‘వలస కూలీల వద్ద చార్జీలు తీసుకోవద్దు : సుప్రీం
న్యూఢిల్లీ: ‘వలస కూలీలను సొంతూళ్లకు పంపేందుకు ఇంకా ఎంత కాలం పడుతుంది?’.. ‘ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు?’.. ‘వారందరికీ ఆ వివరాలు చేరేందుకు ఏం చేస్తున్నారు?’.. ‘ఆ శ్రామికుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారా?’.. ‘వారికి ఆహారం ఎందుకు అందడం లేదు?’.. ఇలా కనీసం ఓ హాఫ్ సెంచరీ టఫ్ కొశ్చన్‌లను సుప్రీంకోర్టు కేంద్రానికి సంధించింది. లాక్‌డౌన్ బాధలతో సొంతూళ్లకు బయల్దేరిన వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం, ప్రయాణ సదుపాయాల్లో సమస్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి […]
న్యూఢిల్లీ: ‘వలస కూలీలను సొంతూళ్లకు పంపేందుకు ఇంకా ఎంత కాలం పడుతుంది?’.. ‘ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు?’.. ‘వారందరికీ ఆ వివరాలు చేరేందుకు ఏం చేస్తున్నారు?’.. ‘ఆ శ్రామికుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారా?’.. ‘వారికి ఆహారం ఎందుకు అందడం లేదు?’.. ఇలా కనీసం ఓ హాఫ్ సెంచరీ టఫ్ కొశ్చన్‌లను సుప్రీంకోర్టు కేంద్రానికి సంధించింది. లాక్‌డౌన్ బాధలతో సొంతూళ్లకు బయల్దేరిన వలస కూలీలకు ఆహారం, ఆశ్రయం, ప్రయాణ సదుపాయాల్లో సమస్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతున్నది. ఈ విచారణలో భాగంగానే గురువారం క్లిష్ట ప్రశ్నలను కేంద్ర సర్కారు ముందుంచింది. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికుల నుంచి ఒక్క రూపాయి కూడా చార్జీగా తీసుకోరాదని, రాష్ట్ర ప్రభుత్వాలే చార్జీలను భరించాలని ఆదేశించింది. అలాగే, ప్రయాణానికి ముందు రైల్వే స్టేషన్‌లో ఉన్నంతకాలం సదరు రాష్ట్ర ప్రభుత్వమే వలస శ్రామికులకు ఆహారం, నీరు అందించాలని తెలిపింది. సొంత రాష్ట్రం చేరే వరకూ అంటే శ్రామిక్ ట్రైన్‌లో ప్రయాణించినంత కాలం రైల్వే శాఖనే వారికి ఆహారం, నీరు అందించాలని రూలింగ్ ఇచ్చింది. అంతేకాదు, వలస వచ్చిన రాష్ట్రంలో చిక్కుకుపోయిన వర్కర్ల బాధ్యతను సదరు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని ఆహారం అందించాలని తెలిపింది.
వలస కూలీలను తరలించేందుకు బస్సులు, శ్రామిక్ ట్రైన్‌లను ఏర్పాటు చేసినా చార్జీల భారం, పేర్లు నమోదైనా ఎప్పుడు తమ వంతు వస్తుందో తెలియని గందరగోళం సహా పలు సవాళ్లతో వాళ్లు కాలి నడకనే నమ్ముకుంటున్నారు. ఎంతోమంది స్వగ్రామాన్ని చూడకుండా మార్గంమధ్యలోనే తనువు చాలిస్తున్నారు. ప్రమాదాల్లో కన్నుమూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే వారి సంక్షేమార్థం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్‌కే కౌల్, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యల్లో లోపాలను గుర్తించింది. సొంతూళ్లకు తరలించే ట్రైన్‌లు, బస్సుల సదుపాయాన్ని పొందేందుకు వలస కూలీలు చేసుకునే రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, ఆహారం, తాగు నీటి సరఫరాలాంటి అనేక కీలకాంశాల్లో ప్రభుత్వాలు సరైన తీరులో వ్యవహరించడం లేదని పేర్కొంది. ప్రభుత్వం ఏమీ చేయడం లేదని కాదు, కానీ వలస కూలీల సంఖ్య భారీగా ఉన్నందున పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందేనని టాప్ కోర్టు వివరించింది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ట్రైన్ లేదా బస్సులో ఎప్పుడు ప్రయాణిస్తామా? అని వలస కూలీలు ఎదురుచూడాల్సి వస్తున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వమే ఈ రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను పర్యవేక్షించాలని, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సమీప తేదీల్లోనే వారిని ట్రైన్ లేదా బస్సు ఎక్కించే బాధ్యతను రాష్ట్రాలు తీసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్‌లు, ప్రయాణ వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురించాలని తెలిపింది. వలస కార్మికుల సంఖ్య సహా వారి వివరాలన్నీ, వారిని తరలించే ప్రణాళికా సమాచారాన్ని ఆన్ రికార్డ్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు తగినన్ని ట్రైన్‌లను రైల్వే తప్పకుండా అందించాలని పేర్కొంది.
కొశ్చన్ వర్సెస్ ఆన్సర్…
సుప్రీంకోర్టు ప్రశ్నలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సమాధానాలిచ్చారు. వలస కూలీల ప్రయాణాలను ఎవరు భరిస్తున్నారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా వలస కూలీల చార్జీలను కొన్ని గమ్యస్థాన రాష్ట్రాలు, కొన్ని కూలీలను పంపిస్తున్న రాష్ట్రాలు భరిస్తున్నాయనీ, ఇంకొన్ని రాష్ట్రాలు రీయింబర్స్ పద్ధతినీ అనుసరిస్తున్నాయని మెహతా తెలిపారు. కాగా, శ్రామికులకు ఆహారం, తాగు నీటిని రైల్వే ఉచితంగా అందిస్తున్నదని, ఇండియన్ రైల్వేస్ ఇప్పటివరకూ 84 లక్షల మీల్స్ అందించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశ్రయాల్లో ఎంతమంది ఉన్నారు? వారిని ఎలా చూసుకుంటున్నారని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించగా, ప్రతి వలస కూలీకి ఐదు కిలలో బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో పప్పుధాన్యాలు అందిస్తున్నామని మెహతా తెలిపారు. వలస కూలీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే శాఖ సమన్వయంతో వలస కార్మికుల తరలింపు జరుగుతున్నదని వివరించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది కూలీలు రోడ్లపై నడుస్తూ కనిపిస్తున్నారని న్యాయస్థానం పేర్కొంటుండగా, రోడ్లపై నడుస్తున్నవారందరి కోసం బస్సు లేదా ఇతర వాహనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచనలున్నాయని మెహతా తెలిపారు. వాటికితోడు రోడ్లపై నడుస్తూ కనిపించిన వలస కూలీలందరికీ ఆశ్రయం కల్పించి ఆహారాన్ని అందించాలని, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు వేదికగా దుష్ప్రచారం : తుషార్ మెహతా
సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విపక్షాలు, ఇతర పిటిషనర్లపై ఆరోపణలను సంధించారు. సుప్రీంకోర్టు వేదికగా కొందరు దుష్ప్రచారాలకు పూనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని, పొట్టలో చల్ల కదలని ఈ మేధావులకు వారి కష్టం కనిపించదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న తర్వాతి రోజే కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా కోర్టులో వలస కూలీల కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఓ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.