Donald Trump: యువ ఓటర్లంతా ట్రంప్ వైపే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకెళ్తున్నారు. ఆయన వైపు యువ ఓటర్లు ఎక్కువగా మొగ్గినట్లు తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకెళ్తున్నారు. ఆయన వైపు యువ ఓటర్లు ఎక్కువగా మొగ్గినట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్ ఓట్ కాస్ట్‌లో ఈవిషయం వెల్లడైంది. ఈసారి ట్రంప్-హారిస్ (Kamala Harris) పోరు కూడా 2020 ఎన్నికలను తలపిస్తోందని వెల్లడించింది. అప్పటితో పోలిస్తే చాలా డెమోగ్రఫిక్ గ్రూపులు ఈసారి ట్రంప్ వైపు ఉన్నట్లు తేలింది. వీరిలో చాలామంది యువ ఓటర్లే ఉన్నట్లు అంచనా వేసింది. 30ఏళ్ల లోపు వారిలో గతంలో పదింట ముగ్గురు మాత్రమే ట్రంప్ కోసం మద్దతివ్వగా.. ఈసారి ఆ సంఖ్య పదింట నాలుగుకి చేరింది. 2020 ఎన్నికల్లో 18-21 మధ్య ఉన్నవారు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ వయస్కుల్లో 50 శాతం మంది పోలింగ్ కేంద్రాల వద్ద అప్పట్లో బారులు తీరి ఓట్లేశారు. ప్రస్తుతం అమెరికాలో జనరేషన్ జీ ఓటర్లు దాదాపు 4.1 కోట్ల మంది ఉన్నట్లు టఫ్ట్స్ యూనివర్శిటీ అంచనా వేసింది.
ముందంజలో ట్రంప్
ఇకపోతే, అమెరికా ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగానే సాగుతోంది. తొలుత ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. కమలా హ్యారిస్ కూడా బలంగా పుంజుకున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్ 230 ఎలక్టోరల్ సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) 192 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. అటు పెన్సిల్వేనియాలో తొలుత హ్యారిస్ జోరు కనబడగా.. ప్రస్తుతం ట్రంప్ ముందంజలోకి వచ్చారు.
Read More..
Trump Vs Kamala: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ షురూ.. స్వల్ప ఆధిక్యంలో డొనాల్డ్ ట్రంప్