ఇక్కడ కేసీఆర్ ఆదేశాలు అమలు కాలేదు
గురుకుల్ భూ వివాదాలు అక్షయపాత్రగా మారుతున్నాయి. రియల్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులంతా వివాదాస్పద భూములను ఆధారంగా చేసుకుని రూ.లక్షలు, రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న వందలాది ఎకరాల గురుకుల్ భూములు, ఘట్ కేసర్ భూములపైనా పెద్ద తతంగమే నడుస్తోంది. అటు దరఖాస్తుదారులు, గురుకుల్ ట్రస్టు, మరో వైపు ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తున్నారు. దళారీలు మాత్రం ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు నాయకులు సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇందుకోసం […]
గురుకుల్ భూ వివాదాలు అక్షయపాత్రగా మారుతున్నాయి. రియల్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులంతా వివాదాస్పద భూములను ఆధారంగా చేసుకుని రూ.లక్షలు, రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న వందలాది ఎకరాల గురుకుల్ భూములు, ఘట్ కేసర్ భూములపైనా పెద్ద తతంగమే నడుస్తోంది. అటు దరఖాస్తుదారులు, గురుకుల్ ట్రస్టు, మరో వైపు ప్రభుత్వం పెద్ద పోరాటమే చేస్తున్నారు. దళారీలు మాత్రం ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు నాయకులు సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇందుకోసం ఆఫీసులు కూడా తెరిచి పెట్టారు. అగ్గువ ధరలకు ప్లాట్లు కొనుగోలు చేసి, తిరిగి అమ్మే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.
దిశ, న్యూస్ బ్యూరో: తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 21 రోజులకే కేసీఆర్ ఈ విషయం మీద దృష్టి సారించారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గురుకుల్ భూములు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారు రంగంలోకి దిగి 2014 జూన్ 23 న 24 బహుళ అంతస్తుల భవనాలను కూల్చేశారు. 11 భవనాలకు తాళాలు వేశారు. ఏమైందో ఏమో గానీ.. కొద్ది రోజులకే అంతా గప్ చుప్. కూలిన భవనాలు మళ్లీ లేశాయి. ఇప్పుడు మరింత ఎత్తులో దర్శనమిస్తున్నాయి. తాజాగా వారం రోజుల నుంచి బల్దియా హడావుడి చేస్తోంది. గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతల ప్రక్రియను చేపట్టింది. తెర వెనుక వ్యవహారాలూ వేరుగా ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. కొద్ది రోజులు కూల్చివేతలు చేపడతారు. ఆకస్మాత్తుగా ఆపేస్తారు. అంతా సర్దుకుందిలే అనుకునేలోగా జీహెచ్ఎంసీ అధికారులు బుల్డోజర్లతో దర్శనమిస్తారు. ఆరేండ్ల క్రితం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలియదు. దీంతో వేలాది మంది అమాయకులు ఇక్కట్లకు గురవుతున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన 2,892 మంది యజమానులు ఆందోళనలో ఉన్నారు. కొందరేమో నాయకులు, రియల్టర్ల ఒత్తిళ్ల మేరకు అగ్గువ ధరలకే అమ్ముకొని వెళ్లిపోతున్నారు. భనాలు లేస్తూనే ఉన్నాయి. అప్పుడు జీహెచ్ఎంసీ యంత్రాంగమంతా మౌనంగా ఉంటోంది. ఎవరైనా ట్విట్టర్ లోనో, లిఖితపూర్వకంగానో ఘాటుగా ప్రశ్నిస్తే మళ్లీ కూల్చివేతలు కనిపిస్తుంటాయి.
