భయం గుప్పిట్లో పెద్దాపూర్ గురుకులం..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలో గల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో

Update: 2024-12-20 01:47 GMT

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలో గల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. నాలుగు నెలల కింద ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మరవకముందే తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ విద్యార్థిని గుర్తుతెలియని కీటకం కాటేసినట్లు గుర్తించిన వైద్యులు సకాలంలో చికిత్స అందించారు. ఇద్దరు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడగా అసలు పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతుందన్న ప్రశ్న తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తోంది.

పాఠశాలను 4 నెలల కిందట డిప్యూటీ సీఎం సందర్శన..

నాలుగు నెలల కింద ఇద్దరు విద్యార్థుల మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఘటన మరువకముందే తాజాగా అదే పాఠశాలలో మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఓ విద్యార్థి అస్వస్థతకు గురవగా కోరుట్లలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గుర్తుతెలియని కీటకం కాటు వేసినట్లు గా గుర్తించిన వైద్యులు సకాలంలో ట్రీట్మెంట్ చేయడంతో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 24 గంటలు గడవకముందే అదే పాఠశాలలో మరో విద్యార్థి గురువారం ఉదయం అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాస్తవానికి విద్యార్థుల రక్షణకు పాఠశాల సిబ్బందితో పాటు జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ముందు నుంచే పాఠశాల ఆవరణలో విష సర్పాలు, కీటకాలు సంచరిస్తుండడమే ఈ ఘటనలకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది.

విష సర్పాలకు ఆవాసాలుగా పరిసరాలు..

పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఆవరణ విష సర్పాలకు నిలయంగా మారింది. గతంలో విద్యార్థులు పాముకాటుతో మృతి చెందడంతో పాఠశాల ఆవరణను శుభ్రం చేయడంతో పాటు పాముల పుట్ట ను తొలగించారు. గుంతలను పూడ్చివేసి చర్యలు చేపట్టారు. తాజా ఘటన నేపథ్యంలో పాఠశాల ఆవరణలో విష సర్పాలు సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణం ఉండడంతోపాటు చెత్తాచెదారం, చెట్లు ఉండటం కారణంగానే పాములు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల చుట్టూ చెత్తాచెదారం తొలగించి శానిటేషన్ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాలను సందర్శించిన కలెక్టర్..

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యప్రసాద్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు విష సర్పాలు ఉన్నట్లయితే ఎక్స్ ఫర్ట్స్‌ను పిలిపించి పాములు పట్టించాలని అధికారులకు సూచించారు. అనుకోని సంఘటనల నేపథ్యంలో పాముకాటుకు గురైనప్పుడు చేపట్టే ప్రథమ చికిత్సల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థుల గదులను పరిశీలించిన కలెక్టర్ కిటికీలు ఇతర చోట్ల ఉన్న ఖాళీలను మూసివేయాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు భయందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు భరోసా ఇచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా లీవ్‌లో వెళ్లిన ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

మరో విద్యార్థికి అస్వస్థత.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థులు పాముకాటుకు గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలు మరవక ముందే అదే పాఠశాలలో బుధవారం మరో 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ఆస్పత్రిలో ఉన్న విద్యార్థి అఖిల్ ఆరోగ్యంపై ఆరా తీసి ఎలాంటి అపాయం లేదని తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం అది పాము కాటేనని ఆరోపించారు. కాగా తాజాగా గురువారం ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్ధి బోడ యశ్వంత్ అస్వస్థతకు గురికావడంతో అలర్ట్ అయినా పాఠశాల సిబ్బంది కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశ్వంత్ ఆరోగ్యం నిలకడగా ఉండగా చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. తాజాగా గురువారం అస్వస్థతకు గురైన విద్యార్థి యశ్వంత్ పాము కాటుకు గురయ్యాడా లేదా ఏదైనా విష కీటకమా? మరేదైనా జరిగిందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News