ఇతర దేశాల కంటే భారత్‌లోనే యువత ఆత్మహత్యలు ఎక్కువ
ఇతర దేశాల కంటే భారత్‌లోనే యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: ఇతర దేశాల కంటే భారత్‌లోనే యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ డేటా వచ్చింది. భారత్‌లో 15-19 సంవత్సరాల మధ్య యువత మరణాల్లో ఎక్కువగా ఆత్మహత్యలే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, ఆత్మహత్యలకు పాల్పడే కేసుల్లో 40 శాతానికి పైగా 30 ఏళ్లలోపు వారే. గ్లోబల్ యావరేజ్‌తో పోలిస్తే భారత్‌లో ఆత్మహత్య చేసుకున్న యువత సంఖ్య దాదాపు రెట్టింపు. ఇండియాలో రోజుకు సుమారు 160 మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నంద్ కుమార్ చెప్పారు.
డేటా ప్రకారం, 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించే ప్రధాన కారణాలు.. ఒత్తిడితో కూడిన కుటుంబ వాతావరణం, ఒంటరితనం, చిన్న చిన్న భావోద్వేగాలను కూడా కంట్రోల్ చేసుకోలేకపోవడం, సంబంధాలు విడిపోవడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఆత్మహత్యలతో ప్రతి సంవత్సరం 7,00,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. వీటిలో ఎక్కువ మరణాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యల రేటును తగ్గించడానికి ఎక్కువ అవగాహన, అంతర్లీన సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి హెల్ప్‌లైన్ వంటి కార్యక్రమాలను మరిన్నింటిని ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.