అనుచరులు అటు.. కౌశిక్ దారి ఎటో..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉప ఎన్నికలకు సిద్దమవుతున్న హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత విచిత్రంగా మారిపోతోంది. నియోజకవర్గంలో గట్టి పోటినివ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితికి చేరుతోంది. కాంగ్రెస్ పార్టీ కేడర్ ను అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్‌లు తమ పార్టీలో చేర్పించుకునే పనిలో నిమగ్నం కావడం ఆ పార్టీకి ఆందోళన కల్గించే పరిణామంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ లోకి… కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన వారు ఇతర పార్టీల వైపు మొగ్గు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉప ఎన్నికలకు సిద్దమవుతున్న హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత విచిత్రంగా మారిపోతోంది. నియోజకవర్గంలో గట్టి పోటినివ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితికి చేరుతోంది. కాంగ్రెస్ పార్టీ కేడర్ ను అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్‌లు తమ పార్టీలో చేర్పించుకునే పనిలో నిమగ్నం కావడం ఆ పార్టీకి ఆందోళన కల్గించే పరిణామంగా మారింది.
బీజేపీ, టీఆర్ఎస్ లోకి…
కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన వారు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన చెల్పూరు సర్పంచ్ మహేందర్ గౌడ్ బీజేపీలో చేరారు. నియోజకవర్గంలోని ఇద్దరు ఎంపీటీసీలు ఇద్దరు. కౌన్సిలర్లు ముగ్గురు టీఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు స్థానిక కేడర్ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితే నెలకొంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు పెరిగిపోతుండడంతో ఉప ఎన్నికల్లో పార్టీ ప్రభావకం ఎంత మేర ఉంటుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాభి కండువా కప్పుకున్నారు.
కౌశిక్ ఎటో..?
హుజురాబాద్ ఇంఛార్జీగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక వేరే పార్టీలో చేరుతారా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారని టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే గులాబీ కండువా కప్పుకుంటానన్న ప్రతిపాదన ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఇందుకు ససేమిరా అంటోందని, నామినేటెడ్ పదవిని ఇస్తామని సూత్ర ప్రాయంగా చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి చర్చలు జరపడంతో గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోందని అంటున్న వారూ లేకపోలేదు. మరోవైపున పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత హుజురాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని ప్రకటిస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డికి సమీప బంధువు కావడంతో కాంగ్రెస్ పార్టీలో సమీకరణాలు మారుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రేవంత్ తన వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తారని కొందరు అంటుంటే, టీఆర్ఎస్ మెయిన్ లీడర్స్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారన్న ప్రచారం వల్ల కూడా ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు మరికొందరు. ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్ భవితవ్యం ఏంటీ అన్నదే అర్థం కాకుండా పోయింది. చుక్కాని లేని నావాల తయారైన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కేడర్ లో అయోమయం నెలకొంది. దీంతో హుజురాబాద్ బై పోల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరోనన్న ఉత్కంఠ నెలకొనడానికి తోడు ఇతర పార్టీల నుండి ఎర వేస్తున్న పరిస్థితి కూడా తయారు అయింది. దీంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ నుండి వేరే పార్టీలకు జంప్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటుందా లేదా అన్నదే అంతుచిక్కకుండా పోయింది.
కాంగ్రెస్ లోనే ఉంటా…
అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొంతమంది కుట్ర పన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ లో చేరుతున్నానని, ఆ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నానని చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని అంటున్నారు.