చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ 2021 బుధవారం బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్టు మ్యాచ్‌ను డే/నైట్ (పింక్ బాల్) టెస్టుగా నిర్వహిస్తున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్రిస్బేన్‌లో గత రాత్రంతా వర్షం పడటంతో పాటు ఉదయం పూట మేఘావృతమై ఉన్నది. మరోవైపు గబ్బా వికెట్‌పై గడ్డి కూడా ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు సహకరిస్తుందనే నమ్మకంతో జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. […]

Update: 2021-12-08 08:12 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ 2021 బుధవారం బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్టు మ్యాచ్‌ను డే/నైట్ (పింక్ బాల్) టెస్టుగా నిర్వహిస్తున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్రిస్బేన్‌లో గత రాత్రంతా వర్షం పడటంతో పాటు ఉదయం పూట మేఘావృతమై ఉన్నది. మరోవైపు గబ్బా వికెట్‌పై గడ్డి కూడా ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు సహకరిస్తుందనే నమ్మకంతో జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి బంతికే రోరీ బర్న్స్ (0)ను మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతి వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. యాషెస్ సిరీస్‌లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

గతంలో 1936లో ఎర్నీ మెక్ కార్మిక్ తొలి సారి ఈ ఘనత సాధించాడు. కాగా, అంతకు ముందు ఎర్నీ కూడా గబ్బా స్టేడియంలోనే ఈ ఘనత సాధించాడు. ఇక ఆసీస్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో ఇంగ్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది. డేవిడ్ మలన్ (6) జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదే స్కోర్ వద్ద కెప్టెన్ జో రూట్ (0) హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక ఐదు నెలల తర్వాత తిరిగి క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ (5) కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో థర్డ్ స్లిప్‌లో ఉన్న మార్నస్ లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత హసీబ్ హమీద్, ఓలీపోప్ వికెట్ పడకుండా లంచ్ వరకు నెట్టుకొచ్చారు. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.

రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మరింతగా చెలరేగిపోయాడు. క్రీజులో కుదురుకున్న హసీబ్ హమీద్ (25) పాట్ కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవటయ్యాడు. ఆ తర్వాత ఓలీ పోప్, జాస్ బట్లర్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. వీరిద్దరూ కలసి 6వ వికెట్‌కు 52 పరుగులు జోడించారు. జాస్ బట్లర్ (39) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ఓలీ పోప్ (35) కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో హాజెల్‌వుడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత ఎవరూ పెద్దగా రాణించలేదు. క్రిస్ వోక్స్ (21) కాసేపు పోరాడినా అతడికి సరైన సపోర్ట్ లభించలేదు. ఓలీ రాబిన్‌సన్ (0), మార్క్ వుడ్ (8), క్రిస్ వోక్స్ (21) వికెట్లను పాట్ కమిన్స్ పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 50.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

పాట్ కమిన్స్ కెప్టెన్‌గా తొలి టెస్టులోనే 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గా అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. 127 ఏళ్ల క్రితం 1894లో ఫాస్ట్ బౌలర్ జార్జ్ గిఫెన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో గిఫెన్ కెప్టెన్‌గా అరంగేట్రం చేసి 155 పరుగులకు 6 వికెట్లు తీశాడు. ఇక గబ్బా టెస్టులో కమిన్స్ 5 వికెట్లు తీసి 127 ఏళ్ల రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్, జోష్ మాజెల్ వుడ్ చెరి రెండు వికెట్లు, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్‌కు 47వ కెప్టెన్‌గా యాషెస్ సిరీస్‌కు ముందే నియమించబడ్డాడు. కాగా, 1956 తర్వాత ఆస్ట్రేలియాకు కెప్టెన్ అయిన ఫాస్ట్ బౌలర్‌గా కూడా కమిన్స్ రికార్డు సృష్టించాడు. అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రిస్బేన్‌లో భారీ వర్షం కురిసింది. ఎంత సేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.

సంక్షిప్త స్కోర్:

ఇంగ్లాండ్ 147 ఆలౌట్ (జోస్ బట్లర్ 39, ఓలీ పోప్ 35, పాట్ కమిన్స్ 5 వికెట్లు)

Tags:    

Similar News