విత్తనాలు తీసే వినూత్న యంత్రం
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయానికి సంబంధించిన ప్రధాన వనరు ‘విత్తనం’. అయితే కూరగాయలు, పలు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విత్తనాలు తీయడానికి మనం ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులనే అవలంభిస్తున్నాం. చేతితోనే విత్తనాలు తీస్తుండటంతో సమయం వృథా అవుతుండటంతో పాటు కూలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది. ఈ క్రమంలోనే ఒడిషాకు చెందిన రైతు ఓ వినూత్న యంత్రాన్ని తయారు చేసి, విత్తనాలు తీసే సమస్యకు పరిష్కారం చూపాడు. ఇంతకీ ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది? దాన్ని తయారు చేసేందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయానికి సంబంధించిన ప్రధాన వనరు ‘విత్తనం’. అయితే కూరగాయలు, పలు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విత్తనాలు తీయడానికి మనం ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులనే అవలంభిస్తున్నాం. చేతితోనే విత్తనాలు తీస్తుండటంతో సమయం వృథా అవుతుండటంతో పాటు కూలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది. ఈ క్రమంలోనే ఒడిషాకు చెందిన రైతు ఓ వినూత్న యంత్రాన్ని తయారు చేసి, విత్తనాలు తీసే సమస్యకు పరిష్కారం చూపాడు. ఇంతకీ ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది? దాన్ని తయారు చేసేందుకు ఎంత సమయం పట్టిందో? తెలుసుకుందాం.
ఒడిషాలోని పూరికి చెందిన దిలీప్ బరల్ అనే రైతు.. తన వ్యవసాయ క్షేత్రంలో పండిన కూరగాయల నుంచి విత్తనాలు తీసి మార్కెట్‌లో విక్రయిస్తుంటాడు. అయితే కూలీల కొరతతో పాటు విత్తనాలు తీసేందుకు అధిక సమయం వెచ్చించాల్సి రావడంతో అనుకున్న సమయానికి సీడ్స్ మార్కెట్‌కు చేరేవి కావు. ఉదాహరణకు మూడు క్వింటాళ్ల టమాటాలు లేదా ఆరు క్వింటాళ్ల వంకాయలను చూర్ణం చేసి వాటి నుంచి సీడ్స్ వేరే చేసేందుకు ఐదుగురు కూలీలకు గంట సమయం పడుతుందట. ఈ సమయాన్నే తగ్గించాలని దిలీప్ భావించాడు. ఈ నేపథ్యంలోనే ఓ మెషిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని స్థానిక మ్యానుఫాక్చరర్స్‌కు వివరించిన దిలీప్.. వారి వద్ద నుంచి పరికరాలు తీసుకుని డిజైన్ ఎలా ఉంటే బాగుంటుంది? అని ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. ఏడేళ్లు శ్రమించి చివరకు ఫైనల్ డిజైన్‌తో మెషిన్ తయారు చేశాడు.
ఈ మెషిన్ నమూనా విషయానికొస్తే.. లోపలి భాగంలో ఎలక్ట్రికల్ మోటార్ సాయంతో తిరిగే స్టీల్ ట్యాంక్ బ్లేడ్స్‌ను అమర్చారు. యంత్రం పై భాగం నుంచి వేసిన కూరగాయలు స్టీల్ బ్లేడ్ల మధ్యన నలిగి గుజ్జు, విత్తనాలను వేరు పడతాయి. ఇక మెషిన్‌లోని మరో ద్వారం ద్వారా బయటకు వచ్చిన విత్తనాలను శుభ్రపరిచి ప్యాక్ చేసి మార్కెట్‌కు పంపించొచ్చు. ఈ మెషిన్ ఒక గంట సమయంలో 10 క్వింటాళ్ల టామాటా, 3 క్వింటాళ్ల వంకాయల నుంచి విత్తనాలు తీస్తుంది. ఈ యంత్రం సమయాన్ని సేవ్ చేయడంతో పాటు విత్తనాలు తయారు చేసే రైతులకు ఆర్థికంగా తక్కువ ధరలో అందుబాటులో ఉంటుందని రైతు దిలీప్ తెలిపారు. ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించిందినందుకు ఒడిషా రాష్ట్రప్రభుత్వం దిలీప్‌ను ఇటీవలే సత్కరించింది.