హే అల్లా.. మాకే ఎందుకు ఈ శిక్ష
దిశ, సంగారెడ్డి : అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ముందుండే 108 వాహనం.. అల్లాదుర్గం, వట్‌పల్లి, రేగోడు మండలాల్లో తన సేవలు అందించలేకపోతోంది. ఈ మూడు మండలాలకు సేవలందించేందుకు అల్లాదుర్గంలో అందుబాటులో ఉండే అంబులెన్స్ పెద్దశంకరంపేటకు తరలించడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో బాధితులు ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకుంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. నెల క్రితం పెద్దశంకరంపేట మండలంలోని 108 వాహనం చెడిపోవడంతో […]
దిశ, సంగారెడ్డి : అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ముందుండే 108 వాహనం.. అల్లాదుర్గం, వట్‌పల్లి, రేగోడు మండలాల్లో తన సేవలు అందించలేకపోతోంది. ఈ మూడు మండలాలకు సేవలందించేందుకు అల్లాదుర్గంలో అందుబాటులో ఉండే అంబులెన్స్ పెద్దశంకరంపేటకు తరలించడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో బాధితులు ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకుంటే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. నెల క్రితం పెద్దశంకరంపేట మండలంలోని 108 వాహనం చెడిపోవడంతో అల్లాదుర్గం లోని 108 వాహనాన్ని అక్కడికి తరలించారు. మండలంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను ఆస్పత్రికి తరలించడానికి వారి బంధువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 108 రాకపోవటంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. మండలంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే ప్రైవేటు వాహనాల్లో తరలించాల్సిందే. అల్లాదుర్గంలో 108 ఉంటే సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలానికి సైతం సేవలందించేది, ఇప్పుడు రెండు మండలాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ విషయమై వైద్యాధికారికి ప్రజలు పలుమార్లు విన్నవించారు. స్థానిక ఆస్పత్రిలో కాన్పులు ఎక్కువగా జరుగుతుండడంతో గర్భిణులను తరలించడానికి అంబులెన్స్ తప్పనిసరైంది. 108 వాహనాన్ని తిరిగి పంపించాలని కోరుతున్నారు. రేగోడ్ మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన 108 వాహనాన్ని ఐదేండ్ల క్రితం తాత్కాలికంగా పెద్దశంకరంపేటకు తరలించారు. ఆ తరువాత తిరిగి వెనక్కి పంపలేదు. ఇప్పుడు అల్లాదుర్గం 108ను సైతం అక్కడికే పంపడంతో దీనిని సైతం అక్కడే ఉంచేస్తారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.