యువత భారత వారసత్వ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు.
జైపూర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్యమైన భారత వారసత్వ ప్రాముఖ్యతను యువత తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని అన్నారు. సోమవారం రాజస్థాన్ బికనీర్‌లో నిర్వహించిన 14వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతీయను సజీవంగా ఉంచేందుకు ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రాథమిక సూత్రాలు, విలువలను కొనసాగించాలని ఆమె అన్నారు. మార్పు అనేది జీవిత నియమమని చెప్పారు.
గ్రామాల్లో దాగి ఉన్న కళలను, కళాకారులను గుర్తించి, వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి మార్చి 5 వరకు ఈ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సాంస్కృతిక మహోత్సవం లో భారతదేశ వ్యాప్తంగా కళాకారులు భాగమయ్యారు. ఈ ఉత్సవం ద్వారా దేశంలోని వివిధ కళలు, వంటకాలు, హస్తకళలకు ఒకే చోట గుర్తింపు తెచ్చే ప్రయత్నం గా ఉంది.