పాలనకు దూరంగా జీహెచ్ఎంసీ మేయర్.. పట్టించుకునేదెప్పుడు?
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ విజయలక్ష్మి పాలనాపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా ? అధికారులతో పాటు సొంత పార్టీ నేతలే ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినబడుతోంది. గత డిసెంబర్ లో గ్రేటర్ పీఠం కోసం జర్గిన ఎన్నికలలో అధికార పార్టీ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ అధికారం మాత్రం సొంతం చేసుకుంది. మేయర్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ తో సహా ఏ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ విజయలక్ష్మి పాలనాపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా ? అధికారులతో పాటు సొంత పార్టీ నేతలే ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినబడుతోంది. గత డిసెంబర్ లో గ్రేటర్ పీఠం కోసం జర్గిన ఎన్నికలలో అధికార పార్టీ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ అధికారం మాత్రం సొంతం చేసుకుంది.
మేయర్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ తో సహా ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడంతో ఏ పార్టీకి మేయర్ పీఠం దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవి కొసం ఎంతో మంది పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ అధిష్టానం చివరి నిమిషంలో పార్టీ సీనియర్ నాయకులు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి పేరును ఖరారు చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టింది. ఉన్నత విద్యావంతురాలైన విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా పదవీ స్వీకారం చేయడంతో ఇక గ్రేటర్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆమె తీరు వివాదాస్పదమైంది.
పాలనా వ్యవహారాలను పట్టించుకోవడం లేదు..
జీహెచ్ఎంసీ పాలనా వ్యవహారాల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి సరైన తీరులో స్పందించడం లేదనే విమర్శలు వచ్చాయి. ఇటీవల ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో ఆమె అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం , ఆమె మాట్లాడిన తీరుతో విసిగిపోయిన సదరు అధికారి మేయర్ పై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారని సమాచారం. తాను సీనియర్ ఐపీఎస్ అయినా ఏ మాత్రం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మంత్రి వద్ద వాపోయారని తెలిసింది . అంతే కాకుండా నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తో కూడా ఆమె సఖ్యతగా మెలగడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి . దీంతో పలువురు ఎమ్మెల్యేలు కూడా సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లరట.
ఫైళ్లు ఇంటికే..
జీహెచ్ఎంసీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి గద్వాల విజయలక్ష్మి ఏనాడు కూడా కార్యాలయానికి సక్రమంగా రావడం లేదని తెలిసింది. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూసినా ఆమె అందుబాటులోకి రాకపోవడంతో ఓ వైపు అధికారులు, మరోవైపు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైన ఫైళ్లమీద సంతకాలు ఆమె ఇంటికి తీసుకువెళ్లి చేయిస్తున్నారు. గతంలో మేయర్ గా ఉన్న బొంతు రామ్మోహన్ కనీసం వారంలో మూడు నుండి నాలుగు రోజులు కార్యాలయంలో అందుబాటులో ఉండేవారని దీంతో ప్రజలు ఆయనను నేరుగా కలిసి సమస్యలు విన్పించేవారు. ఇప్పుడున్న మేయర్ కంటే ఓ మంత్రిని కలవడమే సులువు అనే అభిప్రాయంలో అధికారులు, ప్రజలు వ్యక్తం చేయడం గమనార్హం.
కేకే తో మాట్లాడిన మంత్రి కేటీఆర్..
మేయర్ గద్వాల విజయలక్ష్మి సీనియర్ పొలిటీషియన్, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ అయిన కేకే కూతురు కావడంతో నేరుగా ఆమెతో మాట్లాడకుండా ఆమె వ్యవహారశైలిని తండ్రి దృష్టికి మంత్రి కేటీఆర్ తీసుకొని వెళ్లినట్లు తెలుస్తున్నది. విషయం తెలుసుకున్న కేకే వెంటనే రంగంలోనికి దిగి జరిగిన వ్యవహారాన్ని చక్కబెట్టినట్టారని, దీనికితోడు జీహెచ్ఎంసీ వ్యవహారాలకు కొంత కాలం తన కూతురుని దూరంగా ఉంచి స్వయంగా కేకేనే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీలో మేయర్ తీసుకునే నిర్ణయాలన్నింటినీ ముందుగా కేకే పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతే విజయలక్ష్మి సంతకాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కూతురి వ్యవహారశైలి కారణంగా పార్టీలో, ప్రభుత్వంలో డ్యామేజీ ఏర్పడకూడదనే కేకే ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాగా కేకే జీహెచ్ఎంసీ వ్యవహారాలు పర్యవేక్షించడంపై పార్టీ నాయకత్వం కూడా అభ్యంతరం చెప్పట్లేదని సమాచారం.