StarLink: ఇచ్చినట్టే ఇచ్చి కండీషన్స్ పెడుతున్నారు.. మస్క్ స్టార్‌లింక్‌కు ఇండియాలో కఠిన రూల్స్!
StarLink: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) కు చెందిన స్పేస్ ఎక్స్ తో దేశీయ అగ్రగామి టెలికాం సంస్థలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: StarLink: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) కు చెందిన స్పేస్ ఎక్స్ తో దేశీయ అగ్రగామి టెలికాం సంస్థలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరికొద్ది రోజుల్లో భారత్ లో స్టార్ లింక్(StarLink) సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం(strict rules) కొన్ని కండిషన్స్ విధించినట్లు తాజా కథనాల ద్వారా తెలుస్తోంది. భారత్ లో సేవలందించాలంటే దేశంలో కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలకు ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనాన్ని వెల్లడించింది.
సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండేలా భారత్ లోనే కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం కఠిన నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సెంటర్ అందుబాటులో ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తిన సమయంలో తక్షణమే చర్యలు తీసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. శాంతిభద్రతలు చేయి దాటిపోయేలా ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న స్టార్ లింక్ ప్రధాన కార్యాలయం తలుపు కొట్టాల్సిన అవసరం లేకుండా స్వదేశంలోనే మేము నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండాలని కేంద్ర వర్గాలు చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దీంతోపాటు విపర్తతు నిర్వహణ, ప్రజాభద్రత వంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారిక మార్గాల ద్వారా దర్యాప్తు ఏజెన్సీలు...ఆయా టెలికాం సర్వీస్ లను తాత్కాలికంగా తమ నియంత్రణలోకి తీసుకుని కాల్స్ ను యాక్సెస్ చేసుకునే సెక్యూరిటీ అనుమతులు ఉండాలని కేంద్రం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త నిబంధనేది లేదని...ప్రస్తుతం జియో , ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి నెట్ వర్క్ లు కూడా దీనికి కట్టుబడి ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.
ఈ నిబంధనలపై స్టార్ లింక్ కంపెనీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే తమ అభిప్రాయాన్ని చెబుతామని కంపెనీ తెలియజేసింది. భారత్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడం కోసం అనుమతులు కోరుతూ ఇప్పటికే స్టార్ లింక్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. మరోవైపు ఈ సర్వీసులను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు భారతీ ఎయిర్ టెల్, జియో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
READ MORE ....
Donald Trump: ఫలిస్తున్న ట్రంప్ మధ్యవర్తిత్వం.. యుద్ధ విరమణకు రష్యా ఓకే