ఆక్సిజన్ షార్జేజీ.. ఊపిరాగుతోంది

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. గతంలో కృత్రిమ కొరత ఏర్పడితే, ఇప్పుడు నిజంగానే షార్టేజీ చోటుచేసుకుంది. నాలుగైదు రోజులుగా డిమాండ్‌కు తగిన సప్లయ్ ఉండడం లేదు. పరిస్థితిని చక్కదిద్దకపోతే సరఫరా కష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు మొత్తుకుంటున్నారు. రోజుకు సగటున 40 టన్నుల మేర ఉన్న అవసరం, కరోనా కారణంగా 300 టన్నుల దాకా పెరిగింది. రాష్ట్రం లో ఉత్పత్తి సంస్థల సామర్థ్యం మాత్రం 80 టన్నులే. పారిశ్రామిక అవసరాలను పది శాతానికి పరిమితం […]

Update: 2020-08-19 20:50 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. గతంలో కృత్రిమ కొరత ఏర్పడితే, ఇప్పుడు నిజంగానే షార్టేజీ చోటుచేసుకుంది. నాలుగైదు రోజులుగా డిమాండ్‌కు తగిన సప్లయ్ ఉండడం లేదు. పరిస్థితిని చక్కదిద్దకపోతే సరఫరా కష్టమేనని డిస్ట్రిబ్యూటర్లు మొత్తుకుంటున్నారు. రోజుకు సగటున 40 టన్నుల మేర ఉన్న అవసరం, కరోనా కారణంగా 300 టన్నుల దాకా పెరిగింది.

రాష్ట్రం లో ఉత్పత్తి సంస్థల సామర్థ్యం మాత్రం 80 టన్నులే. పారిశ్రామిక అవసరాలను పది శాతానికి పరిమితం చేసినా మెడికల్ అవసరాలకు మాత్రం సరిపోయేంత స్థాయిలో ఆక్సిజన్ అందడం లేదు. ఒక్కసారిగా అవసరం పెరగడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడింది. జిల్లాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కరోనా కేసులు జిల్లాల్లో గణనీయంగా పెరుగుతుండడం, సీజన్ మార్పు తదితరాలతో సమీప భవిష్యత్తులో ఆక్సిజన్ అవసరం మరింత పెరిగే అవకాశం ఉంది.

బళ్లారి, విశాఖపట్నం నుంచి సప్లయ్ మొత్తానికే ఆగిపోయింది. మార్కెట్‌లో ధర పెరిగిపోయింది. అయినా, కొనడానికి ఆసుపత్రులు సిద్ధంగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకోకుటే వారం రోజుల తర్వాత నిస్సహాయ పరిస్థితి ఎదురవుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.

మూడో వంతు పేషెంట్లు ఆక్సిజన్‌ పైనే

రాష్ట్రం మొత్తం మీద ఆగస్టు 19 నాటికి 20,990 మంది పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అందులో 6,529 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇందులో 4,508 మంది ఆక్సిజన్ వార్డులు, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం సాధారణ బెడ్‌లను కూడా ఆక్సిజన్ బెడ్‌లుగా మార్చాలనుకుంటోంది. ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తామని మం త్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ పేర్కొన్నారు.

ఆక్సిజన్ సప్లయ్ మాత్రం అవసరానికి తగిన తీరులో లేదు. కొరత కారణంగా విడివిడి సిలిండర్ల ద్వారా పేషెంట్లకు ఆక్సిజన్ ఇవ్వడంకంటే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు పెడతామని మంత్రి ఈటల పేర్కొన్నారు. తెలంగాణలో ఐనాక్స్, అరెన్‌బరీ ఇండస్ట్రియల్ గ్యాస్ అనే రెండు ఇండస్ట్రీలు మాత్రమే మొత్తం అవసరాలను తీరుస్తున్నాయి. వీటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 80 టన్నులు మాత్రమే.

అవసరాలు కనీసంగా 250 టన్నుల మేర ఉన్నాయి. 60% బళ్లారి నుంచి వస్తున్న ఆక్సిజన్ ద్వారానే సమకూరుతోంది. ‘ఎ’ టైప్ సిలిండర్ (42 లీటర్లు, 47 లీటర్లు) ధర గతంలో రూ.320 ఉంటే, ఇప్పుడు రూ.500 పెట్టినా దొరకడం లేదు. గతంలో లీటర్ ఆక్సిజన్‌కు పది రూపాయలు కూడా ధర లేదని, ఇప్పుడు రూ. 20 పెట్టి కొనడానికి కూడా ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని డీలర్ ఒకరు పేర్కొన్నారు. గతంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడే చాలా ఆసుపత్రులు నాలుగైదు రెట్ల మేర ఎక్కువగా స్టాక్ చేసుకున్నా యి. ఇప్పుడు ఆ రిజర్వు స్టాకు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది.

