ఈసారి సెంట్రల్ హాలులో పార్లమెంటు సమావేశాలు?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి పార్లమెంటు సమావేశాలను సెంట్రల్ హాల్‌లో నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. సోషల్ డిస్టెన్స్ నిబంధన నేపథ్యంలో సభ్యులు పక్కపక్కనే కూర్చోకుండా రోజుమార్చి రోజు ఉభయ సభల సమావేశాలను నిర్వహించడంపై రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ ఇటీవల చర్చించారు. రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ సభ్యుల సంఖ్యకు తగినట్లుగానే సీట్ల అమరిక ఉన్నందున సోషల్ డిస్టెన్స్ నిబంధన పాటించడం సాధ్యం కాదని ఇద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీని వలన ఈసారి […]

Update: 2020-06-01 04:08 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి పార్లమెంటు సమావేశాలను సెంట్రల్ హాల్‌లో నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. సోషల్ డిస్టెన్స్ నిబంధన నేపథ్యంలో సభ్యులు పక్కపక్కనే కూర్చోకుండా రోజుమార్చి రోజు ఉభయ సభల సమావేశాలను నిర్వహించడంపై రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ ఇటీవల చర్చించారు. రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ సభ్యుల సంఖ్యకు తగినట్లుగానే సీట్ల అమరిక ఉన్నందున సోషల్ డిస్టెన్స్ నిబంధన పాటించడం సాధ్యం కాదని ఇద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీని వలన ఈసారి సెంట్రల్ హాల్‌లో నిర్వహించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను వీరిద్దరూ చర్చించుకున్నారు. ఉభయ సభలనూ సంయుక్తగా సమావేశపర్చే సెంట్రల్ హాల్‌లో దాదాపు 780 సీట్లు ఉన్నాయి. అయితే ఒకేరోజున రెండు సభలనూ నిర్వహిస్తే సోషల్ డిస్టెన్స్ నిబంధనకు అర్థం ఉండదు కాబట్టి ఒక రోజు రాజ్యసభను, మరో రోజు లోక్‌సభను నిర్వహించడం ఉత్తమమన్న ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది.

సోషల్ డిస్టెన్స్ పాటించడానికి అనేక ప్రత్యామ్నాయాల్లో ఇది ఒకటి మాత్రమేనని, ఇంకా మరికొన్ని మార్గాల్లో కూడా ఆలోచనలు జరుగుతున్నాయని లోక్‌సభ సెక్రటేరియట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈసారి సభల సమావేశాల్లో సభ్యుల మధ్య కనీసంగా రెండు మీటర్ల దూరాన్ని పాటించేలా దాదాపు నిర్ణయం జరిగింది. అందుకు సెంట్రల్ హాల్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయం అని ఉభయ సభల సెక్రటరీ జనరల్స్ కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. వర్షాకాల సమావేశాలు జరగడానికి సెప్టెంబరు 23 వరకూ గడువు ఉన్నప్పటికీ లాక్‌డౌన్ కారణంగా తలెత్తిన సామాజిక, ఆర్థిక సమస్యలు, భవిష్యత్ వ్యూహం తదితరాలను చర్చించడానికి అప్పటివరకూ ఆగకుండా ఆగస్టులోనే సమావేశాలు నిర్వహించడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమైంది.

పంద్రాగస్టు తర్వాతే వర్షాకాల సమావేశాలు

వార్షిక బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 3 వరకూ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా మార్చి 23తోనే అర్థాంతరంగా ముగిశాయి. వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలై చివరి వారం నుంచి ప్రారంభమవుతాయి. కానీ ఈసారి పంద్రాగస్టు తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ఈసారి ఎన్ని రోజులకు కుదించాలనేదానిపై అన్ని పార్టీల నేతల నుంచి అభిప్రాయాలను తెలుసుకుని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. రోజుమార్చి రోజు సభలను సమావేశపరుస్తున్నందున సంప్రదాయం ప్రకారం నెల రోజుల పాటు నిర్వహించాలనే నిబంధనను పాటించినట్లయితే రెండు నెలల పాటు నడపాల్సి ఉంటుంది. కానీ, గరిష్టంగా మూడు వారాల చొప్పున మాత్రమే ఒక్కో సభను నిర్వహిస్తే సెప్టెంబరు చివరికల్లా ముగించుకోవచ్చని, మళ్ళీ డిసెంబరులో శీతాకాల సమావేశాలకు తగిన సమయం ఉంటుందని అధికారుల అభిప్రాయం.

