"ఓకే గానీ,.. యాదగిరిగుట్టలో భూమి ఇవ్వండి"
దశాబ్దాలు గడిచాయి.. తరాలు మారాయి.. పాలకులు మారారు. కానీ వారి తలరాతలు మారడం లేదు. ఏడు దశాబ్దాల క్రితం అతి పెద్దదైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ గ్రామస్తులు ముంపునకు గురయ్యారు. దీంతో పొట్టచేతపట్టుకుని వంద కిలోమీటర్లకు పైగా దూరం వచ్చి బతుకుతున్నారు. అయినా ముంపు ముప్పు వారిని వదలడం లేదు. 70 ఏండ్ల తర్వాత మరోసారి బస్వాపూర్ రిజర్వాయర్ రూపంలో ముంపు ముంచుకొచ్చింది. నాడు నాగార్జున సాగర్ నిర్మాణం కోసం గ్రామాన్ని వదిలి వచ్చి […]
దశాబ్దాలు గడిచాయి.. తరాలు మారాయి.. పాలకులు మారారు. కానీ వారి తలరాతలు మారడం లేదు. ఏడు దశాబ్దాల క్రితం అతి పెద్దదైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ గ్రామస్తులు ముంపునకు గురయ్యారు. దీంతో పొట్టచేతపట్టుకుని వంద కిలోమీటర్లకు పైగా దూరం వచ్చి బతుకుతున్నారు. అయినా ముంపు ముప్పు వారిని వదలడం లేదు. 70 ఏండ్ల తర్వాత మరోసారి బస్వాపూర్ రిజర్వాయర్ రూపంలో ముంపు ముంచుకొచ్చింది. నాడు నాగార్జున సాగర్ నిర్మాణం కోసం గ్రామాన్ని వదిలి వచ్చి బస్వాపూర్ సమీపంలోని లప్పనాయక్ తండాలో స్థిరపడ్డారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో మరోసారి ఆ గ్రామస్తులు ముంపు బాధితులుగా మారారు. వారితో కనీసం చర్చలు జరపకుండా.. పరిహారం ఎంతిస్తారో చెప్పకుండానే గ్రామాన్ని ఖాళీ చేయాలని నోటీసులిచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా పరిస్థితిపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
దిశ, నల్లగొండ: లప్పనాయక్ తండావాసులది దురదృష్టకరమైన పరిస్థితి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ తండా ఉంటుంది. అయితే టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా లప్పనాయక్ తండా ముంపునకు గురవనుంది. ప్రాజెక్టుల నిర్మాణాలన్నాక ముంపు సహజమే.. కానీ వీరిది విచిత్ర పరిస్థితి.
వంద కిలోమీటర్లు దాటి వచ్చినా..
ఇటీవలే లప్పనాయక్ తండా గ్రామపంచాయతీగా మారింది. కానీ ఏం లాభం.. ఊరే లేకుండా పోతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు దశాబ్దాల క్రితం నాగార్జునసాగర్ ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా అడ్డంగా ఉందని తండాను తొలగించారు. అప్పటి ప్రభుత్వం నయా పైసా పరిహారం ఇవ్వలేదు. దీంతో దిక్కు తోచని స్థితిలో పొట్టచేత పట్టుకొని యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం శివారులో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఉన్న ఊరును వదిలిపెట్టి రావడంతో 70 ఏండ్లుగా వీరు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇన్నేండ్ల కాలంలో వీరిని పలకరించిన ప్రభుత్వమే లేకపాయె. అయినా వారి బతుకు వారు బతుకుతున్నారు. కానీ వారి బతుకుల్లో మరోసారి పిడుగు పడింది. బస్వాపూర్ రిజర్వాయర్ రూపంలో మరోసారి ముంపు వారిని ముంచింది.
సామర్థ్యం పెంపుతో..
ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 0.8 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించేందుకు వైఎస్సార్ హయాంలో పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్.. ప్రాణహిత–-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. బస్వాపూర్ సామర్థ్యాన్ని 11.39 టీఎంసీలకు పెంచారు. దీంతో తండాలోని సుమారు 250 కుటుంబాల్లోని 650 మంది నిరాశ్రయులవుతున్నారు. 750 ఎకరాల భూములు సహా సర్వస్వం కోల్పోతున్నారు. తరాలు మారినా మా తలరాతలు మారలేదని తండావాసులు ఆవేదన చెందుతున్నారు.
ఇల్లుకు.. ఇల్లు..
మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, చర్చలు జరపకుండా, పరిహారం ఎంతిస్తారో చెప్పకుండా, గ్రామాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం సరికాదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్కు తాము వ్యతిరేకం కాదని, ఈసారైనా ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలోనే ఏదో ఒక చోట ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సాధ్యం కాకుంటే చుట్టుపక్కల గ్రామాల్లో రేటు ప్రకారం ఎకరానికి రూ.90 లక్షల చొప్పున పరిహారం చెల్లించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే గ్రామంలో మరోసారి ముంపునకు గురవుతున్నామనే వేదనతో ముగ్గురు చనిపోయారని, అయినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని కన్నీటి పర్యంతం అవుతున్నారు.