రాష్ట్రంలో ఏం చేయలేకే కేంద్రంపై ఆరోపణలు : డీకే అరుణ
దిశ, తెలంగాణ బ్యూరో : పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. మన రాష్ట్రంలో తయారు చేసే వ్యాక్సిన్ మనకు లభించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేసుకోలేక కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఏడ్వడం మానుకోవాలన్నారు. కేటీఆర్కూడా టీకా తీసుకోలేదని, టీకా తీసుకోలేని నేత ప్రజలకు ఏం సలహా ఇస్తాడని ప్రశ్నించారు. ప్రధాని మోడీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. మన రాష్ట్రంలో తయారు చేసే వ్యాక్సిన్ మనకు లభించకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేసుకోలేక కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఏడ్వడం మానుకోవాలన్నారు. కేటీఆర్కూడా టీకా తీసుకోలేదని, టీకా తీసుకోలేని నేత ప్రజలకు ఏం సలహా ఇస్తాడని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ చిత్తశుద్ధితో ఉన్నారని డీకే అరుణ సూచించారు. బీజేపీయేతర రాష్ట్రాలు కుట్ర పూరితంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారని, టీకాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు విశ్వాసాన్ని కల్పించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. కానీ మోడీ ముందుగానే టీకాపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎంత చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ప్రభుత్వాల వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టివేసే కుట్రలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్ కేటాయింపులు చేస్తుందని, కంపెనీలతో కూడా మాట్లాడుతుందని వివరించారు. వ్యాక్సిన్ సెంటర్లలో కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టడం లేదని, ఇదంతా చూస్తే కేంద్రంపై ఎంత కుట్రతో ఉందో తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ అభిప్రాయపడ్డారు.
ధాన్యం కొనుగోళ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏం చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు. ధాన్యం కొనడం లేదని, కొనుగోలు చేస్తున్న చోట్ల రవాణా చేయడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకలు వస్తున్నాయన్నారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ దీనిపై ఏం చర్య తీసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతులు ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం లేదన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం కేంద్రంపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
పంటల సాగు ఎంత అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, దాని ప్రకారం ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం తేటతెల్లమవుతుందన్నారు. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారని, కానీ గత యాసంగి సీజన్ ధాన్యం అమ్ముడుపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం యుద్దప్రాతిపదికన రవాణా చేయాలని, రైతుల నుంచి ధాన్యం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద రైతు అని, అందుకే ఆయనకు చిన్న రైతుల కష్టాలు తెలువడం లేదని, కోట్లలో పంటల సాగు చేస్తున్నట్లు చెప్పుతున్న కేసీఆర్ వేల రూపాయల పంటలు పండించే రైతుల ఇబ్బందులు తీర్చడంలో విఫలమవుతున్నారన్నారు. ఇది ప్రతిపక్షాల విమర్శలుగా భావించరాదని, రైతుల కష్టాలు అర్థం చేసుకోవాలని సూచించారు.