అక్కడంతా పెద్దల వ్యవహారమే
2014 తర్వాత ఈ వివాదాస్పద గురుకుల్ ట్రస్టు భూముల్లో పెద్దల కొనుగోళ్లే అధికంగా ఉన్నాయి. చాలా మంది నోటరీల మీదనే కొనుగోలు చేశారు. నాయకుల బంధుగణం, స్నేహితుల పేరిట ఈ ప్లాట్లు కనిపిస్తున్నాయని తెలిసింది. ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ప్రచారం చేయడం ద్వారా తక్కువ ధరలకే ప్లాట్లను తమ వశం చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్లే బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ప్రహరీని కూల్చినా, నిర్మించినా చర్యలు చేపట్టే బల్దియా అధికారులకు ఇక్కడేం చేసినా కనిపించదు. అక్కడ కొన్ని నెలల వ్యవధిలోనే 6, 7 అంతస్థుల భవంతులు వెలుస్తాయి. సీఎంఓ నుంచి ఆదేశాలు రాగానే కూల్చివేతల ప్రక్రియ ఊపందుకుంటుంది. ఇన్నేండ్ల తర్వాత నిర్ణయం ఏమిటని కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయని, నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించొద్దని చెప్పిందని ఓ బాధితుడు ప్రసాద్ అన్నారు. చాలా మంది దగ్గర సేల్ డీడ్లు ఉన్నాయని, కొందరు నోటరీల ద్వారా కూడా కొనుగోలు చేశారని. అవి చెల్లే పరిస్థితి లేదంటున్నారు. అలాంటివారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ ఉన్నతాధికారులు తీసుకున్న క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేస్తే బాగుండేదన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ అక్రమ నిర్మాణాల వెనుక పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి అనుచరగణాలే ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆనాడే క్రమబద్ధీకరించాలని ప్రతిపాదన
2003 ఏప్రిల్ 26న, 2006 సెప్టెంబరు 21న జరిగిన సమీక్షా సమావేశాల్లో గురుకుల్ ట్రస్టు భూములను అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములుగా తేల్చారు. అన్ని లిటిగేషన్లు, క్లెయిమ్స్ లను పక్కన పెట్టాలని తీర్మానించారు. వివాదాల పరిష్కారాలను అడ్వకేట్ జనరల్ లేదా సీనియర్ న్యాయవాదికి అప్పగించాలని తీర్మానించారు. అన్ని యూఎల్సీ రెగ్యులరైజేషన్ పైళ్లను తిరస్కరించాలని, దేవాదాయ శాఖ చట్టాల ప్రకారం దరఖాస్తులన్నింటినీ రిజెక్ట్ చేయాలని అనుకున్నారు. దీని కోసం ప్రత్యేక రెగ్యులరైజేషన్ స్కీంను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. నివాసాలను, షెడ్లను, దుకాణాలను, సింగిల్ రూములను, బేస్మెంట్లను, ప్రహరీలను కలిగినవాటితోపాటు రిజిస్టర్డ్ సేల్ డీడ్ కలిగిన ప్లాట్లను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఆఖరికి కమర్షియల్, ఇండస్ట్రియల్, బిజినెస్ కేంద్రాలకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ రేట్లను నిర్ణయించాలని పేర్కొన్నారు. స్థల వినియోగాన్ని బట్టి రేట్లను ప్రకటించాలని స్పష్టం చేశారు. ఖాళీ స్ధలాలన్నింటినీ హుడా (నేటి హెచ్ఎండీఏ)కు కేటాయించాలన్నారు. నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్, హైటెక్స్ లకు కేటాయించిన స్థలాలను కూడా క్రమబద్ధీకరించాలని, మిగతా స్థలాన్ని హుడాకు కేటాయించాలనీ పేర్కొన్నారు. గురుకుల్ ట్రస్టు కార్యకలాపాల కోసం ఆర్ధిక తోడ్పాటునందించాలని కూడా ఉన్నత స్థాయి అధికారుల కమిటీ అభిప్రాయపడింది. దీని ప్రకారం 2006 లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్, హుడా వైస్ చైర్మన్ లేదా స్పెషల్ అధికారిలతో కమిటీని నియమించారు. నేటి వరకు ఈ కమిటీ ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదు. యూఎల్సీ పరిధిలోని స్థలాల క్రమబద్ధీకరణకు 2008 జూన్ 18న జీఓ 747ను జారీ చేశారు. దాని ప్రకారం గురుకుల్ ఘట్ కేసర్ ట్రస్టు నుంచి ఖానామెట్, ఇజ్జత్ నగర్ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి, సేల్ డీడ్స్ కలిగిన 2,737 మంది ఫీజులు కట్టి దరఖాస్తు చేసుకున్నారు. ఐతే అధికారులు ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసి 23,16,839 చ.మీ. స్థలం సీలింగ్ కు మించి ఉందని తేల్చారు. ఈ సర్ ప్లస్ స్థలాన్ని 2006 ఏప్రిల్ 19న స్వాధీనం చేసుకున్నారు.
