ఇయ్యాల్నన్న దొరుకుతయో..లేదో.!

-రేషన్ షాపుల వద్ద సరుకులకు పడిగాపులు దిశ, మేడ్చల్: ‘మస్తు కష్టమైతాంది బిడ్డ. రెండ్రోజులుగా పొద్దుగాల నుంచి కోపన్ దుక్నం ముందే కూసుంటున్న. అగో ఇచ్చే.. ఇగో వచ్చే అంటుర్రే తప్ప బియ్యం రాలె. నిన్న తీరా దుక్నం బంద్ జేసే ముందల నా వంతు వచ్చింది. బియ్యం తీసుకుందామని.. మెషీన్ల ఎలుబెడితె.. చేతి అచ్చులు పడకపాయె. ఇగ దుక్నపాయినా రేపు రాపో అంటూ వెనక్కి మలిపిండు. అందుకే ఇయ్యాల ఊకి సళ్లక ముందే వచ్చిన. ఇంట్ల […]

Update: 2020-04-06 04:23 GMT
-రేషన్ షాపుల వద్ద సరుకులకు పడిగాపులు

దిశ, మేడ్చల్: ‘మస్తు కష్టమైతాంది బిడ్డ. రెండ్రోజులుగా పొద్దుగాల నుంచి కోపన్ దుక్నం ముందే కూసుంటున్న. అగో ఇచ్చే.. ఇగో వచ్చే అంటుర్రే తప్ప బియ్యం రాలె. నిన్న తీరా దుక్నం బంద్ జేసే ముందల నా వంతు వచ్చింది. బియ్యం తీసుకుందామని.. మెషీన్ల ఎలుబెడితె.. చేతి అచ్చులు పడకపాయె. ఇగ దుక్నపాయినా రేపు రాపో అంటూ వెనక్కి మలిపిండు. అందుకే ఇయ్యాల ఊకి సళ్లక ముందే వచ్చిన. ఇంట్ల బియ్యం అయిపోయినయ్. ముసల్దానికి ఎటుపోతందకు శాత కాట్లే. పక్కింట్లోల్లనన్న చేబదులు అడుగుదామంటే.. వాళ్ల ఇంట్ల గిట్లనే ఉంది. ఏం జేయాల్నో ఏమో. ఇయ్యాల బియ్యం పట్కపోకపోతే.. మాపటికి ఉపాసం పండాలే. ఇయ్యాల్నన్న దొరుకుతయో..లేదో బిడ్డ’ అంటూ ముందుకు కదిలిండు ఓ పెద్దాయన. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ రేషన్ దుకాణం ఎదుట నెత్తిమీద చెయ్యి పెట్టుకోని కూసున్న ఓ పెద్దాయన్ను కదిలిస్తే ఈ తీరుగ చెప్పుకొచ్చిండు తన బాధంతా.

కరోనా వైరస్ (కొవిడ్ -19) కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో పేదలు, వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం, అధికారులేమో.. అన్ని వసతులు ఏర్పాటు చేసినం. మనిషికి 12 కిలోల బియ్యం, ఖర్చులకు రూ.1,500 ఇస్తున్నం అని చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పేదలు, వలస కార్మికులకు తినేందుకు కనీసం బియ్యం లేక పస్తులు ఉంటున్నారు.

జిల్లాలో పేదలకు బియ్యం పంపిణీ కనీసం 30 శాతం కూడా జరగలేదు. రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమై ఐదు రోజులు అవుతున్నా లక్షన్నర కుటుంబాలకే బియ్యం పంపిణీ చేశారు. ఇంకా 3.25 లక్షల కుటుంబాలకు బియ్యం ఇవ్వాల్సి ఉంది. అధికారులు ఇప్పటికైనా వేగవంతం చేస్తారా.. అదే ఉదాసీనత ప్రదర్శిస్తారో చూడాలి.

మేడ్చల్ జిల్లాలో ఇదీ పరిస్థితి.

బియ్యం పంపిణీ మొదలుపెట్టి ఐదు రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు సగం మందికి సైతం బియ్యం పంచలేదు. మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 4,95,232 కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కాని ఐదు రోజుల్లో కేవలం 1,70,131 కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేశారు. ఈ లెక్కలు చూస్తేనే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏలా ఉందో అర్థమవుతుంది. తొలిరోజు 10,558 కుటుంబాలకు 4.17 లక్షల కిలోల బియ్యం, రెండో రోజు 17,241 కుటుంబాలకు 7లక్షల కిలోలు, మూడో రోజు 12,598 కుటుంబాలకు 5.17 లక్షల కిలోలు, నాల్గో రోజు 51,734 కుటుంబాలకు 21.78 లక్షల కిలోలు, ఐదోరోజు 78వేల కుటుంబాలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇంకా 3,25,101 కుటుంబాలకు బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఈ కుటుంబాలకు పూర్తిగా బియ్యం పంపిణీ చేసేందుకు ఎటూ లేదన్న మరో ఐదు రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు పేదల నోట్లోకి ముద్ద ఎలా వెళుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇంకా తెరుచుకోని 76 రేషన్ దుకాణాలు..

ప్రభుత్వం ఓ వైపు యుద్ధప్రాతిపదికన పేదలను ఆదుకోవాలని చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అందడంలోనూ ఇక్కట్లు తప్పడం లేదు. మేడ్చల్ జిల్లా పరిధిలో 638 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అందులో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రేషన్ షాపులు అసలు తెరచుకోలేదు. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా ఇంకా 76 రేషన్ దుకాణాల తలుపులు తెరవాల్సి ఉంది.

తెరిచిన వాటిల్లో సమస్యలు..

తెరిచిన రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ సమస్యగా మారింది. రేషన్ దుకాణాల సర్వర్ వ్యవస్థ సతాయిస్తుండటం.. బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ఒక్కసారిగా లబ్ధిదారులు దుకాణల వద్దకు చేరుకుంటుండటం.. సర్వర్ సతాయిస్తుండటంతో ప్రజలు పెద్దఎత్తున గూమిగూడుతున్నారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌కు విఘాతం కలుగుతోంది. అయితే, వాస్తవానికి రేషన్ సరఫరాలో సర్వర్ ఇబ్బందులు ఎదురైతే.. మాన్యువల్‌గా బియ్యాన్ని పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. కాని అదెక్కడా అమలుకు నోచడం లేదు.

ఫొటోలకు ఫోజులే ఎక్కువ..

ఇప్పటివరకు రేషన్ వ్యవస్థ లేనట్టు.. ప్రజలెప్పుడూ రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకోలేదన్నట్టుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద బియ్యం పంపిణీ సమయంలో ఫొటోలకు ఫోజులిచ్చే సన్నివేశాలు ఎక్కువవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు, రేషన్ డీలర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. దీనికితోడు సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కాని రేషన్ దుకాణాల వద్ద ఎలాంటి నీడ ఉండటం లేదు. ఒక్కో షాపు వద్ద అరకిలోమీటరు వరకు క్యూలైన్లు ఉంటున్నాయి. ఎండలు దంచుతున్నయి. దీంతో ప్రజలు ఎక్కువగా ఎండలో నిల్చోలేకపోతున్నారు. దీంతో సోషల్ డిస్టెన్స్‌కు విఘాతం కలుగుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి టెంట్లు, తాగు నీటి వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: pds shop, rice distribution, 12 kg rice, lockdown, covid 19 effect

Tags:    

Similar News