ఈటల దారెటు? హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తప్పదా?
దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి తప్పించిన కేసీఆర్ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి కూడా తొలగించారు. గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో కలెక్టర్ నుంచి నివేదిక అందిన గంటల వ్యవధిలోనే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో భవిష్యత్తులో పార్టీ నుంచి కూడా బహిష్కరణ తప్పదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పదవీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే పెద్దవి కావని వ్యాఖ్యానించిన ఈటల […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి తప్పించిన కేసీఆర్ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి కూడా తొలగించారు. గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో కలెక్టర్ నుంచి నివేదిక అందిన గంటల వ్యవధిలోనే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో భవిష్యత్తులో పార్టీ నుంచి కూడా బహిష్కరణ తప్పదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఏ పదవీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే పెద్దవి కావని వ్యాఖ్యానించిన ఈటల రాజేందర్ తాజా పరిణామాలతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారా? ఆ పార్టీ బీ-ఫారం మీద ఎమ్మెల్యేగా గెలిచినందున శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారా? హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక తప్పదా? ఆయన భవిష్యత్తు ప్లాన్ ఏమిటి? ఇలాంటి ఊహాగానాలే ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా వినిపిస్తున్నాయి.
గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇకపైన టీఆర్ఎస్‌లో ఆయన కొనసాగ గలుగుతారా? ఒకవేళ కొనసాగడానికి సిద్ధపడినా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సానుకూలంగా ఉంటారా? పార్టీయే ఆయనను సాగనంపుతుందా? లేక ఆయనే స్వచ్ఛందంగా పార్టీ నుంచి వెళ్ళిపోతారా? ఈ రెండింటిలో ఏది జరిగినా నైతికంగా, లీగల్‌గా ఆయన ఎమ్మెల్యేగా ఎంతకాలం కొనసాగగలుగుతారు? ఎమ్మెల్యే బాధ్యతలకు కూడా రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడితే తదుపరి జరిగే ఉప ఎన్నికల్లో ఆయన వైఖరి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మరోవైపు దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్న ఈటల ఇప్పుడు బైటకు వెళ్ళిపోతే కొంతకాలం సైలెంట్‌గా ఉంటారా? ఇతర పార్టీల్లో చేరుతారా? లేక స్వంతంగా పార్టీ పెట్టుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. వెనకబడిన కులాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం, దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించడం ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయినా స్వంత పార్టీ నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా ఆయనకు అండగా నిలవలేదు. సానుభూతి ప్రకటించలేదు. దీంతో ఆయన పార్టీలో ఒంటరి అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన వస్తే ఏ మేరకు మద్దతు లభిస్తుంది, ప్రజలు ఎలాంటి ఆదరణ చూపుతారు అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది.
తెలంగాణలో గతంలో దేవేందర్ గౌడ్, అంతకుముందు ఆలె నరేంద్ర, విజయశాంతి.. ఇలా చాలా మంది కొత్త పార్టీలు పెట్టారు. కానీ అవేవీ మనుగడలో లేవు. చిరంజీవి సైతం ప్రజారాజ్యం లాంటి పార్టీ పెట్టినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది. చివరకు దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయక తప్పలేదు. ఇలాంటి అనేక అనుభవాలతో కొత్త పార్టీ పెట్టడం, దాన్ని నడిపించడం, ఆర్థిక వనరులను సమీకరించడం, ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే స్థాయిలో నిర్మాణం చేయడం సవాళ్ళతో కూడుకున్నదనేది ఈటల రాజేందర్‌కు తెలియందేమీ కాదు. ఇలాంటి ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈటల ఇకపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు ఏ వైఖరి తీసుకోవాలన్నా ఈటలకు ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా మారింది. ఎలాగూ మంత్రి బాధ్యతల నుంచి, మంత్రివర్గం నుంచి తప్పించిన తదనంతరం పార్టీ నుంచి తొలగించడం ఖాయమని ఈటల అనుచరులు బలంగా అనుమానిస్తున్నారు. భవిష్యత్తు ప్లాన్ గురించి నిర్ణయం తీసుకునే ముందు హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, అనుచరులతో రెండు రోజులుగా చర్చిస్తూ ఉన్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయనే. ఇప్పటిదాకా మంత్రివర్గం నుంచి తప్పుకోకుండా బహిష్కరించేంత వరకు ఓపిగ్గా ఉన్నారు. సానుభూతిగా మల్చుకునే ప్రయత్నం చేశారు. ఇకపైన కూడా స్వచ్చందంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీయే తప్పించేంత వరకు వేచి చూస్తారా అనే అనుమానాలూ లేకపోలేదు.
ఇప్పటికే బీజేపీ నేతలు ఈటలతో సంబంధాల్లో ఉన్నారని, టీఆర్ఎస్‌లోని కొద్దిమంది అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇవేవీ రూఢీ కాలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూసిన తర్వాత, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరే ఆలోచన చేస్తారా? ఇప్పటికే వివిధ పార్టీల నుంచి చేరినవారికి ఏ మేరకు గౌరవం, గుర్తింపు ఉందో ఆయన చూస్తూనే ఉన్నందున ఇప్పటికిప్పుడు చేరాలనే నిర్ణయం తీసుకుంటారా అనేది అనుమానమే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితీ అదే తీరులో ఉంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షమే లేని ప్రస్తుత తరుణంలో కొత్త పార్టీ పెట్టే సాహసం చేస్తారా అనేది కూడా అనుమానమే. కొంతకాలం సైలెంట్‌గా ఉండిపోవడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చే అవకాశం లేకపోలేదు.