‘ఆసరా’ లేదు.. ఆదుకునేవారు అస్సలే లేరు.. బతికేదెలా..?

దిశ ప్రతినిధి, మెదక్ : దేవుడు కరుణించినా.. పూజారి కరుణించడం లేదన్న చందంగా మారింది ఆసరా పింఛన్ల పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధాప్య అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదిస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే గత ఆగస్టు నెలలో జీవో నెంబర్ 17ను కూడా జారీ చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన వృద్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు తనిఖీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. […]

Update: 2021-12-04 08:57 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : దేవుడు కరుణించినా.. పూజారి కరుణించడం లేదన్న చందంగా మారింది ఆసరా పింఛన్ల పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధాప్య అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదిస్తామని చెప్పింది. చెప్పినట్టుగానే గత ఆగస్టు నెలలో జీవో నెంబర్ 17ను కూడా జారీ చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన వృద్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను అధికారులు తనిఖీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదిలాఉండగా రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామంటూ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసరా కోసం ఎదురుచూపులు..

ఆసరా పింఛన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత ఆగస్టు నెలలో వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 57 ఏండ్లకు కుదిస్తూ జీవో 17ని విడుదల చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది వృద్ధులు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మిగిలి ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపించడంతో మరోమారు ఆక్టోబర్ మాసంలో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. సిద్దిపేట జిల్లాలో ఆగస్టు 31 వరకు 23,527 దరఖాస్తులు రాగా, అక్టోబర్ 31 వరకు మరో 1,641 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో 25,168 దరఖాస్తులు వచ్చినట్టు డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు తెలిపారు. మెదక్ జిల్లాలో 16,697 మంది వృద్ధులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 29,695 వృద్ధులు నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 71,560 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఆసరా పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.

పింఛన్ మంజూరెప్పుడో..

ప్రభుత్వ ప్రకటనతో గత అక్టోబరు మాసంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆసరా పింఛన్ కోసం వృద్ధులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించి రెండు నెలలు కావొస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు అధికారులు సైతం దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రారంభించలేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న ఆశావహులు నిరాశ పడుతున్నారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మందులు కొనుక్కోవడానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా పింఛన్ ఎప్పుడు మంజూరు చేస్తారంటూ వృద్ధులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే పింఛన్లు మంజూరు చేస్తామని చెబుతున్నారు. తక్షణమే అర్హులైన వృద్ధులకు త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News