మేం చస్తుంటే మీరిప్పుడొస్తారా..!

దిశ, న్యూస్ నెట్‌వర్క్ :  వరద సహాయక చర్యలపై అధికార పార్టీ నేతలకు ఎక్కడికక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంతకాలం చేసింది చాలంటూ ముఖం మీదనే తిడుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో వాదనకే దిగుతున్నారు. మూడు రోజులుగా వరద కంపు నీటిలో మగ్గిపోతూ ఉంటే ఇప్పుడా వచ్చేది అంటూ నిలదీస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కూ ఈ చేదు అనుభవం తప్పలేదు. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన ప్రతీసారి రావడం, పోవడం తప్ప ఒరిగిందేమీ లేదని ప్రజలు ముఖం మీదనే […]

Update: 2020-10-15 21:27 GMT

దిశ, న్యూస్ నెట్‌వర్క్ : వరద సహాయక చర్యలపై అధికార పార్టీ నేతలకు ఎక్కడికక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంతకాలం చేసింది చాలంటూ ముఖం మీదనే తిడుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో వాదనకే దిగుతున్నారు. మూడు రోజులుగా వరద కంపు నీటిలో మగ్గిపోతూ ఉంటే ఇప్పుడా వచ్చేది అంటూ నిలదీస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కూ ఈ చేదు అనుభవం తప్పలేదు. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన ప్రతీసారి రావడం, పోవడం తప్ప ఒరిగిందేమీ లేదని ప్రజలు ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ‘మేం చావాల్నా.. బతకాల్నా..’ అంటూ నిలదీస్తున్నారు.. ఒక దశలో ‘మేమంతా ఆత్మహత్యలు చేసుకుంటాం. సూసైడ్ నోట్‌లలో మీ పేరే రాస్తాం’ అంటూ హెచ్చరించారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులపై ఓట్ల రూపంలో ఎలాంటి కసి తీర్చుకుంటారోననే భయం ఎమ్మెల్యేలకు పట్టుకుంది.

కేటీఆర్‌కు నిరసన సెగ..

మంత్రి కేటీఆర్ బైరామల్‌గూడలోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంగా మహిళలంతా జట్టుగా ఏర్పడి ‘కేసీఆర్ డౌన్ డౌన్… కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు మంత్రి కేటీఆర్ సైతం అక్కడే ఉన్నారు. ఒక దశలో పోలీసులంతా వారిని కదలనీయకుండా కట్టడి చేసి మంత్రి పర్యటనకు వీలు కల్పించారు.

మీపేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా..

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రామాంతపూర్ పెద్దచెరువు ప్రాంతంలోని రవీంద్రనగర్‌లో గురువారం బోటులో పర్యటిస్తున్న సందర్భంగా మహిళలు ఆయన తీరుపై నిప్పులు చెరిగారు. ‘మేమంతా మూడు రోజులుగా ముంపులో చిక్కుకుంటే ఇప్పుడొస్తారా? ఇంత ఆలస్యమా?’ అని నిలదీశారు. ‘చెరువులో మిమ్మల్ని ఇండ్లు ఎవ్వరు కట్టుకొమ్మన్నారు?’ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో వాదన తీవ్రమైంది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న మహిళలు ‘అనుమతులు ఎందుకు ఇచ్చారు?’ అని ఎదురు ప్రశ్నంచారు. ‘మీ పేరు రాసి మరీ ఆత్మహత్యలు చేసుకుంటాం..’ అని హెచ్చరించడంతో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ‘మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వెళ్లిపోతున్నారేం? మా మాట అంటే లెక్కే లేదా? సమస్యలు వినిపించుకోరా? మేము బతకాల్నా? లేక చావాల్నా..‘ అని నిలదీశారు. చచ్చిపోతున్నామన్నా పట్టించుకోవడంలేదు అని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై చెప్పులు..

ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కూడా మేడిపల్లి గ్రామంలో అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మేడపల్లి చెరువుకు ఆయన పూజలు చేసేందుకు గురువారం వెళ్లినప్పుడు గ్రామ ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ నిలువరించారు. దీంతో చెరువు దగ్గర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా సిటీ పేరుతో పచ్చటి భూముల్ని కోల్పోతున్నామని, కనీసం తమకు న్యాయం చేయడంపై స్పందించలేదని, దానికి బదులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రైతులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆయన వాహనాలపై రైతులు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ దాడిలో ఒకరికి గాయాలు అయ్యాయి. పోలీసులకు, రైతులకు మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది.

Tags:    

Similar News