కొవిడ్ తర్వాత కొత్త రోగాలు.. ఆందోళనలో వైద్యులు

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్​నుంచి కోలుకున్నామనే సంతోషాన్ని మరువకముందే చాలా మందిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి కరోనా ఆసుపత్రుల్లో 1800 మంది పేషెంట్లు చికిత్స పొందుతుండగా, వీరిలో 40 శాతం మంది పోస్టు కొవిడ్​ రోగులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. వీరిలో ఆక్సిజన్​బెడ్లపై 700 మంది, ఐసీయూలో​750, జనరల్​వార్డులో 400 మంది చికిత్స పొందుతున్నారు. కొందరికి 3 నెలల నుంచి మరి కొందరిలో ఏకంగా 6 నెలల వరకు పోస్టు […]

Update: 2021-10-11 18:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్​నుంచి కోలుకున్నామనే సంతోషాన్ని మరువకముందే చాలా మందిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి కరోనా ఆసుపత్రుల్లో 1800 మంది పేషెంట్లు చికిత్స పొందుతుండగా, వీరిలో 40 శాతం మంది పోస్టు కొవిడ్​ రోగులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. వీరిలో ఆక్సిజన్​బెడ్లపై 700 మంది, ఐసీయూలో​750, జనరల్​వార్డులో 400 మంది చికిత్స పొందుతున్నారు. కొందరికి 3 నెలల నుంచి మరి కొందరిలో ఏకంగా 6 నెలల వరకు పోస్టు కొవిడ్​సమస్యలు వేధిస్తూనే ఉన్నాయని స్వయంగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే చేరినోళ్లంతా ఆసుపత్రులకు ఆలస్యంగా వచ్చిన వారేనని, దీంతో కొందరు విషమ స్థాయి పరిస్థితుల్లోకి కూడా వెళ్లినట్టు ఆరోగ్యశాఖ వివరించింది.

80 మందికి అలసత్వమే..

హాస్పిటల్స్‌లో చేరే ప్రతీ 100 మందిలో 80 మందికి కండరాల బలహీనతతో అలసత్వం, నీరసం, వంటి సమస్యలు వస్తుండగా, 20 శాతం మందిలో జ్ఞాపక శక్తి నశించడం, డయేరియా, ఒళ్లు నొప్పులు వంటివి వేధిస్తున్నట్లు గాంధీ, ఉస్మానియా వైద్యులు పరిశీలనలో తేలింది. ప్రస్తుతం ప్రతీ రోజు ఇలాంటి సమస్యలతో గాంధీకి సుమారు 100 నుంచి 120 మంది బాధితులు వస్తుండగా, ఉస్మానియాకు సుమారు 150 మంది పోస్ట్​ కొవిడ్​ సమస్యలతో వస్తున్నట్టు అక్కడి డాక్టర్లు తెలిపారు. అంతేగాక ఇటీవల కాలంలో జుట్టు ఊడిపోతుందని ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉన్నది.

మితీమిరిన పనులతోనే…

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మానసిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు యోగ, వ్యాయామం వంటివి చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలా మంది వ్యాయామం, యోగాలను అతిగా చేయడం వలన కూడా కండరాల బలహీనతతో అలసిపోతున్నారు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు వివరిస్తున్నారు. అంతేగాక కొందరు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతీ రోజు ఒకే సారి ఐదారు గుడ్లు తింటున్నారని, ఇదీ మంచిది కాదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిలోనే డయేరియా, కడుపునొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు. మరి కొందరిలో ఎండోథెలియల్​కణాలు దెబ్బతిని శ్వాస సమస్యలు, ఆయాసం వంటి ప్రాబ్లామ్స్​ కూడా వస్తున్నాయి.

అత్యధిక స్టెరాయిడ్స్​ ప్రమాదమే…

కరోనా సెకండ్​ వేవ్‌లో స్టెరాయిడ్ల వినియోగం భారీగా పెరిగింది. కరోనా తీవ్రతను తగ్గించేందుకు రెమ్​డెసివీర్ వంటి యాంటీవైరల్​డ్రగ్‌తో పాటు డెక్సామెథాసోన్, టొసిలోజూమబ్​తదితర స్టెరాయిడ్లను విరివిగా వినియోగించారు. అయితే చాలా మందిలో వైరస్​తీవ్రతను వేగంగా కంట్రోల్​చేసేందుకు ఆక్సిజన్ లెవల్స్​95 ఉన్నా, ఈ మందులను ఇచ్చారు. ఇవి హెవీ డోసులతో కూడినవి కావడంతో తాత్కాలికంగా రోగం తగ్గినా, ఆ డ్రగ్ ప్రభావం ఇతర అవయవాలపై పడుతున్నది. దీంతోనే పోస్ట్​కొవిడ్ సమస్యలు వస్తున్నాయి.

టెస్టులకు వెళ్లడం లేదు..

ప్రస్తుతం సీజనల్​ వ్యాధుల ప్రభావమే అత్యధికంగా ఉండటంతో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు తేలినా కరోనా టెస్టులకు వెళ్లడం లేదు. దీంతో వైరస్ లంగ్స్‌ పై దాడి చేసే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. అంతేగాక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉన్నదని హెచ్చరించారు. ఈక్రమంలో పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం తేలినా వెంటనే కరోనా టెస్టు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతనే మిగతా చికిత్స కొరకు వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం టెస్టులకు వస్తున్న ప్రతీ వంద మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే కరోనా పాజిటివ్​ తేలుతుందన్నారు.

Tags:    

Similar News