బళ్లారిలో ఉత్పత్తి ఎందుకు ఆగిపోయింది?

బళ్లారిలోని కంపెనీల నుంచి ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ ఇనుము పరిశ్రమలకు, ఫర్నేస్ అవసరాలకు వెళ్లిపోతోంది. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కావడంలేదు. ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి చేస్తే వ్యయం ఎక్కువవుతుందని, దీంతోపాటు నైట్రోజన్ కూడా ఉత్పత్తి కావాల్సి ఉంటుందని, దాన్ని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వృథా తగ్గిపోతుందని ఉత్పత్తి సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యా నించారు.

ఇప్పుడు నైట్రోజన్‌కు డిమాండ్ లేదన్నారు. ఆక్సిజన్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తే వ్యయం పెరుగుతుందని, ఆ ధరకు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారని పేర్కొన్నారు. అందు వల్లనే ఉత్పత్తి చాలా తగ్గించక తప్పలేదని వివరించారు. ప్రభుత్వం వ్యయాన్ని సబ్సిడీ రూపంలో సర్దుబాటు చేయడం ద్వారా ఇబ్బంది లేకుండా చేయవచ్చని సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నా ఆ రాష్ట్ర అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. తెలంగాణకు ఇవ్వలేమంటున్నారు.

కొరత తీవ్రంగా ఉంది: -జేఎల్ మనోహర్ రావు, సిద్ధి వినాయక డిస్ట్రిబ్యూటర్స్

కరోనా తర్వాత సప్లయ్‌ బాగా తగ్గిపోయింది. దాదాపు 300 టన్నుల దాకా డిమాండ్ ఉంది. నగర అవసరాలకే ఆక్సిజన్ సరిపోవడం లేదు. జిల్లాలకు పంపడం సాధ్యమే కాదు. ఆస్పత్రులు ఉన్న స్టాక్‌ను వాడుకుంటున్నాయి. కేసులు పెరిగిన కొద్దీ ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. ఆ స్థాయికి తగినట్లుగా సప్లయ్ పెరగకపోతే పరిస్థితి ఏమవుతుందో ఊహించలేం.

రిటెయిల్ వ్యాపా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేది నిజం కాదు. సప్లయే లేనప్పుటు స్టాక్ ఎక్కుడుంటుంది? పరిశ్రమలకు సప్లయ్‌ని పది శాతానికి తగ్గించినా మెడికల్ అవసరాలకు సరిపోవడంలేదు. ఈ నెల రోజుల వ్యవధిలో పదికి పైగా కొత్త కంపెనీలు వచ్చాయి. అయినా ఉత్పత్తి సరిపోవడంలేదు

ముడి ఆక్సిజనే లేదు: -మనోహర్ రెడ్డి, సప్లయర్, వరంగల్

వరంగల్ జిల్లాలో ఆక్సిజన్ కొరత ఎక్కువగానే ఉంది. ముడి ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోతే, ఇక మెడికల్ అవసరాలకు ఎలా సాధ్యమవుతుంది? గతంలోకంటే దాదాపు నాలుగు రెట్ల మేర ఆక్సిజన్ డిమాండ్ జిల్లాలో పెరిగింది. కెపాసిటీకి తగినట్లుగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. అవసరాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతర మార్గాల్లో తెప్పించుకోవడం మినహా మార్గం లేదు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. వినియోగానికి తగినంత ఉత్పత్తి లేకపోవడం, ఇది ఊహించని పరిణామం కాబట్టి ఈ కొరత ఏర్పడింది

ఉత్పత్తి పెరగాలి: -డాక్టర్ నవీన్ కుమార్, జాయింట్ డైరెక్టర్, తెలంగాణ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ.

నగరంలో ఆక్సిజన్ కొరత లేదు. వినియోగం బాగా పెరిగింది. దానికి తగినట్లుగా ఉత్పత్తి పెంచాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొత్తగా మూడు పరిశ్రమలకు లైసెన్సు ఇచ్చాం. ఉత్పత్తిని పెంచాలని చెప్పాం. నగరంలో 15 ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు మరింత ఎక్కువ ఉత్పత్తి అవసరం. దాదాపు 20% మేర పెరిగింది. ఇది సరిపోదు. ఇంకా పెరగాల్సి ఉంది. దానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే మెడికల్ ఆక్సిజన్‌కి కొరత లేదుగానీ ఇంకా ఎక్కువ అవసరమైతే ఉంది.

Tags:    

Similar News