కరోనా వ్యాక్సిన్‌పై తలో మాట..!
దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఆత్రుతతో ఎదురు చూస్తోంది. చల్లని కబురు కోసం జనమంతా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిశోధనలపైనే దృష్టి పెట్టారు. శాస్ర్తవేత్త ల ప్రకటన కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు తొలి వ్యాక్సిన్ తమవేనని పేర్కొంటున్నాయి. రష్యా ఇప్పటికే ప్రకటించుకుంది. తొలి వ్యాక్సిన్ భారత్ నుంచే వస్తుందంటూ బిల్ గేట్స్ సహా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయి, […]
దిశ, న్యూస్ బ్యూరో:
కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఆత్రుతతో ఎదురు చూస్తోంది. చల్లని కబురు కోసం జనమంతా ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిశోధనలపైనే దృష్టి పెట్టారు. శాస్ర్తవేత్త ల ప్రకటన కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు తొలి వ్యాక్సిన్ తమవేనని పేర్కొంటున్నాయి. రష్యా ఇప్పటికే ప్రకటించుకుంది. తొలి వ్యాక్సిన్ భారత్ నుంచే వస్తుందంటూ బిల్ గేట్స్ సహా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనాకు భయం తప్పుతుందా? అన్ని దేశాలు ఆరు నెలలుగా వైరస్‌తో ఇబ్బంది పడుతున్నాయి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను కనుగొనడంపై పరిశోధనా సంస్థలు, ఫార్మా కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 173 సంస్థలు ఈ పరిశోధనల్లో నిమగ్నమైనట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అందులో 142 ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంటే, మరో 31 వివిధ దశల్లో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా పరిశోధనలు ముందంజలో ఉన్నాయని, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని మూడో దశకు చేరుకున్నాయని సమాచారం.
రష్యా వ్యాక్సిన్‌పై వ్యతిరేకత..
స్పుత్నిక్-వి పేరుతో రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌పై అనేక దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకపోవడం, వ్యాక్సిన్ వినియోగం ఎంత వరకు సురక్షితమో చెప్పకపోవడంపై అభ్యంతరాలున్నాయి. అమెరికా సహా చాలా దేశాలు రష్యా వ్యాక్సిన్‌ను ఉపయోగించబోమని తేల్చిచెప్పాయి. రెండు దశల క్లినికల్ ప్రయోగాల్లో వచ్చిన ఫలితాల ను డబ్ల్యూహెచ్‌వోకు త్వరలో అందజేస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ప్రతినిధి కిరిల్ డిమిత్రివ్ తెలిపారు. ఈ నెల చివరికల్లా అకడమిక్ జర్నల్‌లో డాటాను కూడా ప్రచురిస్తామన్నారు. మూడో దశ ప్రయోగాలు 40 వేల మందిపై జరుగుతున్నాయని, త్వరలోనే ఒక బిలియన్ డోస్‌లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
మూడో దశలో ముందున్న ఆస్ట్రాజెనికా..
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా ఉమ్మడిగా తయారుచేయనున్న వ్యాక్సిన్ మూడో దశకు చేరుకుంది. రెండు దశల ఫలితాలు బాగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థతో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరి వరకు ఏజెడ్‌టీ-1222 పేరుతో టీకాను విడుదల చేస్తామని, ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలే వచ్చాయని, టీ-సెల్స్ ఉత్పత్తి మెరుగ్గా జరుగుతున్నట్లు తేలిందని ఆక్స్‌ఫర్డ్ సంస్థ పేర్కొంది.
చైనాకు చెందిన సినోవాక్, వూహాన్ బయోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొడక్ట్స్-సినోఫామ్, బీజింగ్ బయోలాజికల్ ఇన్‌స్టిట్యూట్, అమెరికాకు చెందిన మోడెర్నా-ఎన్ఐఏఐడీ, ఫైజర్-ఫోసన్ ఫార్మా-బయో ఎన్ టెక్ సంస్థలు కూడా మూడో దశలో ఉన్నాయి. ఆరు సంస్థలు మూడో దశ ప్రయోగాలు చేస్తుండగా, 19 సంస్థల ప్రయోగాలు రెండో దశలో ఉన్నాయి. ఐదు సంస్థల ప్రయోగాలు రెండో దశలోని సెకండ్ డోస్ స్టేజీలో ఉన్నాయి. అమెరికాకు చెందిన మోడెర్నా కూడా త్వరలో మూడో దశ ట్రయల్స్ పూర్తిచేసుకుని, ఏడాదికి సుమారు 50 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
భారత్ బయోటెక్‌పైనే ఆశలెక్కువ..
కరోనా వ్యాక్సిన్ భారత్ నుంచి వెలువడడానికి ఎక్కువ అవకాశాలున్నాయని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రపంచం వినియోగంలో ఉన్న సుమారు 70% వ్యాక్సిన్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఉత్పత్తి అయినవేనని గుర్తు చేశారు. భారత్ బయోటెక్ నుంచే తొలి వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరు వరకు వినియోగంలోకి వస్తుందని కేంద్ర వైద్య మం త్రి హర్షవర్ధన్ రెండు రోజుల కిందట మీడియా సమావేశంలో చెప్పారు. కోవాగ్జిన్ పేరుతో దీనిని వీలైనంత తొందరగా అందుబాటులోకి వచ్చేలా కేంద్రం నిబంధనల్లో మార్పులు కూడా చేసింది. వ్యాక్సిన్ కండరాలకు (ఇంట్రా మస్కులర్) ఇవ్వడానికి బదులుగా చర్మం కింది పొరకు (ఇంట్రా డెర్మల్ రూట్) పద్ధతిలో ఇవ్వడానికి ప్యానెల్ అంగీకరించింది. దీంతో తక్కువ మోతాదులోనే, తక్కువ ధరకు ఇవ్వడానికి సాధ్యమవుతుంది.
వ్యాక్సిన్‌తోనే రక్షణ..
ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. సమర్థవంతమైన వ్యాక్సిన్ వల్లనే కరోనా వైరస్ నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లభిస్తుంది. వైరస్ సోకినా జబ్బుకు గురికారు. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కోసారి దశాబ్దాలు కూడా పట్టొచ్చు. కరోనా విషయంలో మాత్రం చాలా సంస్థలు పరిశోధనలు ముమ్మరం చేశాయి. ప్రభుత్వాలు కూడా నిబంధనల్లో మార్పులు చేశాయి. అందుకే నెలల్లోనే వ్యాక్సిన్ రావచ్చంటూ శాస్త్రవేత్తలు ఆశతో ఉన్నా రు. – డాక్టర్ ఆకుల సంజయ్‌రెడ్డి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు
ఏడాదిన్నర వరకు కష్టమే..
ఏ సంస్థ కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోలేదు. తొందరగా వ్యాక్సిన్ తెస్తాయనుకునే సంస్థలన్నీ మూడో దశ ట్రయల్స్ లోనే ఉన్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం, అది రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని బూస్ట్ చేయడంపైనే స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే వచ్చే ఏడాది చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రావచ్చు. ప్రతీ డోస్‌కు మధ్య 21 రోజుల వ్యవధి, దాని ఫలితాలను అధ్యయనం చేయడానికి మూడు నెలల సమయం అవసరం. వ్యాక్సిన్ వస్తే కరోనాను జయించినట్లేననే అభిప్రాయంతో స్వీయ జాగ్రత్తలు తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా రు. అతి విశ్వాసంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ మైండ్‌సెట్ నుంచి బయటపడాలి.
– డాక్టర్ నర్సింగ్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్