ఇతర ప్రత్యామ్నాయాలు :

పూర్తిస్థాయిలో సభ్యులు హాజరైనట్లయితే సమావేశాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడానికి సెంట్రల్ హాల్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ పార్లమెంటు ఆవరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులు పాల్గొనడానికి అవకాశం కల్పించడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు సూచించారు. ఎలాగూ లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు టీవీ ఛానెళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందువల్ల సభ్యులు ఏ అంశంలో చర్చలో పాల్గొనదలిచారో ముందుగానే సమాచారం ఇవ్వడం ద్వారా ఇంటి నుంచే ఆ చర్చలో పాల్గొనే వెసులుబాటుపైనా చర్చ జరుగుతోంది. దీనికి తోడు ప్రతీ పార్టీకి పార్లమెంటులోనూ కార్యాలయాలు ఉన్నందున అక్కడి నుంచి కూడా పాల్గొనే అవకాశం కూడా ఉందనే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు సూచించినట్లు తెలిసింది.

లాక్‌డౌన్ సమయంలో సభలు యాక్టివ్‌గా లేనందువల్ల కేంద్ర ప్రభుత్వం కొన్ని బిల్లులకు సంబంధించి ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. వీటికి సభల ఆమోదం పొందడం అనివార్యం కాబట్టి వర్షాకాల సమావేశాలను తప్పక నిర్వహించాల్సే ఉంది. సభలను వాయిదా వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ సిట్టింగ్ డేస్‌ని కుదించే ఆలోచన మాత్రం ఉంది. పైన ప్రస్తావించిన పలు ప్రత్యామ్నాయాల్లో ఏది ఖరారవుతుందనేది పలు పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత స్పష్టమవుతుంది. బ్రిటన్‌ పార్లమెంటులో వీడియో కాన్ఫరెన్సు (ఆన్‌లైన్) ద్వారా హౌజ్ ఆఫ్ కామన్స్ సమావేశాలను సభ్యులు భౌతికంగా సభలో లేకుండా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. అయితే ఇందుకు తగిన మౌలిక సదుపాయాలు, సాఫ్ట్‌వేర్ లాంటి అవసరాల విషయంలో మాత్రం కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

సభ్యుల అటెండెన్స్‌పైనా కొత్త నిబంధనలు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఈసారి వర్షాకాల సమావేశాలకు సభ్యులు హాజరుకావడానికి ఉన్న ఇబ్బందులపైనా అధికారులకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సభ్యులు వారివారి రాష్ట్రాల నుంచి విమానాల్లో రావాల్సి ఉన్నందునా, సోషల్ డిస్టెన్స్ నిబంధనల కారణంగా భౌతికంగా సభకు రాలేకపోయినా ఇతర మార్గాల్లో అటెండెన్స్ కల్పించడంపై అధికారులు కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించినట్లు తెలిసింది. ఆన్‌లైన్ ద్వారా సభా సమావేశాల్లో పాల్గొన్నట్లయితే వారికి అటెండెన్స్ ఇవ్వవచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎంపీలతో పాటు వారి వ్యక్తిగత కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్లు తదితరులంతా పార్లమెంటుకు వస్తారు కాబట్టి అందరికీ థర్మల్ స్క్రీనింగ్ లాంటి పరీక్షలు చేయడం, కారిడార్లలో కదలికలపై ఆంక్షలు విధించడం లాంటివి చేయక తప్పదని, ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం ద్వారా అటెండెన్స్ విషయంలో క్లారిటీ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ఎంపీలు, వారి సిబ్బంది ట్రావెల్ హిస్టరీని తెలుసుకోవడం లాంటివాటిపై సమయాన్ని కేటాయించే బదులు భౌతికంగా సభకు రాకుండా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనడాన్నే అధికారులు నొక్కిచెప్పారు. పార్లమెంటుకు వచ్చే ప్రతీ వాహనాన్ని శానిటైజ్ చేయడం కూడా సమస్యాత్మకమని పేర్కొన్నారు. పార్టీల నేతలతో మాట్లాడిన తర్వాత 33% మంది సభ్యులు భౌతికంగా హాజరైతే సరిపోతుందా లేక 50% మంది వరకూ అనుమతించొచ్చా తదితర అంశాలపైన కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చన్న ఏకాభిప్రాయం లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సమావేశంలో వచ్చినట్లు తెలిసింది. జూన్ మొదటివారంలో లోక్‌సభ స్పీకర్ వివిధ విభాగాల అదనపు సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. సెక్యూరిటీ, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, డిజిటైజేషన్, ఫెసిలిటీస్ కో-ఆర్డినేషన్ బ్రాంచ్, కొశ్చన్ బ్రాంచ్.. ఇలాంటి 24 విభాగాల అధికారులతో లోక్‌సభ స్పీకర్ జూన్ 10వ తేదీ వరకు చర్చించనున్నారు.

Tags:    

Similar News