హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి ప్రచార రథాలు.. అయోమయంలో జనాలు

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తోన్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రామాల్లో ఇండిపెండెంట్‌గా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచార రథాల వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు మంత్రులు, ప్రముఖులు అంతా కూడా గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే కౌశిక్ రెడ్డి మాత్రం వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఊరూరా ప్రచారాలు.. వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన […]

Update: 2021-08-31 23:25 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తోన్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రామాల్లో ఇండిపెండెంట్‌గా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచార రథాల వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు మంత్రులు, ప్రముఖులు అంతా కూడా గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రయత్నిస్తుంటే కౌశిక్ రెడ్డి మాత్రం వినూత్నంగా ముందుకు సాగుతున్నారు.

ఊరూరా ప్రచారాలు..

వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మమేకం అయ్యే పనిలో బిజిబిజీగా గడుపుతున్నారు. చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన హిమ్మత్‌నగర్‌లోనూ కౌశిక్ రెడ్డి స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు గెల్లు శ్రీనివాస్‌ను ఆహ్వానించకపోవడం గమనార్హం.

ప్రచార రథాలు..

ఇప్పటివరకూ నియోజకవర్గం మొత్తం కలియదిరిగి సమావేశాలు నిర్వహించిన కౌశిక్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా ప్రచార రథాలను రంగంలోకి దింపడంతో కౌశిక్ రెడ్డి వ్యూహం ఏంటన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అంతేగాకుండా.. ప్రచార రథాలపై ‘‘పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, టీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు, కౌశిక్ అన్న విజయం తథ్యం’’ అన్న నినాదాలు రాసి ఉన్నాయి. వీటిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, వినోద్ కుమార్, లక్ష్మీ కాంతారావు, సంతోష్ కుమార్‌ల ఫొటోలు ఉన్నాయి. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫొటో లేకపోవడం గమనార్హం.

అభ్యర్థి మార్పుపై ప్రచారం..

గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించిన విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడిందా? అనే అంశంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది. ‘దళితబంధు’ ప్రారంభోత్సవం నుండి కూడా కౌశిక్ రెడ్డి సొంత పబ్లిసిటీ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల పార్టీ నాయకులకు, అభ్యర్థికి సంబంధం లేకుండా జరుపుతున్న ప్రచారంలో అభ్యర్థిని మారుస్తారా? అనే చర్చ ఎక్కువగా మొదలైంది. కౌశిక్ అనుచరులు మాత్రం తమ నాయకున్నే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి కూడా వ్యక్తిగత ప్రచారం చేసుకుంటుండంతో హుజురాబాద్ టీఆరెఎస్‌లో ఏం జరుగుతుందోనన్నదే అంతుచిక్కకుండా తయారైంది.

Tags:    

Similar News