ముగిసిన నామినేషన్ల పర్వం.. గులాబీ పార్టీకి రెబల్స్ టెన్షన్

దిశ ప్రతినిధి, మెదక్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో కీలక ఘట్టం ముగిసింది. మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. స్థానిక సంస్థల నియోజకవర్గ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా నియమింపబడిన సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌‌లో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. మెదక్ శాసన మండలికి ఏడుగురు 13 సెట్ల నామినేషన్లు దాఖలు […]

Update: 2021-11-24 10:38 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో కీలక ఘట్టం ముగిసింది. మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. స్థానిక సంస్థల నియోజకవర్గ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా నియమింపబడిన సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌‌లో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. మెదక్ శాసన మండలికి ఏడుగురు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. వీరు మినహా మిగతా ఐదుగురు బరిలో ఉన్నట్టు పేర్కొన్నారు. రేపటివరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పించారు. ఇదిలాఉండగా బరిలో నిలిచిన అభ్యర్థులను విత్ డ్రా చేయించేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

బరిలో ఐదుగురు..

మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య, మెదక్ రిటర్నింగ్ అధికారి హరీశ్, సహాయ ఎన్నికల అధికారి రమేశ్ పార్టీ అభ్యర్థులు, ప్రతినిధులు సమక్షంలో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఎన్నికల నియమావళిలోని చెక్ లిస్టు ప్రకారం ఐదుగురు అభ్యర్థుల నామినేషన్స్ సక్రమంగా ఉన్నట్టు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఒంటరి యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు చింతల సాయిబాబా, బోయిని విజయలక్ష్మి, మట్ట మల్లారెడ్డిలు బరిలో నిలిచారు. నామినేషన్స్ విత్ డ్రా సమయం ముగిసేవరకు ఎంత మంది నామినేషన్స్ విత్ డ్రా చేసుకుంటారో చూడాలి.

ఇద్దరి నామినేషన్స్ తిరస్కరణ..

స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్, ఐరేని సత్యనారాయణగౌడ్ నామినేషన్స్ తిరస్కరణకు గురైనట్టు అధికారులు తెలిపారు. దీనికి వీరిపై ఫోర్జరీ సంతకాలు చేశారన్న ఆరోపణలు రావడమే ప్రాథమిక కారణమని తెలుస్తోంది. పటాన్ చెరుకు చెందిన ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తాము బలపర్చినట్టు ఫోర్జరీ సంతకాలు చేశారంటూ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడీల కుమార్ గౌడ్‌లు పటాన్ చెరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అదే విధంగా మరో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చిన్నశంకరంపేట్ వైస్ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు ఐరేని సత్యనారాయణగౌడ్ పై సైతం ఫోర్జరీ ఆరోపణలు వచ్చాయి. సత్యనారాయణ గౌడ్ నామినేషన్ పత్రాల్లో ఫోర్జరీ చేశారని గవ్వలపల్లికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ రాతుల సునిత మంగళవారం చిన్నశంకరంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై ఫోర్జరీ సంతకాల ఆరోపణ రావడంతోనే ఇద్దరి నామినేషన్స్ తిరస్కరణకు గురైనట్టు సమాచారం.

కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం..

మెదక్ శాసనమండలి స్థానానికి బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి నిష్క్రమింపజేసేందుకు అధికార టీఆర్ఎస్ బుజ్జగింపులకు తెరలేపినట్టు సమాచారం. ప్రస్తుతం బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులందరూ అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులే కావడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందన్న ఆలోచనతో జిల్లా మంత్రి, స్థానిక నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలిపారు. వారి డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని పోటీ నుండి తప్పుకోవాలని, నామినేషన్స్ విత్ డ్రా చేసుకోవాలని జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ద్వారా కోరారని, దీనికి స్వతంత్ర అభ్యర్థులు ససేమిరా అన్నట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనా బరిలో ఎవరూ నిల్చుంటారనేది తెలవాలంటే ఈ నెల 26 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News