గురుకుల్ భూముల కథ
అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు కింద ఇజ్జత్ నగర్ సర్వే నం.5/2 నుంచి 5/23 వరకు 167.11 ఎకరాలు, ఖానామెట్ సర్వే.11 నుంచి 15, 17, 19, 20, 22, 23, 26, 27, 29, 32, 34, 43, 44, 45, 46, 47, 48, 58, 59, 61, 64, 65 ల్లోని 410.14 ఎకరాలు (మొత్తం 577.25 ఎకరాలకు) గురుకుల్ ట్రస్టు అధ్యక్షుడు డిక్లరేషన్ ఇచ్చారు. 1975-76 పహాణీల్లో ఇజ్జత్ నగర్ సర్వే నం.12, 13 ల్లో పట్టాదారుడిగా రామస్వామి పేరు నమోదై ఉంది. దాంతో డిక్లరేంట్ ఇచ్చిన డిక్లరేషన్లో ఈ భూమిని పరిగణనలోకి తీసుకోలేదు. మిగతా సర్వే నంబర్లలోని 23,38,073 చ.మీ.ల స్థలాన్ని తీసుకున్నారు. ఘట్ కేసర్ ట్రస్టు కొన్ని కో ఆపరేటివ్ సొసైటీలకు, వ్యక్తులకు భూములను కేటాయించింది. అవన్నీ కూడా సేల్ డీడ్స్ ద్వారా జరిగాయి. సీలింగ్ యాక్టు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మకాలు సాగించాయి. ట్రస్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫైల్ నం.బి1/1301/82, తేదీ.20.4.1982 ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వం జీఓ నం.703, రెవెన్యూ (ఎండోమెంట్), 30.9.2000 ప్రకారం 1987వరకు సాగిన క్రయ విక్రయాలు, జీపీఏలను రద్దు చేశారు. జీపీఏ పొందిన బి.కిషన్ లాల్, ఇతరులకు ఇది వర్తించింది. ఈ కారణంతో నిరభ్యంతర పత్రాలు జారీ చేయకపోవడంతో శ్రీస్వామి అయ్యప్ప కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత గురుకుల్ ట్రస్టు తరపున కూడా పలు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.
వివిధ కోర్టులలో పలు కేసులు పెండింగ్లో ఉన్నందున జీవో 747 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ చేయలేకపోయారు. రిట్ పిటిషన్ నం.29407/2008, 9714, 16658/2009లకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. ‘‘గురుకుల్ ట్రస్టు భూములను థర్డ్ పార్టీ ఆక్రమించుకున్నది. సదరు స్థలాల్లో నిర్మాణాలు వెలిశాయి. అందుకే దానికి బదులుగా మరో చోట ట్రస్టుకు స్థలాన్ని కేటాయించాలి. ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలను, ప్లాట్లను అనుభిస్తోన్న వారికి ప్రత్యేక క్రమబద్ధీకరణ స్కీంను రూపొందించాలి. థర్డ్ పార్టీలకు, హౌజింగ్ సొసైటీలకు, వెల్ఫేర్ అసోసియేషన్ల కోసం ఈ స్కీంను అమలు చేయాలి’’ అని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. 2013లోనూ సుప్రీం కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని స్టేటస్ కో జారీ అయ్యింది. ఇక ప్రభుత్వం చేతిలోనే నిర్ణయం ఉంది. ఇకనైనా రేట్లను నిర్ణయించి క్రమబద్ధీకరించడం ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.