వారు అలా ముందుకు 'సాగు'తున్నారు!

దిశ, రంగారెడ్డి: జిల్లాలో వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొవిడ్-19తో వానాకాలంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాగుకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు భవిష్యత్ లో ఎరువుల కొరత తలెత్తకుండా ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దఫా సాగు విస్తీర్ణం మరింత పెంచాలని అధికారులు అంచనా వేశారు. సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో […]

Update: 2020-05-07 03:27 GMT

దిశ, రంగారెడ్డి: జిల్లాలో వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కొవిడ్-19తో వానాకాలంలో వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాగుకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు భవిష్యత్ లో ఎరువుల కొరత తలెత్తకుండా ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దఫా సాగు విస్తీర్ణం మరింత పెంచాలని అధికారులు అంచనా వేశారు. సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా పత్తిసాగు చేయాలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పత్తి ధరలు మంచిగా ఉంటాయని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ ఏడాది రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల వ్యవసాయాధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వ్యవసాయాధికారులు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి వీటిని రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఏడాది వ్యవసాయ ప్రణాళికలను ఇప్పటికే విడుదల చేశారు.

జిల్లాలో 1,97,240 హెక్టార్లలో సాగు…

రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సాధారణం కంటే అదనంగా 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో సాధారణంగా 1,67,894 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు పండిస్తుంటారు. అయితే గత వానాకాలం 1,94,103 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఈ వానాకాలంలో 1,97,240 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యధికంగా పత్తి సాగు చేయాలని అధికారులు నిర్ణయించారు. సాధారణంగా జిల్లాలో వానాకాలం సీజన్‌లో 66,970 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పత్తి సాగు చేస్తారు. గత సీజన్‌లో 87,423 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ఏడాది వానాకాలంలో 1,00,536 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేయించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఏడాది పత్తి ధరలు బాగానే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వరి సాగు కూడా పెరగనుంది. సాధారణంగా వానాకాలంలో 13,615 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు.

ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో 14,687 హెక్టార్ల విస్తీర్ణంలో వరిని సాగు చేయాలని నిర్దేశించారు. అలాగే కందుల సాగు కూడా పెంచాలని నిర్ణయం చేశారు. మొక్కజొన్న విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా జిల్లాలో 52,515 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తుండగా ఈ ఏడాది 44,213 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోన్నది. పత్తి మినహా ఇతర పంటలకు విత్తనాలను వ్యవసాయశాఖ సబ్సిడీపై అందించనున్నది.

వానాకాలం సాగుకు సిద్ధం : గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

ఈ వానాకాలం ముందుగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రణాళిక విడుదల చేశాం. వరి, సోయాబీన్‌, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, కందులు, ఆముదం, జీలుగ, జనుము, పిల్లిపెసర, రాగి, కొర్రెలు సబ్సిడీపై అందచేస్తాం. అలాగే రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అన్నివేళలా అందుబాటులో ఉంటాం. పత్తి మినహా ఇతర పంటలకు విత్తనాలను వ్యవసాయశాఖనే సబ్సిడీపై అందిస్తది. వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే పత్తిసాగు చేసే రైతులు పత్తి విత్తనాలను లైసెన్స్‌ డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలి.

ఈ ఖరీఫ్‌లో ఆయా పంటల సాగు లక్ష్యం (హెక్టార్లలో)

పంట సాధారణం సాగులక్ష్యం
పత్తి 66,970 1,00,536
వరి 13,615 14,687
జొన్న 5,064 11,076
మొక్కజొన్న 52,515 44,213
కందులు 5,620 7,401
పెసర 237 170
ఇతర పంటలు 23,873 19,157
మొత్తం 1,67,894 1,97,240

విత్తన సరఫరా ప్రణాళికలు

పంట విత్తనాలు ( క్వింటాళ్లలో)
వరి 7,343.5
జొన్న 1,107.6
మొక్కజొన్న 8,842.6
పెసర్లు 25.5
కందులు 1,110.15
ఇతర పంటలు 1,915.7
మొత్తం 20,345.05

ఎరువుల అవసరం

ఎరువు అవసరం (టన్నులు)
యూరియా 47,553
డీఏపీ 20,606
ఎస్‌ఎస్‌పీ 4,375
ఎంఓపీ 5,469
కాంప్లెక్స్‌ 32,556
మొత్తం 1,10,569

Tags: crops, farmers, officials, plans

Tags:    

Similar News