగురు ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కడుపులో మంట సమస్యలతో కూడా వస్తున్నారు. వీటన్నింటికి కారణం కరోనా భయంతో ప్రజలు మరిగే నీరు, కషాయాలు తాగడమే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. చాలా మంది కరోనా భయంతో చాలా అధికంగా నీటిని మరిగించి అంతే వేడితో తాగుతున్నారు. దీనికి తోడు కషాయాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఉదయం నిద్ర లేచిందే మొదలు వీటిని తాగి ఇబ్బందుల పాలవుతున్నారు.
డాక్టర్ల సలహాలు తప్పనిసరి
ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించినా వైద్యుల సలహాలతోనే మందులు తీసుకోవాలి. సొంత వైద్యం మానుకోవాలి. కషాయాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యశాస్త్రంలో ఎక్కడా లేదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఒక పూట మసాలాతో కూడిన బిర్యానీ తిని కడుపు ఉబ్బరంగా ఉందని బాధ పడే వారు అధికంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో శరీరాన్నిఅధిక ఉష్ణానికి గురి చేసే మిరియాలు, లవంగాలు వంటి కషాయాలు తీసుకోవడం కొత్త సమస్యలు తెచ్చుకోవడమే. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కరోనా సమయం కావడంతో చాలా మంది సి-విటమిన్ కోసం నిమ్మరసం తాగుతున్నారు. అధికంగా తీసుకోవడం ఇది కూడా ప్రమాదమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలుంటే ప్రతి రోజూ మూడు పర్యాయాలు వేడి నీటి ఆవిరి పట్టడం చేయాలి. హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులనే వాడాలి. దగ్గు, జ్వరం, ఆస్తమా ఉన్న వారు అరటి పండుకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని జ్వరం ఉన్నా చికెన్, మటన్, చేపలు తినడం మంచిది కాదు. దీని వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా భయంతో ఇష్టాను సారంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కొత్త రోగాలు దరి చేరే అవకాశం ఉన్నందున ప్రజలు సొంత వైద్యం మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎసిడిటీ పెరుగుతుంది.. అల్సర్ వస్తుంది: డాక్టర్ మధుసూదన్, హెచ్‌వోడీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం
వేడి ఎక్కువగా ఉన్న నీరు తాగడం, మిరియాలు, లవంగాలు, ఇతర పౌడర్లు కలిపిన కషాయాలు తాగితే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. అల్సర్ వచ్చే ప్రమాదముంది. కడుపు లోపలి భాగంలో పేగులు, జీర్ణసంచిని అనుసరించి సున్నితమైన ‘‘మ్యుకోసా’’ పొర ఉంటుంది. ఇది చెడు బ్యాక్టీరియాను రక్తంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. పదేపదే వేడి అధికంగా ఉన్ననీళ్లు, కషాయాలు తాగడం వల్ల ఈ పొర దెబ్బ తింటుంది. దీంతో చెడు రసాయనాలు పెరిగి కడుపులో నొప్పి తద్వారా అల్సర్ కూడా వస్తుంది. శరీరం పై భాగంలో ఉన్నచర్మం దెబ్బతిన్నప్పుడు పుండ్లు ఎలా ఏర్పడుతాయో కడుపులో కూడా వీటి మూలంగా అదే జరుగుతుంది. కొంత మందిలో వాంతులు, విరేచనాలు అధికమై ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటారు. వైద్యుల సలహాలు లేకుండా ఇలాంటివి చేయొద్దు.