చీకట్లోనే కార్మిక కుటుంబాలు

దిశ, కోరుట్ల: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలో పని చేసిన ఉద్యోగుల కుటుంబాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. యాజమాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో 30 కుటుంబాలు ఫ్యాక్టరీ ఆవరణలోని క్వార్టర్స్‌లో ఉంటూ బయట కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిని కూడా బయటకు పంపడానికి కంపెనీ యాజమాన్యం విద్యుత్, నీటి సరఫరాను నిలిపి వేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులు, […]

Update: 2020-11-04 01:42 GMT

దిశ, కోరుట్ల: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలో పని చేసిన ఉద్యోగుల కుటుంబాలు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. యాజమాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో 30 కుటుంబాలు ఫ్యాక్టరీ ఆవరణలోని క్వార్టర్స్‌లో ఉంటూ బయట కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిని కూడా బయటకు పంపడానికి కంపెనీ యాజమాన్యం విద్యుత్, నీటి సరఫరాను నిలిపి వేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను వేసుకున్న పట్టించుకునే వారు లేరని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటీకరణతో..

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 2002లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు బోధన్, మంజోజిపల్లి (మెదక్) యూనిట్లను ప్రైవేటీకరించారు. అప్పటి నుంచి రైతులు, కార్మిక సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ‌లను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 2015 డిసెంబర్ 23న ఎన్‌డీఎస్‌ఎల్‌ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి, మూడు ఫ్యాక్టరీలను మూసివేసింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. లే ఆఫ్ చట్టవ్యతిరేకమైన చర్య అని యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ కార్మికులు, చెరుకు రైతులు ఉద్యమం చేపట్టారు. దీంతో 2016లో కార్మిక సంఘాలు, ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చర్చలు జరిపి కార్మికులకు పూర్తి వేతనం ఇస్తామని అయితే వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి ఈ అవకాశం ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇందుకు కార్మికులు సమ్మతించకుండా ఫ్యాక్టరీ నడిపించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేయడంతో చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2017 ఆగస్టులో ప్రభుత్వం లేబర్ కోర్ట్‌ను ఆశ్రయించింది.

ఎన్‌సీఎల్‌టీ ప్రవేశంతో ఉద్యోగుల ఆశలపై నీళ్లు..

దక్కన్ షుగర్ లిమిటెడ్ కంపెనీకి అప్పులు ఇచ్చిన నాలుగు బ్యాంకులు కలిసి ఎన్‌సీ‌ఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ను ఆశ్రయించాయి. దీంతో ఎన్‌సీ‌ఎల్‌టీ హైదరాబాద్ బెంచ్ ఈ ట్రిబ్యునల్‌కు ఐపీఆర్ (ఇంటర్మీ రిసొల్యూషన్ ప్రోఫిషనల్)గా రాచర్ల రామకృష్ణ గుప్తాను నియమించింది. 2019 జూన్ 3న ఎన్‌డీ‌ఎస్‌ఎల్ లిక్విడేషన్‌కు ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించి స్టే తెచ్చింది. అప్పటి నుంచి ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం హాజరు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

రోడ్డున పడిన కార్మికులు..

షుగర్ కంపెనీ లే ఆఫ్ ప్రకటించగానే ముత్యంపేట్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు వీఆర్‌ఎస్‌కు ఒప్పుకోలేదు. మరోవైపు 30 కుటుంబాలు తమకు ఇంకా యాజమాన్యం బకాయిలు చెల్లించలేదని ముత్యంపేట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ట్రిబ్యునల్ తీర్పు వెలువడిన తరువాత బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం పేర్కొంది. దీంతో బకాయిలు చెల్లించే వరకు క్వార్టర్స్ ఖాళీ చేసేది లేదని కార్మికులు తెగేసి చెప్పారు. అయితే యజమాన్యం మాత్రం క్వార్టర్స్ ఖాళీ చేయాలని చెప్పకుండా విద్యుత్, నీటి సరఫరా నిలిపి వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎన్‌సీ‌ఎల్‌టీ విచారణ నిలిపి వేసి ప్రభుత్వం ముందుకు వస్తేనే కార్మికుల జీవితాలు గాడిన పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News