బ్యాంకులకేది భద్రత..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: భద్రతకు మారు పేరుగా నిలిచే బ్యాంకులే లూటీ అవుతున్నాయి. ఓ వైపున రాబరీ గ్యాంగ్స్ మరో వైపున ఛీటింగ్ గ్యాంగులు బ్యాంకులనే నిలువు దోపిడీ చేస్తున్నాయి. రాబరీ గ్యాంగులు అటాక్… పెద్దపల్లి జల్లా మంథని మండలం గుంజపడుగు ఎస్‌బీఐలో చోరీ సంచలనం సృష్టించింది. గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను కట్ చేసి డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లేకుండా చోరికి పాల్పడింది ప్రోపెషనల్సేనని పోలీసులు భావిస్తున్నారు. గుంజపడుగు బ్యాంక్ తరహలోనే […]

Update: 2021-03-28 05:47 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: భద్రతకు మారు పేరుగా నిలిచే బ్యాంకులే లూటీ అవుతున్నాయి. ఓ వైపున రాబరీ గ్యాంగ్స్ మరో వైపున ఛీటింగ్ గ్యాంగులు బ్యాంకులనే నిలువు దోపిడీ చేస్తున్నాయి.

రాబరీ గ్యాంగులు అటాక్…

పెద్దపల్లి జల్లా మంథని మండలం గుంజపడుగు ఎస్‌బీఐలో చోరీ సంచలనం సృష్టించింది. గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను కట్ చేసి డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లేకుండా చోరికి పాల్పడింది ప్రోపెషనల్సేనని పోలీసులు భావిస్తున్నారు. గుంజపడుగు బ్యాంక్ తరహలోనే ఏడేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంక్ చోరీ జరిగింది. సీసీ పుటేజ్‌లు దొరక్కుండా గుంజపడుగు బ్యాంక్‌లో ఎలా జాగ్రత్త పడ్డారో చొప్పదండి బ్యాంక్ లో అలానే దొంగతనం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులు డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) అనుకుని యూపీఎస్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో డీవీఆర్‌లో రికార్డయిన ఉగ్రవాదులను గుర్తించడం సులువైంది. గుంజపడుగ చోరీ ఘటనలో కూడా నిందితులు డీవీఆర్ బాక్స్ తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. దశాబ్దం క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ జరిగింది. అప్పుడు కూడ దొంగలు గ్యాస్ కట్టర్ తో లాకర్ కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. కేజిన్నర బంగారంతో పాటుగా కోటి 50లక్షల నగదును దొంగలు దోచుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఈ కేసులో అనుమానితుడు వాహనాల తనిఖీలో దొరకినా నేటికీ బ్యాంక్ చోరీ మిస్టరీ మాత్రం వీడలేదు.

2020 డిసెంబర్ 15న కరీంనగర్ జిల్లా ఊటురు ఎస్‌బీఐలో దోపిడీకి దొంగలు యత్నించారు. బ్యాంకు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు డబ్బులను దొంగిలిండానికి విఫలయత్నం చేశారు. కమాన్ పూర్ మండలం పేరపల్లికి చెందిన దూలం రాజు, రాగడిమద్దికుంట, సుల్తానాబాద్ కు చెందిన అతని బావ బాలసాని అజయ్, రొంపికుంటకు చెందిన మాడిశెట్టి రాకేష్ , జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన వెన్నుపూసల రాకేష్ రెడ్డి లు చోరీలకు పాల్పడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఊటురు బ్యాంక్ ను చోరీ చేయడానికి ఎంచుకున్నారు. ఐరన్ గ్రిల్స్ తొలగించి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన అనంతరం అలారం వైర్లను కట్ చేశారు. లాకర్ ఓపెన్ చేసే సమయంలోనే పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో అక్కడి నుంచి పరారై చివరకు పోలీస్ లకు చిక్కారు.

ఇదో రకం ఛీటింగ్ గ్యాంగ్

బ్యాంకులకు కన్నం వేసే ముఠాలు కొన్నైతే నకిలఅ డాక్యూమెంట్లతో కోట్ల రూపాయాలను కాజేసేందుకు వాటినే వేదికగా చేసుకున్నాయి మరికొన్ని గ్యాంగులు. నకిలీ పత్రాలతో బ్యాంకుల్లో రుణాలు ఎత్తుకుని రూ.కోట్లు కాజేశారు కేటు గాళ్లు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2016-18లో 153 మంది రైతుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలను ష్యూరిటీగా పెట్టి రూ.కోటి 99లక్షల 89 వేలు డ్రా చేశారు. సంవత్సరం గడిచినా రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రికార్డులను పరిశీలించడంతో అవి నకిలీవని గుర్తించి 153 మంది రైతులపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన సూత్రదారి అయిన పందుల ప్రభాకర్ తో పాటు 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నకిలీ పాసుపుస్తకాలను సృష్టించి బ్యాంక్ రుణాలు ఇప్పించిన వారి వద్ద నుండి 5లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బరు స్టాంపులు, పహాని పత్రాలు స్వాధీనం చేసుకున్నా రుణాల ద్వారా అందించిన మొత్తం నగదును మాత్రం రికవరీ చేయలేక పోయారు. ఈ ముఠాలో ఇద్దరు బ్యాంకు మెనేజర్లు, ఓ వీర్వో భాగస్వాములుగా ఉండడం కోస మెరుపు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం యూనియన్ బ్యాంకులో కూడా నకిలీ పత్రాలు పెట్టి రైతుల పేరిట లోన్లు ఎత్తుకున్న సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇంటి దొంగల తీరు…

