తెలంగాణలో ఈరోజు కరోనా కొత్త కేసులు లేవు

దిశ, న్యూస్ బ్యూరో: ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘లాక్ డౌన్’, రాత్రి కర్ఫ్యూ ప్రశాంతంగా అమలవుతోంది. ప్రజలు రోడ్డెక్కడం తగ్గిపోయింది. పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మంత్రులు రోడ్డెక్కారు. వారివారి జిల్లాల్లో పర్యటిస్తూ అవగాహన కలిగిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టారు. మంత్రులు శ్రీనివాసగౌడ్, కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులంతా వీధుల్లో తిరిగి […]

Update: 2020-03-25 09:19 GMT

దిశ, న్యూస్ బ్యూరో: ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘లాక్ డౌన్’, రాత్రి కర్ఫ్యూ ప్రశాంతంగా అమలవుతోంది. ప్రజలు రోడ్డెక్కడం తగ్గిపోయింది. పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు మంత్రులు రోడ్డెక్కారు. వారివారి జిల్లాల్లో పర్యటిస్తూ అవగాహన కలిగిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సౌకర్యాలపై దృష్టి పెట్టారు. మంత్రులు శ్రీనివాసగౌడ్, కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులంతా వీధుల్లో తిరిగి పరిస్థితిని సమీక్షించారు. సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చింది. దేశం మొత్తంమీద పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా తెలంగాణలో మాత్రం ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదు. బుధవారం సాయంత్రం నాటికి దేశం మొత్తం మీద 606 పాజిటివ్ కేసులున్నాయని, ఇ,దులో 42 మందికి నయమై నెగెటివ్ రిపోర్టు రాగా, మరో 553 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో బుధవారం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో వైద్యారోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాజిటివ్ మహిళా పేషెంట్ చనిపోయినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడంతో పాటు ఎంపీలాడ్స్ నుంచి తలా కోటి రూపాయల చొప్పున మొత్తం రూ. 16 కోట్లను విరాళంగా ప్రకటించారు. వివిధ పనుల రీత్యా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడినవారు, విద్యార్థులు స్వస్థలాలకు వెళ్ళడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ ‘వన్ టైమ్’ పాస్‌లను జారీ చేస్తోంది. రాష్ట్ర సరిహద్దు దాటేంత వరకు ఈ పాస్ చెల్లుబాటవుతుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, అత్యవసర సేవల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, నిత్యావసర వస్తువులను విక్రయించే వ్యాపారులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వివిధ వ్యాపారవర్గాల ప్రతినిధులతో నాలుగు గంటల సమావేశంలో చర్చించి పరిష్కార మార్గాలను కనుగొన్నట్లు నగర పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారి గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ కొన్ని విభాగాల సిబ్బందికి పోలీసు శాఖ తరఫున ప్రత్యేక ‘కోవిడ్’ పాసులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక కారణాలతో పాస్‌లు అవసరమైనవారు పోలీసు శాఖను (3430616780) సంప్రదించవచ్చని లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చునని వివరించారు. విద్యార్థులకు, ప్రైవేటు బ్యాచ్‌లర్ ఉద్యోగుల (మహిళలు కూకడా)కు హాస్టళ్ళను మూసివేసినందువల్ల స్వస్థలాలకు వెళ్ళడానికి ‘వన్ టైమ్’ పాస్‌లను మంజూరు చేయడానికి ఆయా పోలీసు స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సీపీలకు అధికారం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వరకూ ఇది చెల్లుబాటవుతుందని పేర్కొన్నారు.

రోడ్డెక్కిన మంత్రులు

మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ నుంచి బుద్ధభవన్ వెళ్తున్న మార్గంలో నడిచివెళ్తూ ఉన్నవారిని పలుకరించారు. తుంగతుర్తికి చెందిన కూలీ కార్మికులు స్వస్థలం వెళ్ళడానికి తగిన అనుమతులు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించి ఉప్పల్ వరకు వాహనాన్ని సమకూర్చారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేనందున స్వస్థలం వెళ్ళడానికి తగిన ప్రత్యామ్నాయం కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అదే సమయంలో విద్యార్థులను బలవంతంగా ఇళ్ళకు పంపేలా లేదా హాస్టళ్ళను మూసివేసేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, అవి యధావిధిగా పనిచేయడానికి వీలుగా ఏర్పాట్లు ఉంటాయని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్లు, నగర మేయర్ తదితరులు ఈ విషయంలో చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం కనుగొంటారని, విద్యార్థులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన కొద్దిమందికి నైట్ షెల్టర్‌లో ఆశ్రయం కల్పించాల్సిందిగా ఆదేశించారు. గోల్నాకలోని నైట్ షెల్టర్‌ను పరిశీలించి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో పారిశుద్య అంశంపై దృష్టి పెట్టి పలు ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్ల దగ్గర జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా జరుగుతున్న క్రిమిసంహారక మందుల స్ప్రే పనులను పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాసగౌడ్ లాఠీ పట్టారు. పనులు లేకపోయినా రోడ్లమీదకు వచ్చే యువకులను వారించారు. కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా తెరిచివున్న దుకాణాలను మూయించారు. వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి తదితర మంత్రులు కూడా వారివారి జిల్లాల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు.

నిత్యావసర వస్తువులకు కొరత రానివ్వం

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా కరీంనగర్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడంపై సంతోషం వ్యక్తం చేసి రోడ్డుమీదకు అవసరం లేకున్నా సరదాకోసం వచ్చే యువకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్ముతున్న వ్యాపారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల దగ్గర రద్దీ లేకుండా స్థానిక పోలీసులు చొరవ తీసుకోవాలని సూచించారు. నగరాల్లో రైతు బజార్లను యాక్టివ్ చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివారులోని ఒక సూపర్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు నిత్యావసరాలను అమ్ముతుంతగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పరిశీలించి నోటీసు జారీ చేశారు. దుకాణాన్ని మూసివేశారు.

tags : Telangana, LockDown, No new Cases, Corona, Ministers, One Time Passes

Tags:    

Similar News