ఇకనుంచి ఫోన్ లో ప్రభుత్వ వైద్యం.. ఎలా?
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆన్‌లైన్ విధానంలో టి.కన్సల్ట్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. పీహెచ్సీల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి ఆస్పత్రుల వరకు అనుసంధానించి రోగులకు టెలీ మెడిసిన్ సేవలను అందించనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ఇదీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య విధానం ప్రకారం దాదాపు 5000 మంది ప్రజలకు ఒక సబ్ సెంటర్ ఉంటుంది. […]
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆన్‌లైన్ విధానంలో టి.కన్సల్ట్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. పీహెచ్సీల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి ఆస్పత్రుల వరకు అనుసంధానించి రోగులకు టెలీ మెడిసిన్ సేవలను అందించనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ఇదీ..
ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య విధానం ప్రకారం దాదాపు 5000 మంది ప్రజలకు ఒక సబ్ సెంటర్ ఉంటుంది. ప్రతి సెంటర్లో ఏఎన్ఎంలు ఉంటూ సేవలు అందిస్తారు. తర్వాతి దశలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. వీటిల్లో ప్రసూతి వంటి సేవలు పొందవచ్చు. దీంట్లో ఫార్మసీ సైతం ఉంటుంది. ఆ తర్వాత దశలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటారు. దీనిపైన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉంటుంది. ఇక్కడ స్పెషలైజ్డ్ వైద్యులు ఉంటారు. ఇప్పటి వరకు సబ్ సెంటర్‌కు రోగి వస్తే ఏఎన్ఎం ప్రాథమిక పరీక్ష చేసి సమీప పీహెచ్‌సీని సంప్రదించి మెడిసిన్ ఇస్తారు. సబ్ సెంటర్లో పరిష్కారం కాకపోతే పీహెచ్‌సీకి, లేకపోతే జిల్లా కేంద్రానికి పంపిస్తారు. అయితే ఈ ప్రక్రియలో రోగి వివరాలు సరైన రీతిలో సమగ్రంగా నమోదు చేసే విధానం లేదు. అలాగే సబ్ సెంటర్ నుంచి పీహెచ్‌సీకి, పీహెచ్‌సీ నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు దూరం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో నిరీక్షణ, డబ్బుల ఖర్చు, వైద్యుల అపాయింట్‌మెంట్ సమయం అనుకూలంగా ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించేలా టీటా టి.కన్సల్ట్ టెలీమెడిసిన్ సేవలు సిద్ధమయ్యాయి.
ఆలేరు మండలంలో..
టెలీమెడిసిన్ అప్లికేషన్‌లోని ఈ ప్రత్యేకమైన సేవలు తెలంగాణలో మొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టనున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆలేరు మండలంలోని అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు టీటా టి.కన్సల్ట్ ద్వారా అనుసంధానం అవుతాయి. సబ్ సెంటర్లోకి వచ్చిన వ్యక్తి ఏఎన్ఎంల ద్వారా వారి వద్ద ఉండే ట్యాబ్‌లతో టెలీమెడిసిన్ రూపంలో పీహెచ్‌సీ/ కమ్యూనిటీ హెల్త్ సెంటర్/ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండే స్పెషలైజ్డ్ డాక్టర్ల వైద్య సేవలు పొందొచ్చు. దీంతో పాటు ఈ-ప్రిస్క్రిప్షన్ పొందొచ్చు. ఇదంతా కూడా ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ అవుతుంది. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
డీఎంహెచ్‌వోకు బాధ్యతలు
సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు అనుసంధానానికి సంబంధించిన సమన్వయ బాధ్యతలను డీఎంహెచ్‌వో సాంబశివరావుకు కలెక్టర్ అప్పగించారు. టీ కన్సల్ట్ తరపున సందీప్ మక్తాల, శ్రీకాంత్ ఉప్పల, సౌమ్య, రాణా ప్రతాప్, భరత్ ఈ బృందంలో ఉండి క్షేత్రస్థాయి అంశాలను అధ్యయనం చేశారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్నారు.