బ్యాంకుల ఆర్థిక లావాదువీల్లో కీలకంగా వ్యవహరించే చెస్ట్ మేనేజర్ ప్లాన్ బెడిసి కోట్టడంతో బ్యాంకు సోమ్ము కాస్త ప్రైవేట్ వ్యక్తుల పాలయింది. ఆ అధికారి వేసిన తప్పటడుగు ఫలితం రూ. 12 కోట్లు గల్లంతయ్యాయి. కరీంనగర్ యూనియాన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుండి ఆరు నెలల్లో రెండు దఫాలుగా బ్యాంకు నుంచి రూ. 12 కోట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పుగా ఇచ్చి తన కమీషన్ మాత్రం తీసుకున్నాడు చెస్ట్ మేనెజర్ సురేష్. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డ సురేష్ ఆడిటింగ్ అధికారులు గుట్టును రట్టు చేశారు. చెస్ట్ మేనేజర్ సురేష్ కుమార్ మహరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రూ. 50 లక్షల కమిషన్ కోసం బ్యాంకు సొమ్మును అప్పనంగా ఇచ్చేశాడు. 2018 అక్టోబర్ లో రూ. 5కోట్లు ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తికి ఇవ్వగా, 2019 పిభ్రవరిలో మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తికి రూ.7 కోట్లు ఇచ్చి బ్యాంకు అధికారుల విచారణలో తేలింది. అయితే సురేష్ కుమార్ బ్యాంకుకు సంబంధించిన నగదును అప్పుగా ఇచ్చినా బాకీ దారులు తిరిగి ఇవ్వక పోవడంతో నేటికీ బ్యాంకు ఖాతలోకి మాత్రం డబ్బు వచ్చి చేరలేదు. దీంతో బ్యాంకు అధికారులు సురేష్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల పై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ ఫిర్యాదు చేశారు. 2014లో కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో జరిగిన ఘటన సంచలనం కలిగించింది. బ్యాంకు మేనేజర్ వద్ద పనిచేస్తున్న టెంపరరీ ఎంప్లాయ్ ఏకంగా 2 కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఖాతాదారులకు తిరిగి అప్పగించే క్రమంలో తాత్కాలిక ఉద్యోగి తన చేతి వాటం ప్రదర్శిస్తూ ఏకంగా 2 కిలోల బంగారాన్నే మాయం చేశాడు. చాలా కాలం తరువాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేశారు.

సెక్యూరిటీ చర్యలు శూన్యం

ఆర్థిక లావాదేవీలకు ప్రధాన కేంద్రాలుగా నిలిచే బ్యాంకుల వద్ద సెక్యూరిటీ చర్యలు మాత్రం శూన్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్ట్రాంగ్ రూం, సీసీ కెమెరాలు వంటి సాంకేతికతపై ఆధారపడుతున్న బ్యాంకులు రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం వ్యాపార లావాదేవీలు జరిగేటప్పుడు, బ్యాంకులకు నగదును తరలించేప్పుడు మాత్రమే సెక్యూరిటీ వింగ్ ను ఉపయోగిస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిరంతరం నిఘా నీడలో ఉండాల్సిన బ్యాంకుల వద్ద సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేయడంలో నామామాత్రపు చర్యలతోనే మిగిలిపోతున్నాయి. ఈ కారణంగానే ఏటీఎం సెంటర్లే అయినా, బ్యాంకులే అయినా దోపిడీకి గురవుతున్నాయని స్పష్టం అవుతోంది. అలాగే బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు ఉన్న నిబంధనలు పాటించడంలో కూడా బ్యాంకర్లు విఫలం అవతున్నారని స్పష్టం అవుతోంది. ఫేక్ డాక్యూమెంట్లను బ్యాంకులో ప్రొడ్యూస్ చేయగానే అవి అసలువా నకిలీవా అన్న విషయంపై దృష్టి పెట్టడం లేదు. లబ్ధిదారులు రుణాల కోసం చేసుకున్న డాక్యూమెంట్లు అసలైనవేనా లేక నకిలీవా అన్న విషయాన్ని కన్ పం చేసుకోకుండా చకచకా రుణాలు మంజూరు చేయడం విడ్డూరంగా ఉంది. అలాగే ఒకే వ్యక్తి ద్వారా పలువురికి రుణాలు ఇచ్చే సంస్కృతి కూడా బ్యాంకులను మోసగించేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఫీల్డ్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపడంలో నిర్లక్ష్యం జరుగుతోందని ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది.

మహేశ్ బ్యాంకులో భారీగా అక్రమాలు

Tags:    

Similar News