పేరుకే పురపాలికలు..

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కొత్త పురపాలికలు పేరుకే మిగిలాయి. శాశ్వత సిబ్బంది నియామకం చేపట్టకపోవడం.. అంతా ఇన్‌చార్జిల పాలన కావడం.. ప్రభుత్వం సకాలంలో విడుదల కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి.. అక్కడే అన్న చందంగా పేరుకే పురపాలికలు తప్ప.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 కొత్త పురపాలికలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడి పాలనంతా గ్రామపంచాయతీల తీరును తలపిస్తోంది. ఉమ్మడి నల్లగొండలో పరిస్థితి ఇదీ.. రాష్ట్ర […]

Update: 2020-12-02 00:24 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన కొత్త పురపాలికలు పేరుకే మిగిలాయి. శాశ్వత సిబ్బంది నియామకం చేపట్టకపోవడం.. అంతా ఇన్‌చార్జిల పాలన కావడం.. ప్రభుత్వం సకాలంలో విడుదల కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి.. అక్కడే అన్న చందంగా పేరుకే పురపాలికలు తప్ప.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 కొత్త పురపాలికలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడి పాలనంతా గ్రామపంచాయతీల తీరును తలపిస్తోంది.

ఉమ్మడి నల్లగొండలో పరిస్థితి ఇదీ..

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గ్రామపంచాయతీలకు సమీప గ్రామాలు కలిపి రెండున్నరేండ్ల క్రితం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హాలియా, నందికొండ (నాగార్జునసాగర్), చండూరు, చిట్యాల, చౌటుప్పల్, నేరెడుచర్ల, తిరుమలగిరి, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరు కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ గ్రామపంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా హోదా పొందాయే తప్ప.. ఎందులోనూ మున్సిపాలిటీ తరహాలో సేవలందడం లేదు. అధిక శాతం మున్సిపాలిటీల్లో గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో పని చేసిన సిబ్బందితో, ఇంఛార్జి అధికారులతో నేటికి నెట్టుకొస్తున్నారు. మున్సిపాలిటీల్లో కీలకంగా ఉండే అధికారులు లేకపోవడంతో మున్సిపాలిటీ వాసులకు సకాలంలో సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పురపాలికల్లో సిబ్బందికి సరిపడా వసతుల్లేక.. ఇరుకు గదులతోనే నెట్టుకొస్తుండడం గమనార్హం.

మున్సిపాలిటీలకు కేటాయించిన రూ.కోట్లు ఎక్కడ పాయె..

ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం సెప్టెంబరు నెలలో రూ. కోట్లు కేటాయించింది. కానీ ఆ నిధులు కొత్త మున్సిపాలిటీలకు ఏ మూలకు సరిపోవడం లేదు. అసలు ఆ నిధులతో ఏం పనులు చేశారనే వాస్తవం ఎవరికీ తెలియదు. ఇటీవల ప్రభుత్వం హాలియా మున్సిపాలిటీకి రూ.2.57 కోట్లు, చిట్యాలకు రూ.1.75 కోట్లు, నందికొండకు రూ.24 లక్షలు, చండూరు మున్సిపాలిటీకి రూ.23 లక్షలు కేటాయించింది. ఇక యాదాద్రి జిల్లా విషయానికొస్తే.. మోత్కూరు మున్సిపాలిటీకి రూ.3.48 కోట్లు, చౌటుప్పల్‌కు రూ.2.16 కోట్లు, యాదగిరిగుట్టకు రూ.90 లక్షలు, పోచంపల్లికి రూ.1.60 కోట్లు, ఆలేరు మున్సిపాలిటీకి రూ.30 లక్షలు కేటాయించారు. సూర్యాపేట జిల్లా విషయానికొస్తే.. హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి రూ.4.28 కోట్లు, నేరేడుచర్లకు రూ.2.20 కోట్లు, తిరుమలగిరి పురపాలికకు రూ.30 లక్షలు వెచ్చించారు. కానీ ఆ నిధులకు సంబంధించి కొత్త మున్సిపాలిటీల్లో ఇంతవరకు అభివృద్ది పనులు కార్యరూపం దాల్చలేదు.

కొత్త మున్సిపాలిటీల వారీగా ఖాళీల వివరాలు..

– ఆలేరు మున్సిపాలిటీలో కమిషనర్, జూనియర్ అసిస్టెంట్ మినహా మిగతా సిబ్బంది అంతా ఇన్‌చార్జులే.
– యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, జూనియర్ అసిస్టెంట్లు మినహా మిగతావారంతా ఇన్‌ఛార్జులు కావడం గమనార్హం.
– భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో మేనేజరుతో పాటు ఒక జూనియర్ అసిస్టెంట్, టీపీఎస్, అకౌంటెంట్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. మిగిలిన అధికారులుగా ఇంఛార్జులుగా కొనసాగుతున్నారు.
– చౌటుప్పల్ మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, ఆర్ఐ, ఒక జూనియర్ అసిస్టెంట్ తప్ప మిగతావారు ఇన్‌చార్జులు.
– చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్, ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. మిగతా వారికి ఇన్‌చార్జులు.
– చండూరు మున్సిపాలిటీలో ఒక్క మేనేజరు తప్ప మిగతా వారంతా ఇన్‌చార్జులే.
– హాలియా మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉండగా, మిగతా సిబ్బంది అంతా ఇంఛార్జులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
– ఇక నందికొండ మున్సిపాలిటీ విషయానికొస్తే.. కమిషనర్, మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మినహా మిగతా అధికారులంతా ఇన్‌చార్జులే.
-నేరేడుచర్ల మున్సిపాలిటీలో మేనేజర్ తప్ప మినహా అందరూ ఇంఛార్జులుగా కొనసాగుతున్నారు.
– ఇక తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలో అందరూ ఇంఛార్జులు కావడం గమనార్హం.
– వాస్తవంగా ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్, మేనేజర్, ఇద్దరు ఏఈలు, సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐ, టీపీఎస్, టీపీబీవో, టీపీవో, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అకౌంటెంట్ వంటి కీలక టెస్టులు ఉండాలి. కానీ ప్రభుత్వం రెండేండ్లు పూర్తయినా.. నేటికీ పదవులను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది.

Tags:    

Similar News